5, ఆగస్టు 2026, బుధవారం

నిధుల కోసం నిరీక్షిస్తున్న పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం

నిధుల కోసం నిరీక్షిస్తున్న పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం

చిత్తూరు జిల్లాలో రూ.400 కోట్ల బిల్లులు పెండింగ్..

 కాంట్రాక్టర్లు వెనుకడుగు.. నిలిచిపోయిన అభివృద్ధి పనులు

టెండర్లకు స్పందన కరువు.. 1,498 పనులు ప్రారంభం కాని పరిస్థితి.. 

స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడి

(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)

చిత్తూరు జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులతో పాటు ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉండటంతో కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బిల్లులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొనడంతో కొత్త పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. పలు పనులకు టెండర్లు పిలిచినా స్పందన లేకపోగా, టెండర్లు దక్కిన వారు కూడా పనులు ప్రారంభించడానికి వెనుకంజ వేస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అధికారిక వర్గాల అంచనా ప్రకారం చిత్తూరు జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా చేపట్టిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు సుమారు రూ.400 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో గత ప్రభుత్వం చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులు కూడా గణనీయంగా ఉన్నాయి. జిల్లా నీటి నిర్వహణ సంస్థ (డీడబ్ల్యూఎంఏ) ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి సుమారు రూ.100 కోట్ల మేర నిధులు రావాల్సి ఉంది. అదేవిధంగా జిల్లా పరిషత్ సాధారణ నిధులు, ఆర్థిక సంఘం నిధులు, ఎస్‌ఎంఎస్ ప్రాజెక్టు, నాబార్డ్, ప్రధానమంత్రి గ్రామీణ రహదారుల పథకం, విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, జల్ జీవన్ మిషన్, ఎంపీ ల్యాడ్స్, పీఎంఏజీవై తదితర పథకాల కింద దాదాపు రూ.300 కోట్ల వరకు నిధులు విడుదల కావాల్సి ఉందని తెలుస్తోంది.

గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కింద చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు కూడా పూర్తిస్థాయిలో చెల్లించలేదని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. బిల్లుల కోసం ఎదురుచూసి విసిగిపోయిన సుమారు 80 మంది కాంట్రాక్టర్లు న్యాయస్థానాలను ఆశ్రయించగా, కోర్టు ఆదేశాల మేరకు కొందరికి మాత్రమే బిల్లులు చెల్లించారని, ఇంకా వందలాది మంది కాంట్రాక్టర్లు ప్రభుత్వం నుంచి నిధులు ఎప్పుడు విడుదలవుతాయా అని ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది. జిల్లా పరిషత్ పరిధిలో ఇప్పటివరకు 3,647 అభివృద్ధి పనులు మంజూరయ్యాయి. వీటి అంచనా వ్యయం రూ.647.74 కోట్లు. అయితే ఇప్పటివరకు రూ.222.65 కోట్ల విలువైన పనులు మాత్రమే పూర్తయ్యాయి. మొత్తం పనుల్లో 1,576 పనులు పూర్తికాగా, ప్రస్తుతం 570 పనులు మాత్రమే కొనసాగుతున్నాయి. మరోవైపు 1,498 పనులు ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రారంభం కాని పనులను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పరిషత్ సీఈఓలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. నిధులు సమయానికి అందకపోవడంతో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన సిమెంట్ రోడ్లు, గ్రామ పంచాయతీ భవనాలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద లింక్ రోడ్లు, నాబార్డ్ అభివృద్ధి పనులు, తాగునీటి సదుపాయాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి తీవ్రంగా దెబ్బతింటోంది. అభివృద్ధి పనులు నిలిచిపోవడం వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుండగా, కాంట్రాక్టర్లలో ప్రభుత్వంపై విశ్వాసం తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులను రాష్ట్రానికి విడుదల చేసినప్పటికీ, అవి పూర్తిస్థాయిలో జిల్లాలకు చేరడం లేదన్న అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. అవసరమైన నిధులు అందకపోవడంతో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోంది. అభివృద్ధి కార్యక్రమాలు స్తంభించిపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అందాల్సిన మౌలిక వసతులు ఆలస్యమవుతున్నాయి. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ పరిస్థితి అధికార పార్టీ ప్రజాప్రతినిధులను ఆందోళనకు గురిచేస్తోంది. గ్రామాల్లో కొత్త పనులు ప్రారంభం కాకపోవడం, ఇప్పటికే మంజూరైన పనులు నిలిచిపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత పెరిగే అవకాశముందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అభివృద్ధి పనులు వేగవంతం కావాలంటే పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేసి, కొత్త పనులకు అవసరమైన నిధులు కేటాయించాలని అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేస్తేనే నిలిచిపోయిన అభివృద్ధి పనులు తిరిగి గాడిలో పడతాయని, లేదంటే చిత్తూరు జిల్లాలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం చేపట్టాల్సిన అనేక కీలక ప్రాజెక్టులు మరింత ఆలస్యమయ్యే ప్రమాదం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నాటికైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి పెండింగ్ బిల్లులు చెల్లించి, కొత్త నిధులు విడుదల చేస్తుందనే ఆశతో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఎదురు చూస్తోంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *