జలధార.. జలహారతి.. అయినా జలమేది?
జలధార.. జలహారతి.. అయినా జలమేది?
ఎల్‌నినో దెబ్బకు అడుగంటుతున్న భూగర్భ జలాలు..
కోట్లాది రూపాయలతో జల వనరుల పనులు జరుగుతున్నా కనిపించని ఫలితం
22 మండలాల్లో 8 మీటర్లకు దిగువకు.. కుప్పం, గుడుపల్లె, వి.కోటల్లో 20 మీటర్లకు పైగా
జిల్లా సగటు భూగర్భ జలమట్టం 15.15 మీటర్లకు పతనం..
వర్షాలు కురిస్తేనే జలధారకు జలకళ!
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)
ఒకవైపు జలధార–జలహారతి.. మరోవైపు అడుగంటుతున్న భూగర్భ జలాలు! కోట్లాది రూపాయలు వెచ్చించి చెరువులు, కాలువలు, నీటి వనరుల పునరుద్ధరణకు ప్రభుత్వం పెద్దఎత్తున చర్యలు చేపడుతున్నా.. ఎల్‌నినో ప్రభావంతో వరుణుడు ముఖం చాటేయడంతో ఆ ప్రయత్నాలకు ప్రకృతి సహకరించడం లేదు. జిల్లాలో 3,106 చెరువులు, 3,935 ఫీడర్ కాలువలు, 665 నీటి వరుస వ్యవస్థలను పునరుద్ధరించేందుకు జలధార–జలహారతి పేరుతో 100 రోజుల కార్యాచరణ చేపట్టినా.. భూగర్భ జలాల పరిస్థితి మాత్రం రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. వర్షాలు లేక చెరువుల్లోకి నీరు చేరకపోవడం, భూగర్భ జలాల రీఛార్జి జరగకపోవడంతో బోర్లు, బావులు ఎండిపోయే పరిస్థితి నెలకొంది.
జిల్లాలోని చిన్న నీటిపారుదల చెరువులకు నీటి ప్రవాహాన్ని పెంచి, వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచే లక్ష్యంతో 2026 ఏప్రిల్ 6న జలధార–జలహారతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఫీడర్ కాలువల్లో పూడిక తొలగించడం, అడ్డంకులను తొలగించడం, మరమ్మతులు చేపట్టడం, చెరువుల మధ్య నీటి ప్రవాహ వ్యవస్థను మెరుగుపరచడం వంటి పనులు చేపడుతున్నారు. 3,106 చెరువులకు నీటిని తీసుకెళ్లే 3,935 ఫీడర్ కాలువలు, 665 నీటి వరుస వ్యవస్థలను పునరుద్ధరించడం ద్వారా వర్షపు నీటిని గరిష్ఠంగా నిల్వ చేసుకుని భూగర్భ జలాలను పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కానీ వర్షమే లేకపోతే చెరువులకు నీరు ఎలా? చెరువులు నిండకపోతే భూగర్భ జలాలు ఎలా పెరుగుతాయి? అన్న ప్రశ్నలు ఇప్పుడు ఎదురవుతున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో గత మూడు నెలలుగా ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. సాధారణంగా వర్షాలు కురిసినప్పుడు చెరువులు, కుంటలు, వాగులు, వ్యవసాయ భూముల ద్వారా నీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు రీఛార్జి అవుతాయి. ఈసారి ఆ ప్రక్రియ దెబ్బతింది. ఫలితంగా ఇప్పటికే ఉన్న భూగర్భ జలాలను తాగునీరు, సాగునీటి అవసరాలకు అధికంగా వినియోగించుకోవడంతో నీటిమట్టం వేగంగా కిందికి జారుతోంది. జూలై 2026లో జిల్లాలోని 28 మండలాల భూగర్భ జలమట్టాలను పరిశీలిస్తే పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది. ఎక్కడా 3 మీటర్ల లోపల భూగర్భ జలాలు లేవు. కేవలం 6 మండలాల్లో మాత్రమే 3 నుంచి 8 మీటర్ల లోతులో నీరు లభిస్తోంది. 19 మండలాల్లో 8 నుంచి 20 మీటర్ల లోతుకు నీటిమట్టం పడిపోయింది. మరో 3 మండలాల్లో ఏకంగా 20 మీటర్లకు పైగా లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి. తవణంపల్లె, ఎస్.ఆర్.పురం, నగరి, నిండ్ర, పెద్దపంజాణి, విజయపురం మండలాల్లో మాత్రమే 3 నుండి 8 మీటర్ల లోతులో నీరు ఉంది. చిత్తూరు రూరల్, చిత్తూరు అర్బన్, గుడిపాల, జీడీనెల్లూరు, పాలసముద్రం, పెనుమూరు, వడమాలపేట, వెదురుకుప్పం, బంగారుపాళ్యం, ఐరాల, రామకుప్పం, శాంతిపురం, బైరెడ్డిపల్లె, గంగవరం, పలమనేరు, పులిచెర్ల, రొంపిచెర్ల, కార్వేటినగరం, పూతలపట్టు, యాదమరి మండలాల్లో 8–20 మీటర్ల లోతులో నీరు లభిస్తోంది. గుడుపల్లె, కుప్పం, వి.కోటల్లో 20 మీటర్లకు పైగా లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి.
*15.15 మీటర్ల లోతుకు జిల్లా సగటు*
జిల్లా సగటు భూగర్భ జలమట్టం కూడా పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చాటుతోంది. 2025 నవంబర్‌లో జిల్లా సగటు భూగర్భ జలమట్టం 6.69 మీటర్లు ఉండగా.. 2026 మేలో 13.82 మీటర్లకు చేరింది. జూలై నాటికి ఏకంగా 15.15 మీటర్లకు పడిపోయింది. అంటే నవంబర్‌తో పోల్చితే సగటున 8.46 మీటర్ల మేర నీటిమట్టం దిగజారింది. మే నుంచి జూలై మధ్యే మరో 1.22 మీటర్ల మేర కిందికి వెళ్లింది. నియోజకవర్గాల వారీగా చూస్తే కుప్పం పరిస్థితి మరింత ఆందోళనకరం. జూలైలో అక్కడ సగటు భూగర్భ జలమట్టం 27.91 మీటర్ల లోతులో నమోదైంది. 2025 నవంబర్‌లో 15.99 మీటర్లుగా ఉన్న నీటిమట్టం జూలై నాటికి 11.92 మీటర్ల మేర దిగజారింది. పలమనేరు నియోజకవర్గంలో 15.24 మీటర్లు, చిత్తూరులో 11.12 మీటర్లు, పూతలపట్టులో 9.49 మీటర్లు, జీడీనెల్లూరులో 10.52 మీటర్లు, పుంగనూరులో 11.25 మీటర్లు, నగరిలో 5.76 మీటర్ల లోతులో సగటు భూగర్భ జలమట్టం నమోదైంది. ప్రభుత్వం చెరువులను పునరుద్ధరించేందుకు జలధార జలహారతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. కాలువలు బాగుచేయడం, పూడిక తొలగించడం, చెరువుల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా భూగర్భ జలాల రీఛార్జి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఆకాశం నుంచి నీటి ధార పడకపోతే.. జలహారతి ఎలా సాధ్యం? అన్న ప్రశ్న ఇప్పుడు జిల్లావాసులను వేధిస్తోంది. నీటి ప్రవాహ మార్గాలు సిద్ధంగా ఉన్నా.. వాటిలో ప్రవహించేందుకు నీరు లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. చెరువులను నింపేందుకు కాలువలు సిద్ధం చేస్తున్నా, వర్షాలు లేకపోవడంతో చెరువులకు వచ్చే సహజ ప్రవాహం తగ్గిపోయింది. దీంతో జలధార–జలహారతి లక్ష్యం నెరవేరాలంటే తొలుత వరుణుడు కరుణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
*వ్యవసాయానికీ దెబ్బ.. పాడి పరిశ్రమకూ ముప్పు*
భూగర్భ జలాలు అడుగంటడం కేవలం తాగునీటి సమస్యకే పరిమితం కాదు. జిల్లాలో పెద్ద సంఖ్యలో రైతులు వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. పంటలకు నీరు లేకపోవడంతో సాగు విస్తీర్ణం తగ్గిపోతుండగా.. పశువులకు తాగునీరు, పచ్చిమేత అందించడానికి కూడా నీరు అవసరమే. వర్షాలు లేకపోవడంతో పంటల సాగు ఇప్పటికే తీవ్రంగా దెబ్బతింది. ఖరీఫ్, రబీ సీజన్లలో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. 10 శాతం కూడా సాగు జరగని పరిస్థితులు కొన్ని ప్రాంతాల్లో నెలకొన్నాయి. భూగర్భ జలాలు మరింత పడిపోతే రైతులు బోర్లను మరింత లోతుగా తవ్వాల్సి వస్తుంది. విద్యుత్ వినియోగం పెరుగుతుంది. నీరు లభించకపోతే పంటలు ఎండిపోతాయి. పశువుల పెంపకంపై ఆధారపడే కుటుంబాలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది.
*ముందు ముప్పు.. నీటి సంక్షోభమే*
ఇదే పరిస్థితి కొనసాగి వర్షాలు సమృద్ధిగా కురవకపోతే రానున్న రోజుల్లో చిత్తూరు జిల్లాలో తాగునీరు, సాగునీటి సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో బోర్లు విఫలమైతే ప్రజలు తాగునీటి కోసం దూర ప్రాంతాలపై ఆధారపడాల్సి వస్తుంది. వ్యవసాయం దెబ్బతింటే రైతుల ఆదాయం తగ్గుతుంది. పాడి పరిశ్రమకు మేత, నీటి కొరత ఏర్పడితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే జలధార జలహారతి పనులను కేవలం కాలువలు, చెరువుల పునరుద్ధరణగా కాకుండా సమగ్ర భూగర్భ జలాల సంరక్షణ కార్యక్రమంగా మార్చాల్సిన అవసరం ఉంది. ప్రతి చెరువుకు వచ్చే వర్షపు నీటి ప్రవాహ మార్గాలను రక్షించడం, చెరువుల ఆక్రమణలను తొలగించడం, పూడిక తొలగింపును శాస్త్రీయంగా చేపట్టడం, వర్షపు నీటిని భూమిలోకి ఇంకించే నిర్మాణాలు పెంచడం, అధికంగా భూగర్భ జలాలను తోడేస్తున్న ప్రాంతాల్లో నియంత్రణ చర్యలు చేపట్టడం అత్యవసరమని పరిస్థితులు సూచిస్తున్నాయి. కోట్లాది రూపాయలతో చెరువులు, కాలువలు బాగుచేసినా.. ఆ చెరువుల్లోకి నీరు రాకపోతే ప్రయోజనం పరిమితమే. జలధార జలహారతికి ప్రకృతి సహకారం కూడా అంతే అవసరం. ఎల్‌నినో ప్రభావంతో వరుణుడు ముఖం చాటేయడం, 28 మండలాల్లో 22 మండలాల్లో భూగర్భ జలాలు 8 మీటర్లకు దిగువకు పడిపోవడం, మూడు మండలాల్లో 20 మీటర్లకుపైగా లోతుకు చేరడం చూస్తుంటే.. చిత్తూరు జిల్లా ముందు నిలిచింది కేవలం నీటి సమస్య కాదు.. రాబోయే రోజుల్లో ఎదురయ్యే తీవ్రమైన జల సంక్షోభం అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

