ప్రజలకు మరింత చేరువగా రెడ్‌క్రాస్ సేవలు
ప్రజలకు మరింత చేరువగా రెడ్‌క్రాస్ సేవలు
నేడే ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ నూతన భవనం ప్రారంభం
రూ.2.40 కోట్లతో ఆధునిక వసతులతో మూడు అంతస్తుల భవనం
రక్తనిధి, అంబులెన్స్‌తో పాటు జనరిక్ మందుల దుకాణం, వైద్య సేవలకు ఏర్పాట్లు
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)
ప్రజలకు మరింత చేరువగా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సేవలను విస్తరించేందుకు చిత్తూరు నగరంలోని పలమనేరు రోడ్డులో నిర్మించిన నూతన భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. సుమారు రూ.2.40 కోట్ల వ్యయంతో ఆధునిక వసతులతో నిర్మించిన ఈ భవనాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి శనివారం ప్రారంభించనున్నారు. పట్టణ నడిబొడ్డున, ప్రధాన రహదారికి ఆనుకుని నిర్మించడంతో ప్రజలు సులభంగా చేరుకునే అవకాశం ఏర్పడింది. ఇప్పటివరకు చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ భవనం ఉండేది. అక్కడ భవనాలను తొలగించడంతో సొసైటీ కార్యకలాపాల కోసం పలమనేరు రోడ్డులో నూతన భవనాన్ని నిర్మించారు. మూడు అంతస్తులతో నిర్మించిన ఈ భవనంలో భవిష్యత్తులో ప్రజలకు అవసరమైన పలు వైద్య, సేవా కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు.
భవన నిర్మాణానికి పలువురు దాతలు కూడా తమ వంతు సహకారం అందించారు. బాలాజీ హేచరీస్ అధినేత స్వర్గీయ సుందర నాయుడు జ్ఞాపకార్థం ఆయన కుమార్తె శైలజాకిరణ్ రూ.35 లక్షలు విరాళంగా అందజేశారు. ఏపీ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ రూ.1.60 లక్షలు అందించగా, చిత్తూరుకు చెందిన విజయ సంస్థల అధినేత, సొసైటీ చైర్మన్ డాక్టర్ ఎం.తేజోమూర్తి రూ.25 లక్షలు విరాళంగా అందించారు. దాతల సహకారంతో భవన నిర్మాణాన్ని ఆధునిక సౌకర్యాలతో పూర్తి చేశారు. ప్రస్తుతం చిత్తూరు ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తనిధి, అంబులెన్స్ సేవలు కొనసాగుతున్నాయి. నూతన భవనం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన అనంతరం సేవలను మరింత విస్తరించనున్నారు. ఇందులో జనరిక్ మందుల దుకాణాన్ని ఏర్పాటు చేయడంతో పాటు సమగ్ర ఆరోగ్య పరీక్షలకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరికరాలను సమకూర్చనున్నారు. రోగులకు వైద్య సలహాలు, చికిత్స అందించేందుకు ప్రత్యేక వైద్యుడిని నియమించనున్నారు. అదేవిధంగా ఫిజియోథెరపీ సేవలను అందించేందుకు ప్రత్యేక నిపుణుడిని కూడా నియమించనున్నట్లు సొసైటీ చైర్మన్ డాక్టర్ ఎం.తేజోమూర్తి తెలిపారు. నూతన భవనంలో ప్రతిపాదించిన అన్ని సేవలను దశలవారీగా అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు డాక్టర్ తేజోమూర్తి తెలిపారు. సుమారు ఆరు నెలల కాలంలో జనరిక్ మందుల దుకాణం, ఆరోగ్య పరీక్షలు, వైద్య సేవలు, ఫిజియోథెరపీ తదితర సౌకర్యాలను పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. పట్టణానికి నడిబొడ్డున, ప్రధాన రహదారి పక్కనే భవనం ఉండటంతో అత్యవసర సమయాల్లో రోగులు, వారి కుటుంబ సభ్యులు సులభంగా చేరుకోవచ్చన్నారు. ముఖ్యంగా రక్తనిధి, అంబులెన్స్ సేవలకు ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుందని తెలిపారు.
రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా డాక్టర్ తేజోమూర్తి
ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ చిత్తూరు జిల్లా శాఖ చైర్మన్ డాక్టర్ ఎం.తేజోమూర్తి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయవాడలో నిర్వహించిన ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చిత్తూరు జిల్లా తరఫున ఆయనను రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎన్నుకున్నారు. అనంతరం ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్విని కుమార్ పరిడా ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా డాక్టర్ తేజోమూర్తి మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి రాష్ట్ర స్థాయి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో రెడ్‌క్రాస్ సేవా కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ముఖ్యంగా పేదలు, నిరుపేదలు, అత్యవసర వైద్య సహాయం అవసరమైన వారికి సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మానవతా సేవల విస్తరణలో చిత్తూరు జిల్లా శాఖను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. నూతన భవనం అందుబాటులోకి రావడంతో రెడ్‌క్రాస్ సేవలకు శాశ్వత వేదిక ఏర్పడటమే కాకుండా రక్తనిధి, అంబులెన్స్, ఆరోగ్య పరీక్షలు, జనరిక్ మందులు, ఫిజియోథెరపీ వంటి సేవలు ఒకే చోట లభించే అవకాశం ఏర్పడనుంది. దీంతో చిత్తూరు నగరంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు రెడ్‌క్రాస్ సేవలు మరింత సులభంగా అందుబాటులోకి రానున్నాయి.

