డీఈవో లేని చిత్తూరు విద్యాశాఖ..
డీఈవో లేని చిత్తూరు విద్యాశాఖ..
పరిపాలనపై తీవ్ర ప్రభావం
విద్యా సంవత్సరం ప్రారంభమైనా ఖాళీగానే జిల్లా విద్యాశాఖ అధికారి కుర్చీ
పర్యవేక్షణ, ప్రవేశాలు, పాఠ్యసామగ్రి పంపిణీ, గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు మందగింపు
జిల్లా విద్యా వ్యవస్థకు ‘కెప్టెన్’ లేక ఇబ్బందులు
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)
కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమై పాఠశాలలు తెరుచుకుని రెండు వారాలు దాటినా చిత్తూరు జిల్లాకు ఇప్పటికీ రెగ్యులర్ జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) నియామకం జరగకపోవడం విద్యావర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత నెలాఖరులో డీఈవోగా పనిచేసిన రాజేంద్రప్రసాద్ పదవీ విరమణ చేసినప్పటి నుంచి జిల్లా విద్యాశాఖ అధికారి కుర్చీ ఖాళీగానే ఉంది. తాత్కాలికంగా విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించినప్పటికీ పూర్తి స్థాయి డీఈవో లేకపోవడం వల్ల జిల్లా విద్యాశాఖ పరిపాలనలో మందగమనం కనిపిస్తున్నట్లు ఉపాధ్యాయ సంఘాలు, విద్యావేత్తలు పేర్కొంటున్నారు.
సాధారణంగా ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభం జిల్లా విద్యాశాఖకు అత్యంత కీలకమైన కాలంగా భావిస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపు, డ్రాప్‌అవుట్ విద్యార్థులను తిరిగి పాఠశాలల్లో చేర్పించడం, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫారాలు, విద్యా కిట్ల పంపిణీ, మధ్యాహ్న భోజన పథకం అమలు, పాఠశాలల్లో మౌలిక వసతుల పరిశీలన, ఉపాధ్యాయుల హాజరు, బోధనా ప్రమాణాల పర్యవేక్షణ వంటి అంశాలన్నింటినీ జిల్లా విద్యాశాఖ అధికారి సమన్వయం చేస్తారు. జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్ పాఠశాలల పనితీరును పర్యవేక్షించడం, మండల విద్యాశాఖ అధికారులకు మార్గనిర్దేశం చేయడం, ప్రభుత్వ విద్యా కార్యక్రమాలను అమలు చేయడం, పదో తరగతి సహా పలు పరీక్షల నిర్వహణలో సమన్వయం చేయడం, గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవడం వంటి కీలక బాధ్యతలు డీఈవో పరిధిలో ఉంటాయి. అయితే ప్రస్తుతం పూర్తి స్థాయి అధికారి లేకపోవడంతో అనేక అంశాల్లో నిర్ణయాలు ఆలస్యమవుతున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచేందుకు చేపట్టాల్సిన ప్రత్యేక కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో జరగడం లేదని సమాచారం. ప్రతి సంవత్సరం జూన్ నెలలో డీఈవో మండలాల వారీగా సమీక్షలు నిర్వహించి ప్రవేశాల లక్ష్యాలను నిర్దేశిస్తారు. ఈసారి అలాంటి కసరత్తు పెద్దగా కనిపించడం లేదని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫారాలు, ఇతర విద్యా సామగ్రి సరఫరా, పంపిణీ ప్రక్రియపై కూడా జిల్లా స్థాయి పర్యవేక్షణ అవసరమవుతుంది. ఏ పాఠశాలలో ఏ వస్తువులు అందాయి, ఎక్కడ కొరత ఉంది, ఎక్కడ పంపిణీ పూర్తి కాలేదు అనే అంశాలపై సమీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆ ప్రక్రియ మందగించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచేందుకు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులను ఆకర్షించే కార్యక్రమాలు చేపట్టాల్సిన సమయంలో నాయకత్వ లోపం కనిపిస్తోందని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. గుర్తింపు లేని ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవడం, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న విద్యాసంస్థలపై తనిఖీలు నిర్వహించడం కూడా డీఈవో బాధ్యతల్లో ముఖ్యమైనవి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంలో సాధారణంగా ఈ తనిఖీలు ఎక్కువగా జరుగుతాయి. కానీ ఈసారి ఆ దిశగా ఆశించిన స్థాయిలో చర్యలు కనిపించడం లేదని విద్యా రంగానికి చెందిన పలువురు పేర్కొంటున్నారు. జిల్లాలో వేలాది మంది ఉపాధ్యాయులకు సంబంధించిన సేవా అంశాలు, సెలవులు, పదోన్నతులు, వేతనాలకు సంబంధించిన ఫైళ్లు, క్రమశిక్షణా చర్యలు, పరిపాలనా అనుమతులు కూడా జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ద్వారానే పరిష్కారం కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం పూర్తి స్థాయి అధికారి లేకపోవడంతో కొన్ని ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. మండల విద్యాశాఖ అధికారులకు కూడా కీలక అంశాల్లో స్పష్టమైన మార్గదర్శకాలు అందకపోవడంతో పనులు మందగిస్తున్నాయని తెలుస్తోంది.
డీఈవో కోసం పోటాపోటీ !
ఇదిలా ఉండగా చిత్తూరు జిల్లా డీఈవో పోస్టు కోసం పలువురు అధికారులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు విద్యాశాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో చిత్తూరు జిల్లాలో డీఈవోగా పనిచేసిన పురుషోత్తం మరోసారి ఈ జిల్లాకు రావాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అదే విధంగా గతంలో చిత్తూరులో పనిచేసి జిల్లాపై మంచి అవగాహన కలిగిన విజయేంద్ర రాములు కూడా ఈ పోస్టు కోసం లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అన్నమయ్య జిల్లా డీఈవోగా ఉన్న సుబ్రహ్మణ్యం పేరు కూడా బలంగా వినిపిస్తోంది. పరిపాలనా అనుభవం, సీనియారిటీ ఆధారంగా ఆయనకు అవకాశం లభించే అవకాశాలు ఉన్నాయని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. అలాగే అనంతపురం జిల్లా డీఈవో ప్రసాద్‌బాబు కూడా చిత్తూరుకు రావడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. కర్నూలు డైట్‌లో సీనియర్ లెక్చరర్‌గా పనిచేస్తున్న అబ్దుల్ సాహెబ్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. విద్యా పరిపాలనలో అనుభవం ఉన్న అధికారి కావడంతో ఆయన పేరును కూడా కొందరు ఉన్నతాధికారులు ప్రతిపాదించినట్లు సమాచారం. మరోవైపు ప్రస్తుతం ప్రాంతీయ విద్యాశాఖ కార్యాలయంలో (ఆర్జేడీ కార్యాలయం) పనిచేస్తున్న మొవ్వ గోవిందు కూడా చిత్తూరు డీఈవో పోస్టుపై ఆసక్తి కనబరుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఇద్దరు అధికారుల పేర్లను ఉన్నతాధికారులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పరిశీలనకు పంపినట్లు, అయితే ఆ ప్రతిపాదనలపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేయలేదని విద్యాశాఖ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. దీంతో ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయానికి రాకపోవడంతో నియామకం మరింత ఆలస్యమవుతోందని తెలుస్తోంది. అయితే అధికారికంగా ఈ విషయంపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన సమయంలోనే జిల్లా విద్యాశాఖ అధికారి కుర్చీ ఖాళీగా ఉండటం వల్ల విద్యార్థుల ప్రవేశాలు, ప్రభుత్వ పథకాల అమలు, పాఠ్యసామగ్రి పంపిణీ, పాఠశాలల పర్యవేక్షణ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం వంటి అంశాలపై ప్రభావం పడే అవకాశం ఉందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖలో పరిపాలనకు వేగం రావాలంటే ప్రభుత్వం వీలైనంత త్వరగా చిత్తూరు జిల్లాకు రెగ్యులర్ డీఈవోను నియమించాలని ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు, విద్యా రంగ వర్గాలు కోరుతున్నాయి. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఈ కుర్చీపై ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందన్నది జిల్లా విద్యావర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.

