28, ఆగస్టు 2026, శుక్రవారం

నిధులున్నా.. సమస్యలు తీరవు!

నిధులున్నా.. సమస్యలు తీరవు!

ఐదు నెలలుగా ప్రత్యేక అధికారుల పాలన

తాగునీటి పైపుల్లో మురుగునీరు.. పారిశుధ్యం అధ్వానం

ఓటర్ల జాబితా పనుల్లో అధికారుల బిజీ.. గ్రామ సమస్యలు గాలికి

రూ.25.44 కోట్లు విడుదలైనా.. అభివృద్ధి పనులకు దిక్కేది?

(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)

గ్రామ పంచాయతీలకు నిధులు ఉన్నాయి.. సమస్యలు ఉన్నాయి.. పరిష్కరించాల్సిన అవసరం ఉంది.. కానీ వాటిని పట్టించుకునే వారే కనిపించని పరిస్థితి నెలకొంది. చిత్తూరు జిల్లాలో ఐదు నెలలుగా కొనసాగుతున్న ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సమస్యలు పేరుకుపోతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాగునీటి పైపులు పగిలినా, మురుగునీరు తాగునీటిలో కలిసినా, పారిశుధ్యం అధ్వానంగా మారినా సకాలంలో స్పందించే పరిస్థితి లేకపోవడంతో గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని ప్రజల అవసరాలకు వినియోగించడంలో జాప్యం జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

చిత్తూరు జిల్లాలో మొత్తం 621 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో తొమ్మిది మేజర్‌ పంచాయతీలు, 612 మైనర్‌ పంచాయతీలు ఉన్నాయి. గతంలో గ్రామాల్లో ప్రజలతో నిత్యం అందుబాటులో ఉండే సర్పంచులు, వార్డు సభ్యులు ఉండేవారు. గ్రామ సమస్యలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, అత్యవసర సమస్యలకు పరిష్కారం చూపించడం వంటి కార్యక్రమాలు జరిగేవి. అయితే సర్పంచుల పదవీకాలం ఏప్రిల్‌ 2తో ముగియడంతో ఏప్రిల్‌ 3 నుంచి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు ఐదు నెలలుగా పంచాయతీల పాలన ప్రత్యేక అధికారుల చేతుల్లోనే కొనసాగుతోంది. ప్రత్యేక అధికారులుగా ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మండల విద్యాశాఖ అధికారులు, ఇంజినీరింగ్‌ అధికారులు తదితరులను నియమించారు. అయితే వీరికి ఇప్పటికే తమ శాఖలకు సంబంధించిన అనేక బాధ్యతలు ఉండటంతో పంచాయతీల పాలనపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా గ్రామాల్లో చిన్నచిన్న సమస్యలు సైతం పెద్ద సమస్యలుగా మారుతున్నాయి. అత్యవసరంగా పరిష్కరించాల్సిన తాగునీరు, పారిశుధ్యం, డ్రైనేజీ, వీధి దీపాలు, పైపులైన్ల మరమ్మతులు వంటి సమస్యలు రోజుల తరబడి అలాగే ఉంటున్నాయని ప్రజలు వాపోతున్నారు. నల్లంగాడు పంచాయతీ పరిధిలోని కోటూరు గ్రామ ప్రజల పరిస్థితి ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా మారింది. సర్పంచ్‌ పదవీకాలం ముగియడంతో పంచాయతీ కార్యదర్శి ఇన్‌చార్జిగా వ్యవహరించగా, ప్రస్తుతం ఆయన కూడా అందుబాటులో లేకపోవడంతో గ్రామ ప్రజలు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్లంగాడు నుంచి కోటూరుకు సరఫరా అవుతున్న తాగునీటి పైపులైన్‌ సొసైటీ భవనం సమీపంలోని వ్యర్థాల వద్ద పగిలిపోయిందని, దీంతో మురుగు, వ్యర్థాలు తాగునీటిలో కలిసే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే నీరు ట్యాంకుకు చేరి అక్కడి నుంచి గ్రామ ప్రజలకు సరఫరా అవుతోందని వారు చెబుతున్నారు. ఈ నీటిని తాగడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని, వెంటనే పైపులైన్‌ను మరమ్మతు చేసి స్వచ్ఛమైన తాగునీరు అందించాలని వారు ఎంపీడీవోను కోరుతున్నారు. ఇదే గ్రామంలో కాలువలు మురుగునీటితో, వ్యర్థాలతో నిండిపోయాయని గతంలోనే అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. వర్షాలు కురిసినప్పుడు మురుగునీరు రోడ్లపైకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. ఒకవైపు తాగునీటి పైపులు మురుగునీటిలో ఉండటం, మరోవైపు కాలువలు శుభ్రం చేయకపోవడం ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలోని అనేక గ్రామాల్లో ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయని ప్రజలు అంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో తాగునీటి పైపులు పగిలిపోవడం, మరికొన్ని చోట్ల పైపులు బ్లాక్‌ కావడం, ఇంకొన్ని ప్రాంతాల్లో మురుగునీరు తాగునీటి పైపుల్లో కలిసే పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు. సమస్యలను పరిష్కరించేందుకు గ్రామస్థులు అధికారులను సంప్రదించాలంటే అందుబాటులో ఉండే పంచాయతీ పాలకవర్గం లేకపోవడం సమస్యగా మారింది. మరోవైపు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం అధికారులపై అదనపు భారం మోపుతోంది. ఓటర్లను గుర్తించడం, నోటీసులు జారీ చేయడం, వాటిని స్వీకరించడం, వివరాలను కంప్యూటరీకరించడం, అర్హత లేని ఓటర్లకు నోటీసులు ఇవ్వడం తదితర పనుల్లో పంచాయతీ సిబ్బంది నిమగ్నమై ఉన్నారు. దీంతో గ్రామాల్లో రోజువారీ పరిపాలన, ప్రజల సమస్యల పరిష్కారం వెనుకబడుతోందని గ్రామస్థులు పేర్కొంటున్నారు. అధికారులు తమకు అప్పగించిన ఎన్నికల సంబంధిత పనుల్లో తలమునకలై ఉండటంతో గ్రామ సమస్యలను పరిశీలించేందుకు సమయం కేటాయించలేకపోతున్నారని అంటున్నారు. ఇదిలా ఉండగా, గ్రామ పంచాయతీలకు నిధుల కొరత కూడా పెద్దగా లేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 2026–27 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలోని పంచాయతీలకు వివిధ పద్దుల కింద సుమారు రూ.25.44 కోట్ల నిధులు విడుదలైనట్లు సమాచారం. తలసరి గ్రాంట్‌, డ్రైనేజీ తదితర నిధులు, గ్రంథాలయ నిధులు, 15వ ఆర్థిక సంఘం టైడ్‌ గ్రాంట్‌ తదితర పద్దుల కింద నిధులు అందుబాటులోకి వచ్చాయి. తాగునీరు, పారిశుధ్యం, డ్రైనేజీ, అత్యవసర మరమ్మతులు వంటి పనులకు ఈ నిధులను వినియోగించే అవకాశం ఉన్నప్పటికీ, పాలనా వ్యవస్థలో ఏర్పడిన ఖాళీ కారణంగా ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం లభించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయడం మాత్రమే కాకుండా వాటిని సకాలంలో ప్రజల అవసరాలకు ఖర్చు చేయడం కూడా అంతే ముఖ్యమని గ్రామీణ ప్రజలు పేర్కొంటున్నారు. పంచాయతీల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులు లేకపోవడంతో ప్రత్యేక అధికారులపై బాధ్యత మరింత పెరిగిందని, కనీసం వారానికి ఒకసారి గ్రామాలను సందర్శించి సమస్యలను గుర్తించి పరిష్కరించాలని కోరుతున్నారు. ముఖ్యంగా తాగునీరు, పారిశుధ్యం వంటి ప్రజారోగ్యానికి సంబంధించిన సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామాల్లో సమస్యలు పేరుకుపోతున్న సమయంలో అధికారులు ఎన్నికల ప్రక్రియతో పాటు పంచాయతీ పరిపాలనకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. తాగునీటి పైపులు పగిలిన చోట వెంటనే మరమ్మతులు చేయడం, మురుగుకాలువలను శుభ్రం చేయడం, తాగునీటి వనరుల చుట్టూ పారిశుధ్య చర్యలు చేపట్టడం, బోర్లు, పైపులైన్లను నిరంతరం పర్యవేక్షించడం వంటి కనీస చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రజలకు అత్యంత సమీపంలోని ప్రభుత్వ వ్యవస్థ గ్రామ పంచాయతీ. అక్కడ చిన్న సమస్య పరిష్కారం కాకపోయినా దాని ప్రభావం నేరుగా ప్రజల జీవనంపై పడుతుంది. తాగునీరు కలుషితమైతే ప్రజారోగ్యం దెబ్బతింటుంది.. కాలువలు పొంగితే పారిశుధ్యం క్షీణిస్తుంది.. బోరు పనిచేయకపోతే వ్యవసాయం దెబ్బతింటుంది. అందుకే పంచాయతీల్లో పరిపాలనా లోటు ఏర్పడకుండా ప్రత్యేక అధికారులు గ్రామాలపై నిరంతర పర్యవేక్షణ చేయాలని ప్రజలు కోరుతున్నారు. నిధులు ఉన్నా.. అధికార వ్యవస్థ ఉన్నా.. సమస్యలు మాత్రం తీరకపోతే ఆ నిధుల ప్రయోజనం ఏమిటన్న ప్రశ్న ఇప్పుడు చిత్తూరు జిల్లా గ్రామాల్లో వినిపిస్తోంది. :::

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *