అభివృద్ధి పనులకు శ్రీకారం.. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు
అభివృద్ధి పనులకు శ్రీకారం.. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు
రక్త నిధి కేంద్రం, రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయం ప్రారంభం
రూ.52 లక్షలతో నిర్మించిన పార్కు ప్రారంభం ..
పలమనేరు రోడ్డు విస్తరణకు భూమిపూజ
బయోగ్యాస్ యూనిట్లపై విస్తృత అవగాహన కల్పించాలి: మంత్రి సత్యకుమార్ యాదవ్
చిత్తూరు, ఆగస్టు 15 (ఆంధ్రప్రభ బ్యూరో) : చిత్తూరు నగర అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తూ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం చిత్తూరు నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. చిత్తూరు పట్టణంలో నూతనంగా నిర్మించిన ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రక్తదాన కేంద్రం, జిల్లా శాఖ కార్యాలయాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. అత్యవసర సమయాల్లో రక్తం అందుబాటులో ఉండేందుకు రక్తదాన కేంద్రాలు ఎంతో కీలకమని, ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాలని ఈ సందర్భంగా సూచించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్, చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ తేజోమూర్తి ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం నగరపాలక సంస్థ పరిధిలోని దర్గా సర్కిల్ నుంచి ఇరువారం ఆంజనేయస్వామి ఆలయం వరకు పలమనేరు రోడ్డు విస్తరణ, అభివృద్ధి, సెంట్రల్ లైటింగ్, కాలువల నిర్మాణ పనులకు మంత్రి సత్యకుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్, చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్, పార్లమెంట్ సభ్యుడు దగ్గుమళ్ల ప్రసాదరావు కలిసి భూమిపూజ చేశారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. అంతర్గత రహదారులతో పాటు ప్రధాన రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని, నగర ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని, సూపర్ సిక్స్ హామీలతో పాటు ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలను ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు. చిత్తూరు కలెక్టరేట్ వద్ద రూ.52 లక్షలతో నూతనంగా నిర్మించిన పార్కును కూడా మంత్రి ప్రారంభించారు. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంతో పాటు పట్టణంలో పచ్చదనాన్ని పెంచేందుకు ఇటువంటి పార్కులు ఉపయోగపడతాయని తెలిపారు. కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యుడు దగ్గుమళ్ల ప్రసాదరావు, జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్, జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ తదితరులు పాల్గొన్నారు.
బయోగ్యాస్ యూనిట్‌తో రైతులకు ప్రయోజనం
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా అధికారులు ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను మంత్రి సత్యకుమార్ యాదవ్ పరిశీలించారు. ఇందులో భాగంగా బయోగ్యాస్ స్టాల్‌ను ప్రత్యేకంగా పరిశీలించి నిర్వాహకులను అభినందించారు. పశువుల పేడతో బయోగ్యాస్ ఉత్పత్తి చేయడం, దానిని వంట గ్యాస్‌గా వినియోగించడంతో పాటు ప్లాంట్ నుంచి వెలువడే వ్యర్థాలను సేంద్రియ వ్యవసాయానికి ఉపయోగించే విధానం గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. బయోగ్యాస్ యూనిట్‌కు రోజుకు సుమారు 40 కిలోల పశువుల పేడ అవసరమవుతుందని, ప్రతిరోజూ పేడను ప్లాంట్‌లో వేస్తే రెండో రోజు నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి ప్రారంభమవుతుందని నిర్వాహకులు మంత్రికి వివరించారు. ఒక నెలలో సుమారు ఒకటిన్నర సిలిండర్లకు సమానమైన వంట గ్యాస్ ఉత్పత్తి చేసుకోవచ్చని తెలిపారు. డైజెస్టర్, టబ్, పైపులు, స్టవ్ తదితర అవసరమైన పరికరాలతో యూనిట్ ఏర్పాటు చేస్తామని, సబ్సిడీ ద్వారా యూనిట్లు అందుబాటులోకి వస్తుండటంతో రైతులకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని వివరించారు. రోజుకు 40 కిలోల పశువుల పేడ అందుబాటులో ఉన్న రైతులు ఈ యూనిట్లను ఏర్పాటు చేసుకుని వంట గ్యాస్‌ను స్వయంగా ఉత్పత్తి చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రాజెక్టును స్వర్ణ్ రీఫ్ సంస్థ నిర్వహిస్తోందని, వాతావరణ మార్పుల నియంత్రణలో భాగంగా బయోగ్యాస్, అగ్రోఫారెస్ట్రీ, బయోచార్ తదితర ప్రాజెక్టులను అమలు చేస్తున్నట్లు వివరించారు. బయోగ్యాస్ యూనిట్ల ప్రయోజనాలపై రైతుల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ జిల్లా అధికారులను ఆదేశించారు. పశువుల పేడను వ్యర్థంగా వదిలేయకుండా ఇంధన వనరుగా, సేంద్రియ వ్యవసాయానికి ఉపయోగపడే వనరుగా మార్చుకోవడం ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో జడ్పీ చైర్మన్ ఎ. శ్రీనివాసులు, చుడా చైర్‌పర్సన్ కటారి హేమలత, నగరపాలక సంస్థ కమిషనర్ పి. నరసింహప్రసాద్, భాజపా జిల్లా అధ్యక్షుడు జగదీశ్వరనాయుడు, మాజీ ఎమ్మెల్సీ బీఎన్ రాజసింహులు, మాజీ మేయర్ అముద, మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.

