29, ఆగస్టు 2026, శనివారం

అభివృద్ధికి బాటలు ... అనిశ్చితకు బాయ్ బాయ్

అభివృద్ధికి బాటలు ... అనిశ్చితకు బాయ్ బాయ్ 
చైర్మన్‌ కోసం క్యాంపులు అవసరం లేదు
సభ్యులకు భయపడాల్సిన అవసరం లేదు
ప్రజలే బాసులు ... సుస్థిర పాలనకు అవకాశం
స్థానిక పాలనలో కొత్త అధ్యాయం

(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)

 స్థానిక సంస్థల పాలనలో కీలక మార్పులకు తెరలేచింది. మేయర్లు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, నగర పంచాయతీల చైర్‌పర్సన్లను ఇకపై ప్రజలే నేరుగా ఎన్నుకునేలా ప్రభుత్వం తీసుకొచ్చిన మున్సిపల్‌ చట్ట సవరణకు గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఆమోదం తెలిపారు. పంచాయతీరాజ్‌ చట్ట సవరణకు కూడా గవర్నర్‌ ఆమోదముద్ర పడింది. దీంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకత్వ ఎంపిక విధానం పూర్తిగా మారనుంది. చైర్మన్ ఎన్నిక కోసం సభ్యులతో క్యాంపులో నిర్వహించాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎప్పుడు అవిశ్వాస తీర్మానం పెడుతారో అని సభ్యులు అడిగిన పనులు అన్ని చేసి పెట్టాల్సిన అవసరం లేదు. స్వతంత్రంగా అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి అమలు చేయవచ్చును. వైస్ చైర్మన్లు ఇద్దరి నుండి ఒకరికి తగ్గడంతో వారితో సమన్వయం పెరిగే అవకాశం ఉంది. గ్రూపు రాజకీయాలకు అవకాశాలు తక్కువ. పార్టీ సభ్యుల దయాదక్షణ్యాలతో  కాకుండా ఐదు సంవత్సరాల పాటు సుస్థిర పాలన అందించే అవకాశం ఉంది. చైర్మన్గా పూర్తిస్థాయిలో అభివృద్ధి పైన దృష్టిని కేంద్రీకరించడానికి అవకాశం ఉంది.


ఇప్పటివరకు మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్‌, కార్పొరేషన్లలో మేయర్‌, జిల్లా పరిషత్‌లో చైర్‌పర్సన్‌ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు ఉండేవి కావు. ప్రజలు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, జడ్పీటీసీ సభ్యులను ఎన్నుకుంటే.. వారిలో మెజారిటీ ఉన్న పార్టీ తమ సభ్యుల్లో ఒకరిని చైర్మన్‌ లేదా మేయర్‌గా ఎన్నుకునేది. దీంతో అసలు పోరు ఎన్నికలతో ముగిసేది కాదు. అసలు రాజకీయాలు ఆ తర్వాతే మొదలయ్యేవి. ఎవరి వైపు ఎంతమంది సభ్యులు ఉన్నారు? ఎవరు ఎటు జారుతారు? ఎవరి మద్దతు ఎవరికి లభిస్తుంది? అన్నది ఉత్కంఠగా మారేది. ముఖ్యంగా హంగ్‌ పరిస్థితుల్లో గెలిచిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, జడ్పీటీసీ సభ్యులను కాపాడుకోవడం పార్టీలకు తలకు మించిన భారంగా మారేది. ఎన్నికల్లో గెలిచిన వారిని క్యాంపులకు తరలించడం, రిసార్టులు, హోటళ్లలో ఉంచడం, ఎన్నికల రోజు నేరుగా తీసుకురావడం వంటి రాజకీయ వ్యవహారాలు సాధారణంగా మారాయి. మెజారిటీకి ఒక్కటి రెండు సభ్యులు తక్కువగా ఉన్న సందర్భాల్లో ప్రత్యర్థి పార్టీల సభ్యులను తమవైపు తిప్పుకునేందుకు ప్రలోభాలు, బేరసారాలు జరిగేవన్న ఆరోపణలు కూడా తరచూ వినిపించేవి. ఓకే పార్టీలో చైర్మన్ పదవిని ఎక్కువ మంది ఆశిస్తే తీవ్రమైన పోటీ ఏర్పడే అవకాశం ఉంది. ఈ విషయం అధిష్టానానికి తలనొప్పిగా మారే పరిస్థితిలు ఉన్నాయి. ఒక్కొక్కరు కొంతకాలం అంటూ అధిష్టానం సర్దుబాటు చేసే పరిస్థితి కూడా ఉండేది. కొన్నిసార్లు  ఐదేళ్ల పదవీకాలంలోనే ఇద్దరు, ముగ్గురు చైర్మన్లు మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితిలో చైర్మన్‌ పదవిలో ఉన్న వ్యక్తి ప్రజల కంటే తనను ఎన్నుకున్న సభ్యుల మద్దతును కాపాడుకోవడంపైనే ఎక్కువ దృష్టి పెట్టాల్సి వచ్చేది. అవిశ్వాస తీర్మానం భయం కూడా వెంటాడేది. సభ్యులు తనకు వ్యతిరేకంగా మారితే పదవి పోయే ప్రమాదం ఉండటంతో వారి అభీష్టానికి అనుగుణంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఫలితంగా అభివృద్ధి కంటే రాజకీయ సమీకరణాలకే ప్రాధాన్యం పెరిగేది. అయితే ప్రత్యక్ష ఎన్నికల విధానంతో ఈ పరిస్థితికి తెరపడే అవకాశం ఉంది. ప్రజలే నేరుగా మేయర్‌, చైర్‌పర్సన్‌ను ఎన్నుకోవడంతో ఆ పదవిలో ఉన్న వ్యక్తికి ఐదేళ్లపాటు ప్రజల ముందు నేరుగా బాధ్యత ఉంటుంది. కౌన్సిలర్లు, కార్పొరేటర్లు లేదా జడ్పీటీసీ సభ్యుల వ్యక్తిగత మద్దతుపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. ఫలితంగా స్థానిక సంస్థల అభివృద్ధి, మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు, పట్టణ ప్రణాళిక వంటి అంశాలపై ఎక్కువ సమయం కేటాయించే అవకాశం ఉంటుంది. అయితే ప్రత్యక్ష ఎన్నికలతో అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పలేం. ఒక పార్టీకి చెందిన వ్యక్తి మేయర్‌ లేదా చైర్‌పర్సన్‌గా ప్రజల మద్దతుతో గెలిచి, మరో పార్టీకి చెందిన కౌన్సిలర్లు లేదా కార్పొరేటర్లు మెజారిటీ సాధిస్తే పరిస్థితి మళ్లీ సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది. చైర్మన్‌ ఒక పార్టీకి, కౌన్సిల్‌ మరో పార్టీకి చెందినప్పుడు అభివృద్ధి తీర్మానాలు, బడ్జెట్‌ నిర్ణయాలు, విధానపరమైన అంశాల్లో విభేదాలు తలెత్తవచ్చు. అలాంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల పాలన సజావుగా సాగేందుకు చట్టపరమైన, పరిపాలనా సమన్వయం కీలకం కానుంది. ఇదే సమయంలో డిప్యూటీ మేయర్లు, వైస్‌ చైర్‌పర్సన్ల సంఖ్యను కూడా ప్రభుత్వం కుదించింది. కార్పొరేషన్లలో రెండు డిప్యూటీ మేయర్‌ పదవుల స్థానంలో ఒకటి, మున్సిపాలిటీల్లో రెండు వైస్‌ చైర్‌పర్సన్‌ పదవుల స్థానంలో ఒకటి ఉండేలా మార్పులు చేశారు. గతంలో పెంచిన ఈ పదవులను తిరిగి ఒకటికి పరిమితం చేయడం ద్వారా స్థానిక సంస్థల్లో సమాంతర అధికార కేంద్రాలు ఏర్పడే అవకాశాన్ని తగ్గించాలన్న ఉద్దేశం కనిపిస్తోంది. మరో కీలక మార్పు జిల్లా పరిషత్‌ల విషయంలో జరిగింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా రాష్ట్రంలో 28 జిల్లా పరిషత్‌లను ఏర్పాటు చేయడానికి పంచాయతీరాజ్‌ చట్టాన్ని సవరించారు. కొత్త జిల్లాల పరిపాలనా పరిధికి అనుగుణంగా జిల్లా పరిషత్‌ వ్యవస్థను కూడా పునర్వ్యవస్థీకరించనున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికలు కొత్త జిల్లాల పరిధికి అనుగుణంగా రూపొందించుకునే అవకాశం ఏర్పడనుంది. రాజకీయంగా చూస్తే ఈ మార్పు స్థానిక ఎన్నికల ముఖచిత్రాన్నే మార్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు కౌన్సిలర్‌, కార్పొరేటర్‌, జడ్పీటీసీ స్థానాల్లో గెలుపే కీలకంగా ఉండగా, ఇకపై చైర్మన్‌ పదవికి కూడా నేరుగా ప్రజల తీర్పు తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పార్టీలు అభ్యర్థుల ఎంపికలో మరింత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. స్థానికంగా ప్రజల్లో మంచి పేరు, వ్యక్తిగత ఆదరణ, అభివృద్ధిపై స్పష్టమైన అవగాహన ఉన్న నాయకులకు ప్రాధాన్యం పెరగవచ్చు. మొత్తంగా చూస్తే ఎవరి దగ్గర ఎంతమంది సభ్యులు ఉన్నారు అనే లెక్కల నుంచి ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు అనే దిశగా స్థానిక రాజకీయాలు మలుపు తిరగనున్నాయి. క్యాంపు రాజకీయాలు, బేరసారాలు, అవిశ్వాస తీర్మానాల ఒత్తిళ్లకు కొంతమేర అడ్డుకట్ట పడే అవకాశం ఉండగా, ప్రజలే నేరుగా ఎన్నుకున్న నాయకుడు ప్రజలకే జవాబుదారీగా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. అయితే చైర్మన్‌ ఒక పార్టీకి, కౌన్సిల్‌ మరో పార్టీకి చెందిన సందర్భాల్లో ఏర్పడే అధికార సమీకరణాలను సమర్థంగా నిర్వహించగలిగితేనే ఈ కొత్త విధానం ఆశించిన ఫలితాలను ఇస్తుంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *