17, ఆగస్టు 2026, సోమవారం

మామిడి చెట్లకు మృత్యుఘంటిక.. ఎండిపోతున్న తోటలు

మామిడి చెట్లకు మృత్యుఘంటిక.. ఎండిపోతున్న తోటలు

ఎల్‌నినో దెబ్బకు అడుగంటుతున్న భూగర్భ జలాలు

మూడు నెలలుగా జిల్లాలో కొనసాగుతున్న వర్షాభావ పరిస్థితులు

28 మండలాల్లో 20 మండలాల్లో 8 మీటర్లకుపైగా లోతులో నీరు

కుప్పం, గుడుపల్లె, వి.కోటల్లో 20 మీటర్లకు దిగువకు

గిట్టుబాటు ధర లేక తోటలపై రైతుల ఆసక్తి తగ్గుముఖం

1.50 లక్షల ఎకరాల్లో మామిడి సాగు.. ఈ ఏడాది 4 లక్షల టన్నుల దిగుబడికే పరిమితం

(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ)

కన్నబిడ్డల కన్నా మిన్నగా పెంచుకున్న మామిడి చెట్లను కళ్లముందే ఎండిపోతుండటాన్ని చూసి రైతన్నలు దిగాలు పడుతున్నారు. ఏళ్ల తరబడి నీళ్లు పోసి, ఎరువులు వేసి, చీడపీడల నుంచి కాపాడుతూ పెంచుకున్న చెట్లు ఇప్పుడు చుక్క నీటి కోసం ఎదురుచూస్తున్నాయి. ఒకవైపు ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు.. మరోవైపు భూగర్భ జలాలు భారీగా అడుగంటిపోవడం.. ఇంకోవైపు గత మూడు సంవత్సరాలుగా మామిడి పంటకు ఆశించిన గిట్టుబాటు ధర లేకపోవడంతో తోటలపై రైతుల ఆసక్తి తగ్గడం.. వెరసి జిల్లాలో మామిడి తోటల పరిస్థితి దయనీయంగా మారింది. ఒకప్పుడు పచ్చని ఆకులతో కళకళలాడిన తోటలు ఇప్పుడు ఎండిన కొమ్మలతో దర్శనమిస్తున్నాయి.

చిత్తూరు జిల్లాలో సుమారు 1.50 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. మామిడి జిల్లాలో ప్రధాన ఉద్యాన పంటల్లో ఒకటి. గత ఏడాది సుమారు 6 లక్షల టన్నుల దిగుబడి వచ్చినట్లు రైతు వర్గాలు చెబుతుండగా.. ఈ ఏడాది వర్షాభావం, వాతావరణ పరిస్థితులు, పంటపై ప్రభావంతో దిగుబడి సుమారు 4 లక్షల టన్నులకు పరిమితమైంది. దిగుబడి తగ్గడంతో ఇప్పటికే రైతులు నష్టపోయారు. ఇప్పుడు తోటల్లోని చెట్లే ఎండిపోతుండటంతో వచ్చే సంవత్సరాల్లో ఉత్పత్తిపై కూడా తీవ్ర ప్రభావం పడే ప్రమాదం కనిపిస్తోంది. జిల్లాలో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. జిల్లాలో జూన్ నెలలో 79.6 మిల్లీమీటర్ల వర్షపాతం పడాల్సి ఉందిగా 70. 75 మిల్లీ మీటర్లు పడింది. జూలై నెలలో 102.3 మిల్లీమీటర్లకు 17.2 మిల్లీమీటర్లు పడింది. ఆగస్టు నెలలో 123.33 వర్షపాతం పడాల్సి ఉంది ఇప్పటివరకు 23 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఆగస్టులోనూ ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో రైతుల ఆందోళన కొనసాగుతోంది. జూన్‌ 1 నుంచి ఆగస్టు మధ్యకాలానికి రాష్ట్ర వర్షపాత గణాంకాలను పరిశీలిస్తే చిత్తూరు జిల్లాలో సాధారణం కంటే భారీ లోటు కొనసాగుతున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. జూన్‌ 1 నుంచి ఆగస్టు మధ్య వరకు సాధారణ వర్షపాతం 255.3 మి.మీ. కాగా.. వాస్తవంగా 90.9 మి.మీ. మాత్రమే నమోదై 64.4 శాతం లోటు ఉన్నట్లు రాష్ట్ర వర్షపాత గణాంకాల్లో నమోదైంది. వర్షాలు కురిసినప్పుడు నేలలోకి నీరు ఇంకి భూగర్భ జలాలు రీఛార్జి అవుతాయి. మామిడి తోటల్లో చెట్ల వేర్లకు నేలలోని తేమ కీలకం. కానీ వరుసగా వర్షాలు లేకపోవడంతో నేల తేమ తగ్గిపోయింది. ఇప్పటికే ఉన్న భూగర్భ జలాలను బోర్ల ద్వారా తోడేస్తుండటంతో నీటిమట్టం మరింత కిందికి జారుతోంది. దీంతో నీటి వసతి ఉన్న తోటల్లోనూ ప్రతి చెట్టుకు అవసరమైనంత నీరు అందించడం రైతులకు కష్టంగా మారింది.

వర్షాభావ ప్రభావం భూగర్భ జలాలపై తీవ్రంగా పడింది. 2025 నవంబర్‌లో జిల్లాలో సగటు భూగర్భ జలమట్టం 6.69 మీటర్లు ఉండగా.. 2026 మేలో 13.82 మీటర్లకు, జూలైలో 15.15 మీటర్లకు పడిపోయింది. అంటే నవంబర్‌తో పోలిస్తే జూలై నాటికి సగటున 8.46 మీటర్ల మేర నీటిమట్టం దిగజారింది. జిల్లాలోని 28 మండలాల్లో కేవలం 6 మండలాల్లోనే 3 నుంచి 8 మీటర్ల లోతులో భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయి. 20 మండలాల్లో 8 నుంచి 20 మీటర్ల లోతులో నీరు ఉంది. మరో 3 మండలాల్లో 20 మీటర్లకుపైగా లోతుకు నీటిమట్టం పడిపోయింది. తవణంపల్లె, ఎస్‌.ఆర్‌.పురం, నగరి, నిండ్ర, పెద్దపంజాణి, విజయపురం మండలాల్లో 3 నుంచి 8 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి. చిత్తూరు రూరల్, చిత్తూరు అర్బన్, గుడిపాల, జీడీనెల్లూరు, పాలసముద్రం, పెనుమూరు, వడమాలపేట, వెదురుకుప్పం, బంగారుపాళ్యం, ఐరాల, రామకుప్పం, శాంతిపురం, బైరెడ్డిపల్లె, గంగవరం, పలమనేరు, పులిచెర్ల, రొంపిచెర్ల, కార్వేటినగరం, పూతలపట్టు, యాదమరి మండలాల్లో 8 నుంచి 20 మీటర్ల లోతులో నీరు లభిస్తోంది. గుడుపల్లె, కుప్పం, వి.కోట మండలాల్లో ఏకంగా 20 మీటర్లకుపైగా లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి. నియోజకవర్గాల వారీగా చూసినా కుప్పం ప్రాంతంలో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. జూలైలో కుప్పం నియోజకవర్గంలో సగటు భూగర్భ జలమట్టం 27.91 మీటర్ల లోతులో నమోదైంది. 2025 నవంబర్‌లో ఇది 15.99 మీటర్లు ఉండగా.. జూలై నాటికి ఏకంగా 11.92 మీటర్ల మేర దిగజారింది. పలమనేరు నియోజకవర్గంలో 15.24 మీటర్లు, పుంగనూరులో 11.25 మీటర్లు, చిత్తూరులో 11.12 మీటర్లు, జీడీనెల్లూరులో 10.52 మీటర్లు, పూతలపట్టులో 9.49 మీటర్లు, నగరిలో 5.76 మీటర్ల లోతులో సగటు భూగర్భ జలమట్టం నమోదైంది. ఈ పరిస్థితి మామిడి తోటలకు పెను ముప్పుగా మారింది. బోర్లు లోతుకు వెళ్తున్న కొద్దీ రైతులపై పెట్టుబడి భారం పెరుగుతోంది. బోరు పనిచేసినా నీటి పరిమాణం తగ్గిపోవడంతో తోట మొత్తానికి నీరు అందించడం సాధ్యం కావడం లేదు. కొన్ని ప్రాంతాల్లో బోర్లు ఎండిపోవడంతో చెట్లను బతికించుకునే అవకాశం కూడా లేకుండా పోతోంది. మామిడి రైతుకు చెట్టు అంటే కేవలం పంట ఇచ్చే మొక్క కాదు. చిన్న మొక్కగా నాటినప్పటి నుంచి ఏళ్ల తరబడి దాన్ని కుటుంబ సభ్యుడిలా పెంచుకుంటాడు. ఎండాకాలంలో నీళ్లు పోస్తాడు. ఎరువులు వేస్తాడు. చీడపీడలు రాకుండా కాపాడతాడు. పూత, పిందె సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు. చెట్టు పెరిగి పంటకు వచ్చిన తర్వాత వచ్చే ఆదాయంతో పిల్లల చదువులు, కుటుంబ అవసరాలు, అప్పులు తీర్చుకోవాలని ఆశపడతాడు. ఇప్పుడు అలాంటి చెట్లే నీరు లేక ఎండిపోతుండటంతో రైతుల బాధ వర్ణనాతీతంగా మారింది. ‘‘ఇన్నేళ్లు పెంచిన చెట్టును నీరు లేక ఎండిపోతుంటే చూస్తూ ఉండటం చాలా బాధగా ఉంది. బోరులో నీరు లేదు. వర్షం పడుతుందన్న నమ్మకం లేదు. పంటకు ధర కూడా సరిగా రావడం లేదు’’ అంటూ పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మామిడి రైతుల సమస్యకు వర్షాభావం ఒక్కటే కారణం కాదు. గత మూడు సంవత్సరాలుగా మామిడి పంటకు ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు తోటల నిర్వహణపై ఆసక్తి కోల్పోతున్నారు. సాగు వ్యయం పెరుగుతున్నా మార్కెట్‌లో ధర మాత్రం స్థిరంగా ఉండకపోవడంతో పెట్టుబడి పెట్టేందుకు రైతులు వెనుకంజ వేస్తున్నారు. ఈ ఏడాది కూడా ప్రభుత్వం టోటాపురి మామిడికి కిలోకు రూ.4 మద్దతు ధర ప్రకటించింది. ఇది కొంత ఉపశమనం కల్పించినా వరుస నష్టాలను ఎదుర్కొంటున్న రైతులకు దీర్ఘకాలిక పరిష్కారం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో కొంతమంది రైతులు తోటల నిర్వహణను తగ్గించుకోవడం, ఎండిపోయిన చెట్లను తొలగించడం, కొత్తగా మొక్కలు నాటడంపై ఆసక్తి చూపకపోవడం వంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. నీరు పెట్టి చెట్టును బతికించినా.. పంట చేతికి వచ్చినప్పుడు ధర లేకపోతే మళ్లీ నష్టమే అన్న భావన రైతుల్లో పెరుగుతోంది. గత ఏడాది సుమారు 6 లక్షల టన్నుల మామిడి దిగుబడి వచ్చిన జిల్లాలో ఈ ఏడాది సుమారు 4 లక్షల టన్నులకే పరిమితమవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఇప్పుడు తోటల్లోని చెట్లు కూడా ఎండిపోతే రానున్న సంవత్సరాల్లో దిగుబడి మరింత తగ్గే ప్రమాదం ఉంది. మామిడి చెట్టు ఒక్కసారిగా పంట ఇచ్చే పంట కాదు. ఒకసారి చెట్టు ఎండిపోతే దాని స్థానంలో కొత్త మొక్కను నాటినా ఫలదీకరణకు సంవత్సరాలు పడతాయి. అందువల్ల ప్రస్తుత వర్షాభావం కేవలం ఈ ఏడాది పంటను మాత్రమే కాకుండా రానున్న సంవత్సరాల మామిడి ఉత్పత్తిని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. మామిడి తోటలు ఎండిపోవడం వల్ల నష్టం రైతులకే పరిమితం కాదు. తోటల్లో పనిచేసే కూలీలు, పంట కోత, రవాణా, ప్యాకింగ్‌, వ్యాపారం, గుజ్జు పరిశ్రమలతో పాటు మామిడి ఆధారిత అనేక కుటుంబాల ఉపాధిపైనా ప్రభావం పడుతుంది. జిల్లాలో మామిడి సాగు విస్తీర్ణం పెద్దదిగా ఉండటంతో తోటలు బలహీనపడితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థపైనా దాని ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికైనా వర్షాలు కురిసి భూగర్భ జలాలు రీఛార్జి అయితేనే పరిస్థితి కొంత మెరుగుపడే అవకాశం ఉంది. ఎండిపోతున్న చెట్లను బతికించేందుకు తోటల వారీగా నీటి లభ్యతను అంచనా వేయడం, నీటి పొదుపు పద్ధతులు పాటించడం, చెట్ల వేర్ల వద్ద తేమ నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవడం, అత్యంత తీవ్రంగా ప్రభావితమైన తోటలను గుర్తించి రైతులకు అవసరమైన సాంకేతిక, ఆర్థిక సహాయం అందించడం అవసరం. ఆకాశం వైపు చూస్తూ రైతన్న ఎదురుచూస్తున్నాడు. బోరులో నీటి కోసం నేలను చూస్తున్నాడు. కళ్లముందు ఎండిపోతున్న మామిడి చెట్లను చూస్తూ గుండె బరువెక్కుతోంది. ఒక చినుకు వర్షం పడితే చెట్టు బతుకుతుంది.. చెట్టు బతికితే రైతు ఆశ బతుకుతుంది. అందుకే ఇప్పుడు చిత్తూరు మామిడి రైతన్నకు కావాల్సింది కేవలం వర్షం కాదు.. తన తోటను, తన జీవనాధారాన్ని కాపాడే వర్షం.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *