ఎల్‌నినో నేపథ్యంలో నేటి నుంచి రైతన్న నీకోసం కార్యక్రమం
ఎల్‌నినో నేపథ్యంలో నేటి నుంచి రైతన్న నీకోసం కార్యక్రమం
• జిల్లాలో వర్షాభావ పరిస్థితులపై క్షేత్రస్థాయిలో సమగ్ర అధ్యయనం
• ప్రతి రైతు పొలానికి వెళ్లి పంటల పరిస్థితిపై ప్రత్యక్ష పరిశీలన
• నీటి కొరత, ఎండిపోతున్న పంటలు, ప్రత్యామ్నాయ సాగుపై ప్రత్యేక కార్యాచరణ
• ఆర్‌ఎస్‌కే కేంద్రంగా వ్యవసాయ, అనుబంధ శాఖల సమన్వయంతో విస్తృత ప్రచారం
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)
ఎల్‌నినో ప్రభావంతో చిత్తూరు జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. సాధారణానికి తక్కువ వర్షపాతం నమోదవడంతో జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పచ్చదనం కనుమరుగైంది. చెరువులు, కుంటలు, వాగులు అడుగంటిపోగా, భూగర్భ జలమట్టాలు గణనీయంగా పడిపోయాయి. బోర్లు ఎండిపోవడంతో సాగునీటి సమస్య మరింత తీవ్రమైంది. ఆశించిన మేర పంటల సాగు జరగక అనేక పొలాలు బీడుగా మిగిలిపోయాయి. ఇప్పటికే సాగు చేసిన పంటలు కూడా తేమ లేక ఎండుముఖం పట్టాయి. వ్యవసాయ అవసరాలకు తగినంత విద్యుత్ అందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులను ఆదుకోవడం, పంట నష్టాలను తగ్గించడం, శాస్త్రీయ సూచనలతో క్షేత్రస్థాయిలో పరిష్కారాలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నుంచి రైతన్న నీకోసం ఎల్‌నినో ప్రభావ నివారణ కార్యాచరణ ప్రణాళికను చిత్తూరు జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిస్తోంది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఈ కార్యక్రమాన్ని రైతు సేవా కేంద్రాల (ఆర్‌ఎస్‌కే)ను కేంద్రంగా చేసుకుని అమలు చేయనున్నారు.
ఈ కార్యక్రమంలో ప్రతి గ్రామంలోని రైతును నేరుగా కలిసి వారి భూమిని సందర్శించడం ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు. రైతు భూమి వారీగా పంటల పరిస్థితిని పరిశీలించి విత్తిన విస్తీర్ణం, ఇంకా విత్తని భూములు, మొక్కల ఎదుగుదల, తేమ శాతం, ఎండిపోతున్న పంటలు, పురుగులు, తెగుళ్లు, పండ్ల తోటల పరిస్థితి, బీడు భూములు, బంజరు భూములు వంటి అంశాలపై సమగ్ర నిర్ధారణ చేపడతారు. ప్రతి రైతు సమస్యను క్షేత్రస్థాయిలో నమోదు చేసి, ఆ సమస్యకు తక్షణ పరిష్కార మార్గాలను సూచిస్తారు. పరిశీలనలో గుర్తించిన సమస్యలకు అనుగుణంగా రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగు, కరవును తట్టుకునే పంటల ఎంపిక, మళ్లీ విత్తడం, అంతర పంటల సాగు, తేమ సంరక్షణ పద్ధతులు, ప్రాణాధార సాగునీటి వినియోగం, సీడ్ పెల్లెటింగ్, పీఎండీఎస్, సహజ వ్యవసాయం వంటి అంశాలపై శాస్త్రీయ అవగాహన కల్పిస్తారు. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న ప్రతి నీటి వనరును సమర్థంగా వినియోగించే విధానాలను వివరించడంతో పాటు పంటలను ఎలా కాపాడుకోవాలో వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలను రైతులకు చేరవేస్తారు. అవసరమైన చోట ప్రత్యక్ష ప్రదర్శనలు కూడా నిర్వహిస్తారు. కార్యక్రమంలో రైతు సేవా కేంద్రం స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ కమిటీలు పనిచేస్తాయి. వ్యవసాయ శాఖ అధికారులు, ఉద్యానవన శాఖ అధికారులు, పశుసంవర్ధక శాఖ, మత్స్యశాఖ, భూసార పరీక్ష విభాగం, ఏపీసీఎన్‌ఎఫ్, రైతు సాధికార సంస్థ (రైఎస్‌ఎస్), గ్రామ వ్యవసాయ సహాయకులు, గ్రామ కార్యదర్శులు, నీటి పారుదల శాఖ అధికారులు, ఇతర అనుబంధ శాఖల సిబ్బంది సమన్వయంతో ప్రతి గ్రామంలో విస్తృత పర్యటనలు చేపడతారు. రైతులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకుని శాఖల సమన్వయంతో పరిష్కార చర్యలు అమలు చేస్తారు. ప్రతి రైతు భూమికి సంబంధించిన సమాచారం, పంటల స్థితి, సమస్యలు, అధికారులు ఇచ్చిన సూచనలు, అమలు చేసిన చర్యలు, ఫొటోలు, తదుపరి పురోగతి వంటి వివరాలను ఏపీఏఐఎంఎస్ 2.0 యాప్‌లో నమోదు చేస్తారు. ఈ సమాచారం ఆధారంగా రాష్ట్ర, జిల్లా, మండల, రైతు సేవా కేంద్రాల స్థాయిలో ప్రత్యేక డ్యాష్‌బోర్డుల ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుంది. రైతు యాప్‌ను ప్రతి రైతు డౌన్‌లోడ్ చేసుకునేలా ప్రత్యేక ప్రచారం నిర్వహించి వ్యవసాయ సలహాలు, ప్రభుత్వ సేవలను నేరుగా రైతులకు అందించే చర్యలు చేపడతారు. మొదటి వారంలో ప్రతి రైతు భూమి పరిస్థితిపై సమగ్ర నిర్ధారణకు ప్రాధాన్యత ఇస్తారు. అనంతరం ఏడు నుంచి ఎనిమిది వారాల పాటు సూచించిన చర్యల అమలు, వాటి ఫలితాలు, పంటల పురోగతి, పెండింగ్ సమస్యల పరిష్కారంపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో జిల్లా వ్యవసాయ అధికారి, మండల వ్యవసాయ అధికారులు, రైతు సేవా కేంద్రాల సిబ్బంది, అనుబంధ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించి ఖరీఫ్ పంటలను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. రైతులకు అవసరమైన సమయంలో ప్రభుత్వం అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

