19, ఆగస్టు 2026, బుధవారం

జిల్లాలో జోరుగా తోతాపురి మామిడి రైతుల సర్వే


జిల్లాలో జోరుగా తోతాపురి మామిడి రైతుల సర్వే

ఎకరాకు గరిష్టంగా ఆరు టన్నులు పరిగణలోకి

మద్దతు ధరకు భూమి పాసుపుస్తకం బిల్లులు ఒకే పేరుతో ఉండాలి

మామిడి పంట ఈ-క్రాప్ నమోదు అయి ఉండాలి

మద్దతు ధర కోసం జిల్లాలో భారీగా అవకతవకలు జరిగినట్లు నిర్ధారణ

మరో నెల రోజుల్లో సర్వే నివేదిక రెడీ అయ్యే అవకాశం

(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)

 తోతాపురి మామిడి రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కిలోకు రూ.4 మద్దతు ధరను అర్హులైన రైతులకే అందించేందుకు జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో సర్వేను ముమ్మరం చేసింది. మామిడి రైతులకు మద్దతు ధర చెల్లింపుల్లో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా ఫ్యాక్టరీలు, రాంపులు, మండల స్థాయి అధికారులు, రైతు భరోసా కేంద్రాల ద్వారా సేకరించిన వివరాలను సమగ్రంగా పరిశీలిస్తున్నారు. వాస్తవంగా మామిడి తోటలు కలిగి, వాటి నుంచి దిగుబడిని తీసి ఫ్యాక్టరీలకు సరఫరా చేసిన రైతులనే గుర్తించి వారికి ప్రయోజనం కల్పించాలన్న లక్ష్యంతో జాబితాల వడపోత కొనసాగుతోంది.

ఫ్యాక్టరీలలో తోతాపురి మామిడి కాయలను సరఫరా చేసిన రైతుల వివరాలను ఇప్పటికే సేకరించారు. రైతుల నుంచి భూమి పాసుపుస్తకం, బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్ నంబరు తదితర పత్రాల జిరాక్స్ ప్రతులను తీసుకున్నారు. ఫ్యాక్టరీల వద్ద పత్రాలు అందించని రైతుల వివరాలను గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల ద్వారా కూడా సేకరిస్తున్నారు. ఇలా సేకరించిన రైతుల వివరాలను గ్రామస్థాయిలో ప్రదర్శించి, వాటిపై అభ్యంతరాలు, వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తున్నారు. రైతు పేరు, భూమి వివరాలు, మామిడి సరఫరా చేసిన వివరాలు, ఈ-క్రాప్ నమోదు తదితర అంశాలను ఒకదానితో ఒకటి సరిపోల్చి చూస్తున్నారు. మద్దతు ధర పొందాలంటే రైతుకు వాస్తవంగా మామిడి తోట, భూమి ఉండటం ప్రధాన నిబంధనగా అధికారులు పరిగణిస్తున్నారు. భూమి లేకుండా మామిడి కాయలను ఫ్యాక్టరీలకు సరఫరా చేసిన వారిని అర్హుల జాబితాలో చేర్చడం లేదు. సంబంధిత రైతు పేరుతో భూమి ఉండటం, ఆ భూమిలో సాగు చేసిన మామిడి పంటకు ఈ-క్రాప్ నమోదు అయి ఉండటం వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. ఏదైనా ప్రత్యేక కారణంతో ఈ-క్రాప్ నమోదు కాకపోయిన రైతుల విషయంలో మాత్రం క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించి ప్రత్యేక కేసులుగా పరిగణించే అవకాశం కల్పిస్తున్నారు. ఒక్కో రైతు నుంచి గరిష్టంగా ఆరు టన్నుల మామిడి దిగుబడిని మాత్రమే మద్దతు ధరకు పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఆరు టన్నులకు మించి ఫ్యాక్టరీలకు సరఫరా చేసిన మామిడి పరిమాణాన్ని మద్దతు ధర లెక్కల్లో నుంచి తొలగిస్తున్నారు. ఈ నిబంధన కారణంగా ఒకే రైతు పేరుతో అధిక మొత్తంలో మామిడి సరఫరా చేసినట్లు నమోదైన వివరాలను ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. రైతు భూమి విస్తీర్ణం, తోటలో ఉన్న చెట్లు, ఈ-క్రాప్‌లో నమోదైన పంట విస్తీర్ణం, గతంలో వచ్చిన దిగుబడి, ఈ ఏడాది సరఫరా చేసిన పరిమాణం తదితర అంశాలను పోల్చి చూస్తున్నారు. కుటుంబంలో ఎవరి పేరుతో భూమి ఉందన్నది, ఎవరి పేరుతో మామిడి కాయలు ఫ్యాక్టరీకి సరఫరా చేశారన్నది కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మరణించి ఉంటే వారి పేరుతో నమోదైన మామిడి సరఫరా వివరాలను కూడా వాస్తవ పరిస్థితుల ఆధారంగా పరిశీలిస్తున్నారు. భూమి ఒకరి పేరుతో ఉండి, మామిడిని మరొకరి పేరుతో సరఫరా చేసిన సందర్భాల్లో కుటుంబ సంబంధం ఉందా లేదా అన్నదాన్ని నిర్ధారిస్తున్నారు. తండ్రి పేరుతో భూమి ఉండి కుమారుడు లేదా కుమార్తె మామిడిని సరఫరా చేసినా, సోదరి పేరుతో భూమి ఉండి సోదరుడు సరఫరా చేసినా, భార్యాభర్తల్లో ఒకరి పేరుతో భూమి ఉండి మరొకరు మామిడిని ఫ్యాక్టరీకి అందించినా రక్తసంబంధం, కుటుంబ సంబంధాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. అయితే భూమి యజమానితో ఎలాంటి కుటుంబ సంబంధం లేని వ్యక్తులు మామిడిని సరఫరా చేసినట్లు తేలితే అటువంటి వివరాలను అర్హుల జాబితా నుంచి తొలగిస్తున్నారు. మామిడి రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను కొందరు దుర్వినియోగం చేసేందుకు ముందస్తు ప్రణాళికతో వ్యవహరించినట్లు సర్వేలో అనేక అనుమానాస్పద అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. తమిళనాడు ప్రాంతాల నుంచి మామిడిని కొనుగోలు చేసి చిత్తూరు జిల్లాలోని ఫ్యాక్టరీలకు రైతుల పేర్లతో సరఫరా చేసినట్లు కొన్ని వివరాల్లో గుర్తించినట్లు ఉద్యానవన శాఖ అధికారులు పరిశీలనలో తేల్చారు. ఒకే ట్రాక్టర్ నంబరుతో ఒకే రోజున రెండు, మూడు సార్లు మామిడిని ఫ్యాక్టరీలకు సరఫరా చేసినట్లు నమోదైన రికార్డులను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. కొన్ని రాంపుల్లో ఒక్కో రైతు పేరుతో భారీ మొత్తంలో మామిడి సరఫరా చేసినట్లు రికార్డులు ఉండటంతో వాటిపైనా దృష్టి సారించారు. వాస్తవంగా మామిడి కాయలు సరఫరా చేయకపోయినా సరఫరా చేసినట్లు బిల్లులు, రికార్డులు సృష్టించారా అన్న కోణంలోనూ పరిశీలన జరుగుతోంది. రాంపుల యజమానులు ఇష్టానుసారంగా బిల్లులు జారీ చేసి ఉంటే వాటిని గుర్తించి సంబంధిత రికార్డులను తొలగించే చర్యలు చేపడుతున్నారు. ఫ్యాక్టరీలు, రాంపులు, మధ్యవర్తులు, వ్యాపారులు కుమ్మక్కై ప్రభుత్వ మద్దతు ధరను దుర్వినియోగం చేయకుండా ప్రతి దశలోని రికార్డులను సరిపోల్చుతున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుత ఏడాది మామిడి సరఫరా వివరాలతో పాటు సంబంధిత రైతు గత రెండు, మూడు సంవత్సరాల్లో ఫ్యాక్టరీలకు సరఫరా చేసిన మామిడి పరిమాణాన్ని కూడా పరిశీలిస్తున్నారు. రైతు వద్ద ఉన్న భూమి విస్తీర్ణానికి అనుగుణంగా దిగుబడి వచ్చిందా, ఈ-క్రాప్‌లో నమోదైన మామిడి పంట విస్తీర్ణానికి అనుగుణంగా సరఫరా చేసిన పరిమాణం ఉందా, గతంలో నమోదైన సరఫరా వివరాలతో ఈ ఏడాది వివరాలు సరిపోతున్నాయా, ఒకే వ్యక్తి వివిధ పేర్లతో మామిడిని సరఫరా చేశారా అనే అంశాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. దీంతో మద్దతు ధర చెల్లింపుల్లో మధ్యవర్తులు, దళారులు, వ్యాపారులు, ఫ్యాక్టరీలు, రాంపుల స్థాయిలో జరిగే అవకాశం ఉన్న అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని యంత్రాంగం భావిస్తోంది. గత ఏడాది జిల్లాలో సుమారు 6 లక్షల టన్నుల తోతాపురి మామిడి దిగుబడి నమోదైనట్లు అధికారులు చెబుతుండగా, ఈ ఏడాది సుమారు 3.94 లక్షల టన్నుల దిగుబడి మాత్రమే నమోదైనట్లు రికార్డులు సూచిస్తున్నాయి. ఫ్యాక్టరీలు, మండలాలు, రాంపుల స్థాయిలో సేకరించిన వివరాలను సమగ్రంగా క్రోడీకరించి అర్హులైన రైతులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలో సుమారు 3.95 లక్షల మంది రైతులు మామిడి పంటను సరఫరా చేసినట్లు ప్రాథమిక వివరాలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం జరుగుతున్న క్షుణ్ణమైన పరిశీలనలో ఈ సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. గ్రామస్థాయిలో రైతుల జాబితాలను ప్రదర్శించి వాస్తవ పరిస్థితులను పరిశీలించడం, రైతుల నుంచి పత్రాలు తీసుకోవడం, భూమి వివరాలతో సరఫరా బిల్లులను సరిపోల్చడం, ఈ-క్రాప్ నమోదును పరిశీలించడం వంటి ప్రక్రియలు వేగంగా సాగుతున్నాయి. మరో నెల రోజుల్లో సర్వే, జాబితాల వడపోత పూర్తయి తుది నివేదిక సిద్ధమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా మామిడి తోటలు కలిగి, తమ తోటల నుంచి దిగుబడిని తీసి ఫ్యాక్టరీలకు సరఫరా చేసిన రైతులకు మాత్రమే ప్రభుత్వం ప్రకటించిన రూ.4 మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు అనర్హులు, దళారులు, మధ్యవర్తులు, అక్రమంగా బిల్లులు సృష్టించిన వారిని జాబితా నుంచి తొలగించేందుకు జిల్లా యంత్రాంగం భారీ కసరత్తు చేస్తోంది. దీంతో ఈ ఏడాది మద్దతు ధరకు అర్హత పొందే మామిడి రైతుల సంఖ్య ప్రాథమిక జాబితాలతో పోలిస్తే గణనీయంగా తగ్గే అవకాశం కనిపిస్తోంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *