చెరకు రైతులకు తీపి రోజులు!
చెరకు రైతులకు తీపి రోజులు!
చక్కెర ధరలకు రెక్కలు.. మద్దతు ధర పెంపుపై ఆశలు
ఏటా క్షీణిస్తున్న చెరకు సాగు.. 35 వేల హెక్టార్ల నుంచి 4,500 హెక్టార్లకు పతనం
ఫ్యాక్టరీలు మూతపడటంతో తగ్గిన చెరకు.. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తే పునర్‌వైభవం
బకాయిల చెల్లింపులకు జిల్లా కలెక్టర్ చొరవ.. ఈ క్రషింగ్ సీజన్‌పై రైతుల్లో కొత్త ఆశలు
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)
ఒకప్పుడు చెరకు సాగుతో కళకళలాడిన ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రమంగా ఆ పంటకు దూరమైంది. చక్కెర కర్మాగారాలు మూతపడటం.. రైతులకు సకాలంలో బిల్లులు అందకపోవడం.. కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న మద్దతు ధరకు, పెరుగుతున్న సాగు వ్యయానికి పొంతన లేకపోవడం.. కూలీల కొరత, అధిక కూలీ రేట్లు వంటి కారణాలతో వేలాది మంది రైతులు చెరకు సాగును వదిలేశారు. ఒకప్పుడు సుమారు 35 వేల హెక్టార్లలో సాగైన చెరకు ప్రస్తుతం కేవలం 4,500 హెక్టార్లకే పరిమితమైంది. దాదాపు 30 వేల హెక్టార్లలో సాగు కనుమరుగైంది. అయితే తాజాగా మార్కెట్లో చక్కెర ధరలు అనూహ్యంగా పెరగడం, చెరకు సాగు భారీగా తగ్గిపోవడం, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన అవసరం పెరగడంతో జిల్లాలో చెరకు రైతులకు మళ్లీ మంచి రోజులు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గతంలో ఆరు వరకు చక్కెర కర్మాగారాలు కార్యకలాపాలు నిర్వహించేవి. వీటిలో సహకార రంగానికి చెందిన రెండు కర్మాగారాలు, ప్రైవేటు రంగంలోని నాలుగు కర్మాగారాలు ఉండేవి. తొలుత సహకార రంగంలోని రెండు కర్మాగారాలు మూతపడ్డాయి. అనంతరం ప్రైవేటు రంగంలోని కర్మాగారాలు కూడా ఒక్కొక్కటిగా మూతపడుతూ వచ్చాయి. చివరకు ప్రస్తుతం జిల్లాలో ఒకే ఒక్క చక్కెర కర్మాగారం కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఒకప్పుడు వేలాది మంది రైతులకు ఆధారంగా ఉన్న చక్కెర పరిశ్రమ నేడు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఫ్యాక్టరీలు మూతపడటంతో చెరకు పంటకు మార్కెట్ తగ్గిపోయింది. మరోవైపు పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లారు. ప్రస్తుతం పనిచేస్తున్న చక్కెర కర్మాగారం కూడా చెరకు రైతులకు సుమారు రూ.37 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. బకాయిల కోసం రైతులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగారు. రైతులకు రావాల్సిన బకాయిలను చెల్లించేలా చర్యలు చేపడుతున్నారు. ఇదే సమయంలో మయూర చక్కెర కర్మాగారం కూడా రైతులకు సుమారు రూ.18 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఫ్యాక్టరీల నుంచి బకాయిలు సకాలంలో అందకపోవడం రైతులను తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురిచేసింది. దీంతో చెరకు సాగు పట్ల రైతుల్లో ఆసక్తి తగ్గుతూ వచ్చింది. మరోవైపు చెరకు సాగు వ్యయం ఏటా పెరుగుతూనే ఉంది. కూలీల చార్జీలు భారీగా పెరగడం, కోత, రవాణా ఖర్చులు అధికం కావడం, ఎరువులు, పురుగు మందులు, ఇతర వ్యవసాయ పెట్టుబడుల ధరలు పెరగడంతో రైతుపై భారం పెరిగింది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న మద్దతు ధర రైతులకు ఆశించిన స్థాయిలో ప్రయోజనం కల్పించలేకపోతోంది. ఈ ఏడాది మే నెలలో కేంద్ర ప్రభుత్వం చెరకు మద్దతు ధరను టన్నుకు రూ.3,383గా ప్రకటించింది. అయితే ఆ తరువాతి నెలల్లో చక్కెర ధరలు అనూహ్యంగా పెరిగాయి. దీంతో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా చెరకు మద్దతు ధరను పునఃసమీక్షించాల్సిన అవసరం ఏర్పడింది.
ఇప్పటివరకు కిలో చక్కెర ధర సుమారు రూ.39 వద్ద ఉండగా హోల్‌సేల్ మార్కెట్లో ప్రస్తుతం రూ.60 వరకు చేరింది. రిటైల్ మార్కెట్లో కిలో చక్కెర రూ.65 నుంచి రూ.75 వరకు పలుకుతోంది. చక్కెర ధర ఇంత భారీగా పెరగడానికి దేశంలో చెరకు సాగు, చక్కెర ఉత్పత్తి తగ్గడం కూడా ఒక ప్రధాన కారణంగా మారింది. చెరకు సాగు తగ్గిపోవడం, కర్మాగారాలు మూతపడటం, కొన్ని కర్మాగారాల్లో పాత యంత్రాలతో ఉత్పత్తి సామర్థ్యం తగ్గడం, చక్కెర రికవరీ శాతం పడిపోవడం వంటి పరిణామాలు పరిశ్రమను మరింత సంక్షోభంలోకి నెట్టాయి. ఒకప్పుడు చెరకు సాగులో అగ్రస్థానంలో ఉన్న చిత్తూరు జిల్లాలో పరిస్థితి ఎంతగా మారిందంటే.. 35 వేల హెక్టార్లలో సాగైన పంట ప్రస్తుతం 4,500 హెక్టార్లకు పడిపోయింది. అంటే సుమారు 30 వేల హెక్టార్లలో చెరకు సాగు తగ్గిపోయింది. రైతులు చెరకు సాగును వదిలేయడంతో కర్మాగారాలకు అవసరమైన ముడిసరుకు లభ్యత కూడా తగ్గిపోయింది. ఫలితంగా కర్మాగారాల నిర్వహణ భారంగా మారి కొన్ని కర్మాగారాలు మూతపడే పరిస్థితి ఏర్పడింది. ఒకదానికొకటి అనుసంధానమైన ఈ సమస్యలన్నీ చివరకు రైతు, పరిశ్రమ రెండింటినీ దెబ్బతీశాయి. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మార్కెట్లో చక్కెర ధరలు గణనీయంగా పెరగడంతో చెరకు రైతులకు కూడా ప్రయోజనం కల్పించాల్సిన అవసరం ఏర్పడింది. పెరిగిన ఉత్పత్తి వ్యయం, కూలీ రేట్లు, రవాణా ఖర్చులు, మార్కెట్లో చక్కెర ధరలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం చెరకు మద్దతు ధరను పునఃసమీక్షించాలని రైతులు కోరుతున్నారు. ప్రస్తుత చక్కెర ధరల నేపథ్యంలో ఈ క్రషింగ్ సీజన్‌కు అదనపు ప్రోత్సాహక ధర ప్రకటిస్తే చెరకు రైతులకు ఊరట లభించే అవకాశం ఉంది. చెరకు సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు ఫ్యాక్టరీల నుంచి బిల్లులు సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. రైతులకు నమ్మకం కలిగితే మళ్లీ చెరకు సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం పనిచేస్తున్న కర్మాగారాలకు అవసరమైన స్థాయిలో చెరకు లభిస్తే వాటి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. మూతపడిన కర్మాగారాలను పునరుద్ధరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే జిల్లాలో చక్కెర పరిశ్రమకు పునర్వైభవం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం రైతులకు రావాల్సిన బకాయిల చెల్లింపులపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించడం కూడా చెరకు రైతుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. బకాయిలు అందడంతో పాటు రానున్న క్రషింగ్ సీజన్‌లో గిట్టుబాటు ధర లభిస్తే రైతులు మళ్లీ చెరకు సాగు వైపు మళ్లే అవకాశం ఉంది. ఒకప్పుడు చిత్తూరు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన చెరకు సాగు మళ్లీ పుంజుకుంటే రైతులతో పాటు చక్కెర కర్మాగారాలు, వాటిపై ఆధారపడిన కార్మికులకు కూడా ఉపాధి లభిస్తుంది. చక్కెర ధరలు పెరిగిన ఈ సమయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపైనే చెరకు రైతుల భవిష్యత్తు ఆధారపడి ఉంది. మద్దతు ధరను ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పెంచడంతో పాటు బకాయిలను పూర్తిగా చెల్లించి, మూతపడిన కర్మాగారాల పునరుద్ధరణకు చర్యలు చేపడితే చిత్తూరు జిల్లాలో చెరకు సాగుకు మళ్లీ పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉంది. ఎన్నాళ్లుగానో నష్టాలను భరిస్తూ చెరకు సాగు చేసిన రైతులకు ఈసారి లాభాల తీపి అందే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చక్కెర ధరల పెరుగుదల రైతులకు కూడా అందితే.. మూతపడిన పరిశ్రమలకు ఊపిరి వస్తే.. జిల్లాలో చెరకు పంట విస్తీర్ణం మళ్లీ పెరిగితే.. ఒకప్పుడు చిత్తూరు నేలపై కనిపించిన చెరకు తోటలు తిరిగి దర్శనమివ్వడం ఖాయమనే ఆశాభావం రైతుల్లో వ్యక్తమవుతోంది. చక్కెర ధరల పెరుగుదలతో మొదలైన ఈ పరిణామాలు నిజంగానే రైతుల జీవితాల్లో తీపి రోజులకు నాంది పలకాలని కోరుకుందాం.

