పంతం నెగ్గించుకున్న భీమినేని చిట్టిబాబు..
పంతం నెగ్గించుకున్న భీమినేని చిట్టిబాబు..
జీడీ నెల్లూరు టీడీపీలో కొత్త సమీకరణాలు
మండల అధ్యక్ష పదవులు దక్కించుకున్న చిట్టిబాబు వర్గం..
వెదురుకుప్పంలో అసమ్మతి సమావేశం
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)
గంగాధర నెల్లూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో ఏడాదిగా కొనసాగుతున్న వర్గపోరులో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి భీమినేని చిట్టిబాబు నాయుడు పైచేయి సాధించారు. తన వర్గానికి చెందిన ఎం.వాసుదేవ నాయుడును పాలసముద్రం మండల పార్టీ అధ్యక్షునిగా, గురసాల కిషన్ చంద్‌ను వెదురుకుప్పం మండల అధ్యక్షునిగా నియమింపజేసుకోవడంలో విజయవంతమయ్యారు. అధిష్టానం ఆదేశాల మేరకు చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడు చెక్కుడుకుప్పం షణ్ముగం శనివారం ఈ నియామకాలను ప్రకటించారు. అయితే ఈ నియామకాలలో వెదురు కుప్పం మండల పార్టీ అధ్యక్షుని విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. వెదురు కుప్పం మండల పార్టీ అధ్యక్షుడిగా కిషన్ చాంద్ ను నియమించడం పట్ల ఆదివారం ఆ మండల నాయకులు సమావేశం అయ్యారు. ఆయన నియమకాన్ని తీవ్రంగా ఖండించారు. తమ అధిష్టానానికి, ఎమ్మెల్యేకి వ్యతిరేకం కాదని, అయితే కిషన్ చాంద్ నాయకత్వంలో పనిచేయలేదని స్పష్టం చేశారు. ఈ ప్రభావం రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతిబింబిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
2024 ఎన్నికల అనంతరం ఎమ్మెల్యే థామస్, భీమినేని చిట్టిబాబు వర్గానికి దూరంగా వ్యవహరించడంతో ఇద్దరి మధ్య విభేదాలు ముదిరాయి. ఒకరిపై ఒకరు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకునే స్థాయికి పరిస్థితులు చేరుకున్నాయి. వైసీపీ నుంచి వచ్చిన కొందరు నాయకులకు ఎమ్మెల్యే ప్రాధాన్యత కల్పిస్తున్నారని చిట్టిబాబు ఆరోపించడంతో పాటు నియోజకవర్గంలో ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణా జరుగుతోందంటూ కూడా అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది జరిగిన మండల కమిటీల నియామకాల సమయంలో ఎమ్మెల్యే జోక్యంతో చిట్టిబాబు వర్గానికి ప్రాధాన్యం దక్కలేదని ఆయన అనుచరులు భావించారు. చిట్టిబాబు సొంత మండలమైన పాలసముద్రంలో ప్రత్యర్థి వర్గానికి చెందిన శివానాయుడుకు బాధ్యతలు అప్పగించగా, వెదురుకుప్పం మండల అధ్యక్షునిగా ఎస్సీ వర్గానికి చెందిన మోహన్ మురళి నియమితులయ్యారు. దీంతో ఎమ్మెల్యే థామస్‌తో చిట్టిబాబు పూర్తిగా దూరమయ్యారు. పలుమార్లు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్‌ను కలిసి ఎమ్మెల్యేపై ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. అనంతరం అధిష్టానం జోక్యం చేసుకుని ఇద్దరు నేతలు కలిసి పనిచేయాలని సూచించడంతో రాజీ కుదిరినట్లు తెలుస్తోంది. ఆ మేరకు పి.ఎం. చంద్రశేఖర్‌ను తప్పించి పాలసముద్రం మండల అధ్యక్షునిగా వాసుదేవ నాయుడు, వెదురుకుప్పం మండల అధ్యక్షునిగా కిషన్ చంద్‌ను నియమించారు.
అయితే వెదురుకుప్పం మండల అధ్యక్ష పదవికి కిషన్ చంద్ నియామకంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆదివారం వెదురుకుప్పంలో ఎస్సీ, రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన నాయకులు అసమ్మతి సమావేశం నిర్వహించారు. పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి కోనేరు చెంగల్‌రాయరెడ్డి అధ్యక్షతన, మండల కమిటీ అధ్యక్షుడు మోహన్ మురళి, రాష్ట్ర సాంస్కృతిక విభాగం ప్రధాన కార్యదర్శి ఎన్.మునిచంద్రారెడ్డి నాయకత్వంలో జరిగిన సమావేశంలో పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. ఓటు హక్కు కూడా లేని ఎన్‌ఆర్‌ఐ అయిన కిషన్ చంద్‌ను మండల అధ్యక్షునిగా నియమించడం అనైతికమని నాయకులు అభిప్రాయపడ్డారు. తాము పార్టీకి విధేయులమని, ఎమ్మెల్యే థామస్ అభిమానులమే అయినప్పటికీ కిషన్ చంద్‌తో కలిసి పనిచేయలేమని స్పష్టం చేశారు. వారం క్రితమే పార్లమెంటు అధ్యక్షుడు చెక్కుడుకుప్పం షణ్ముగంను కలిసి తమ అభిప్రాయాలను వెల్లడించినా పట్టించుకోకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఓట్లు కలిగిన ఎస్సీ వర్గానికి కేటాయించిన రెండు మండలాల్లో ఒకటి తొలగించి బీసీ వర్గానికి ఇవ్వడం సామాజిక న్యాయ సూత్రాలకు విరుద్ధమని విమర్శించారు. జనాభాలో రెండో స్థానంలో ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి ఒక్క మండల అధ్యక్ష పదవి కూడా కేటాయించకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి సహకరిస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి శ్రీనాథ్ రెడ్డి, ఉపాధ్యక్షుడు అక్కిం మధు, క్లస్టర్ కన్వీనర్లు చంద్రబాబు రెడ్డి, రమణారెడ్డి, మాజీ ఎంపీటీసీ యూనిట్ కన్వీనర్ భాస్కర్ రెడ్డి, యూనిట్ కన్వీనర్ కిరణ్ యాదవ్, మాజీ సర్పంచులు విశ్వనాథ్ యాదవ్, బాబురెడ్డి, అబుల్ రెడ్డి, నీటి సంఘం అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు వరప్రసాద్, ధర్మారెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ మనోహర్ నాయుడు, టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి విక్రం రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడు ప్రసాద్, గ్రామ కమిటీ అధ్యక్షులు నాదమునిరెడ్డి, భాస్కర్ రెడ్డి, బాబునాయుడు, రామకృష్ణారెడ్డి, అనిల్ కుమార్, అంబురాసి, ప్రభాకర్ రెడ్డి, గుణశేఖర్, గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శులు పోతుగంటి వెంకటేష్, బొమ్మలదొడ్డి వెంకటేష్, సురేష్ ముదిరాజ్, గాంధీ, బూత్ కన్వీనర్లు శ్రీధర్, హేమశేఖర్ రెడ్డి, సీనియర్ నాయకులు యువకుమార్ రెడ్డి, మారేపల్లి భాస్కర్, దాము రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జీడీ నెల్లూరు టీడీపీలో ప్రస్తుతం అసమ్మతి నివురు కప్పిన నిప్పులా ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఎమ్మెల్యే థామస్, భీమినేని చిట్టిబాబు మధ్య కుదిరిన రాజీని కొందరు నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని, సామాజిక వర్గాల సమీకరణలపై నెలకొన్న అసంతృప్తి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు.

