26, ఆగస్టు 2026, బుధవారం

నిధులు లేక నత్త నడకన జలజీవన్ పనులు

నిధులు లేక నత్త నడకన జలజీవన్ పనులు

ఈ పథకాన్ని నిర్లక్ష్యం చేసిన వైసీపీ ప్రభుత్వం

ఎక్కడికక్కడ ఆగిపోయిన పనులు

కూటమి ప్రభుత్వం రాకతో నిధుల విడుదలకు ప్రయత్నాలు

తిరిగి ప్రారంభం కానున్న జలజీవన్ మిషన్ పనులు

(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)

గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీటిని కుళాయి ద్వారా అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జలజీవన్ మిషన్ పథకం చిత్తూరు జిల్లాలో నత్తనడకన సాగుతోంది. నిధుల కొరతతో గతంలో చేపట్టిన పనులు అనేక చోట్ల మధ్యలోనే నిలిచిపోగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెండింగ్ బిల్లుల చెల్లింపుపై దృష్టి సారించింది. బిల్లులు విడుదలైతే నిలిచిపోయిన పనులు తిరిగి వేగం పుంజుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి కుటుంబానికి ఇంటింటికీ కుళాయి కనెక్షన్ ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే జలజీవన్ మిషన్ ప్రధాన ఉద్దేశం. 2019 ఆగస్టు 15న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకానికి దేశవ్యాప్తంగా శ్రీకారం చుట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి రోజుకు కనీసం 55 లీటర్ల నీటిని అందించాలనే లక్ష్యంతో పథకాన్ని రూపొందించారు. ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు కల్పించడం ద్వారా ముఖ్యంగా మహిళలు తాగునీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లడం, గంటల తరబడి క్యూలలో నిలబడటం వంటి ఇబ్బందులను తొలగించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

మొదట 2024 నాటికి పథకం లక్ష్యాలను సాధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పలు రాష్ట్రాల్లో పనుల పురోగతి ఆశించిన స్థాయిలో లేకపోవడం, నిధుల సమస్యలు, పనుల అమలులో ఎదురైన ఇతర ఇబ్బందుల కారణంగా లక్ష్యం పూర్తిస్థాయిలో నెరవేరలేదు. దీంతో జలజీవన్ మిషన్‌ను 2.0 రూపంలో 2028 డిసెంబర్ వరకు పొడిగించారు. ఈ కాలంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ సురక్షితమైన కుళాయి నీటి కనెక్షన్ అందించడంతో పాటు ఇప్పటికే ఏర్పాటు చేసిన నీటి సరఫరా వ్యవస్థలను సమర్థవంతంగా నిర్వహించడంపై కూడా దృష్టి సారించనున్నారు. చిత్తూరు జిల్లాలో జలజీవన్ మిషన్ కింద మొత్తం 4,834 పనులు మంజూరయ్యాయి. వీటి అంచనా వ్యయం సుమారు రూ.291.39 కోట్లు కాగా, ఇప్పటివరకు రూ.170.19 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మంజూరైన పనుల్లో 4,536 పనులు పూర్తయ్యాయని, 77 పనులు రద్దయ్యాయని, 204 పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయని, మరో 17 పనులు ఇప్పటివరకు ప్రారంభం కాలేదని అధికారుల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జలజీవన్ మిషన్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిధులు సమకూరుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 50 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం నిధులు భరించే విధంగా పథకాన్ని అమలు చేస్తున్నారు. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జలజీవన్ మిషన్ కింద చేపట్టిన పలు పనులకు సంబంధించి బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో కాంట్రాక్టర్లు పనులను కొనసాగించేందుకు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. ఫలితంగా అనేక గ్రామాల్లో పైపులైన్లు, కుళాయి కనెక్షన్లు, నీటి సరఫరా వ్యవస్థలకు సంబంధించిన పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పెండింగ్ బిల్లుల చెల్లింపుపై దృష్టి సారించింది. జిల్లాల వారీగా జలజీవన్ మిషన్ పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల వివరాలను ఇంజనీరింగ్ అధికారుల నుంచి ప్రభుత్వం సేకరించింది. పనుల స్థితిగతులు, పూర్తయిన పనులు, చెల్లించాల్సిన బిల్లులు తదితర అంశాలపై వివరాలను పరిశీలిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. పెండింగ్ బిల్లుల్లో అర్హమైన వాటిని చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుండటంతో కాంట్రాక్టర్లలో కూడా ఆశలు చిగురిస్తున్నాయి. బిల్లులు విడుదలైతే ఇప్పటికే నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించేందుకు కాంట్రాక్టర్లు ముందుకు వచ్చే అవకాశం ఉంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా పనులు వేగవంతం కానున్నాయి. ముఖ్యంగా వేసవి కాలంలో తాగునీటి కోసం గ్రామీణ ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జలజీవన్ మిషన్ పనులను వేగంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. 2028 డిసెంబర్ నాటికి జలజీవన్ మిషన్ లక్ష్యాలను సాధించాల్సి ఉండటంతో మిగిలిన పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయడంపై గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులు దృష్టి సారించారు. నిలిచిపోయిన పనుల వివరాలను సేకరించి సంబంధిత కాంట్రాక్టర్లతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటివరకు ప్రారంభం కాని పనులను రద్దు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్ బిల్లులు, పనుల పురోగతి, అవసరమైన నిధులు, గ్రామాల వారీగా నీటి అవసరాలను సమన్వయం చేసుకుని పనులను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జలజీవన్ మిషన్ పూర్తిస్థాయిలో అమలైతే జిల్లాలోని గ్రామీణ కుటుంబాలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ఇంటి వద్దకే కుళాయి ద్వారా తాగునీరు అందుబాటులోకి రావడంతో మహిళలు, చిన్నారులు నీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి తగ్గుతుంది. అంతేకాకుండా గ్రామాల్లో తాగునీటి లభ్యత మెరుగుపడటంతో ప్రజారోగ్య పరంగానూ ప్రయోజనాలు కలగనున్నాయి. అందువల్ల నిలిచిపోయిన పనులకు నిధులు విడుదల చేసి, కాంట్రాక్టర్లను పనుల్లోకి తీసుకువచ్చి, నిర్ణీత గడువులోగా పనులన్నింటినీ పూర్తి చేయాలని గ్రామీణ ప్రజలు కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం పెండింగ్ బిల్లుల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు ఫలించి, నిధుల ప్రవాహం మొదలైతే చిత్తూరు జిల్లాలో జలజీవన్ మిషన్ పనులు మళ్లీ ఊపందుకునే అవకాశం ఉంది. ఇప్పటికే పూర్తయిన పనులను వినియోగంలోకి తీసుకురావడంతో పాటు అసంపూర్తిగా ఉన్న పనులను వేగంగా పూర్తి చేసి ప్రతి గ్రామీణ కుటుంబానికి సురక్షితమైన తాగునీటిని అందించడమే అధికారులు, ప్రభుత్వానికి ముందున్న ప్రధాన లక్ష్యంగా మారింది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *