వేగవంతం కానున్న హంద్రీ నీవా పనులు
చిత్తూరు దాహార్తిని తీర్చనున్న కృష్ణా జలాలు
హంద్రీనీవా పనులకు రూ.1,323.75 కోట్లు..
చిత్తూరు జిల్లాకు భారీ ప్రయోజనం
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)
రాయలసీమ సాగు, తాగునీటి అవసరాలకు కీలకమైన హంద్రీ నీవా సుజల స్రవంతి రెండో దశలో మిగిలిన పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,323.75 కోట్ల పరిపాలనా అనుమతి ఇవ్వడం చిత్తూరు జిల్లా రైతులకు, ప్రజలకు భారీ ఊరటనిచ్చే నిర్ణయంగా మారింది. శ్రీ సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో చేపట్టాల్సిన మిగిలిన పనులకు ఈ నిధులను వినియోగించనున్నారు. ఈ నిధులతో హంద్రీ నీవా సుజల స్రవంతి పనులు వేగవతం కానున్నాయి. వేలాది ఎకరాల ఆయకట్టు సాగులోకి రానుంది. జిల్లాలో శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కారం కానుంది. చిత్తూరు జిల్లా ఇప్పటికే హంద్రీ నీవా ప్రాజెక్టు పరిధిలో కీలకంగా ఉంది. జిల్లాలో ఈ ప్రాజెక్టు కింద మొత్తం 58,550 ఎకరాల ఆయకట్టు ఉన్నట్లు ప్రభుత్వ జిల్లా సర్వే నివేదిక పేర్కొంది. నియోజకవర్గాల వారీగా చూస్తే కుప్పం 6,300 ఎకరాలు, పుంగనూరు 17,800 ఎకరాలు, చిత్తూరు 6,200 ఎకరాలు, పూతలపట్టు 20,150 ఎకరాలు, పలమనేరు 8,100 ఎకరాల ఆయకట్టు హంద్రీ నీవా పరిధిలో ఉంది.
రాయలసీమలో తరచూ ఏర్పడే కరువు పరిస్థితులకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టును చేపట్టారు. శ్రీశైలం జలాశయం నుంచి వరద జలాలను తరలించి రాయలసీమలోని ఎత్తయిన ప్రాంతాలకు నీటిని అందించడం దీని ప్రధాన ఉద్దేశం. ప్రాజెక్టు ద్వారా నాలుగు జిల్లాల్లో సుమారు 6.025 లక్షల ఎకరాలకు సాగునీరు, సుమారు 33 లక్షల మందికి తాగునీరు అందించాలన్న లక్ష్యం ఉంది. ప్రధాన కాలువ పొడవు సుమారు 565 కిలోమీటర్లు కాగా, నీటిని ఎత్తిపోసేందుకు పలు దశల్లో పంపింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లాకు పుంగనూరు కాలువ జీవనాడిగా మారనుంది. హంద్రీ నీవా రెండో దశలో పుంగనూరు బ్రాంచ్ కెనాల్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. పుంగనూరు ప్రాంతంతో పాటు జిల్లాలోని ఎత్తయిన ప్రాంతాలకు నీటిని తరలించేందుకు ఈ కాలువ కీలకంగా పనిచేయనుంది. గతంలోనే పుంగనూరు బ్రాంచ్ కెనాల్‌లో 75–207 కిలోమీటర్ల పరిధిలో పనులకు రూ.480 కోట్ల కేటాయింపుతో పనులు ప్రారంభమయ్యాయి. అలాగే హంద్రీ నీవా ప్రధాన కాలువలో వెడల్పు, లైనింగ్ పనులకు కూడా భారీగా నిధులు కేటాయించారు. ప్రభుత్వం తాజాగా మిగిలిన పనులకు రూ.1,323.75 కోట్లకు పరిపాలనా అనుమతి ఇవ్వడంతో చిత్తూరు జిల్లాలో ఇప్పటికే ఉన్న కాలువలు, అనుబంధ నిర్మాణాలు, నీటి పంపిణీ వ్యవస్థలు మరింత బలోపేతం కానున్నాయి. పనులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే పుంగనూరు, పూతలపట్టు, చిత్తూరు, పలమనేరు, కుప్పం ప్రాంతాల్లో సాగునీటి భరోసా పెరగడంతో పాటు తాగునీటి సమస్యకు కూడా కొంతమేర శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం చిత్తూరు జిల్లా ప్రధానంగా వర్షాధార వ్యవసాయంపై ఆధారపడి ఉంది. వేరుశనగ, టమాటా, మామిడి, కూరగాయలు తదితర పంటలకు నీటి లభ్యత అత్యంత కీలకం. ముఖ్యంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు బోర్లు, చెరువులు ఎండిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హంద్రీ–నీవా నీరు అందుబాటులోకి వస్తే సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు పంటల దిగుబడులు కూడా మెరుగుపడే అవకాశం ఉంది. జిల్లాలోని పలు ప్రాంతాలకు హంద్రీ నీవా నీటిని అందించేందుకు ఇప్పటికే వివిధ రిజర్వాయర్లు, సమతుల్య జలాశయాలు, కాలువల వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. పుంగనూరు మండలంలోని నెత్తిగుంటపల్లె సమతుల్య జలాశయం నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ కూడా గతంలో చేపట్టినట్లు జిల్లా అధికారిక రికార్డులు వెల్లడిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో హంద్రీ నీవా రెండో దశలో మిగిలిపోయిన పనులను వేగవంతంగా పూర్తి చేసి చిత్తూరు జిల్లాకు కేటాయించిన ఆయకట్టుకు సమర్థవంతంగా నీరు అందించాల్సిన అవసరం ఉందని రైతులు కోరుతున్నారు. నిధులు మంజూరు చేయడమే కాకుండా పనుల్లో జాప్యం లేకుండా నాణ్యతతో పూర్తి చేసి, కాలువల ద్వారా చివరి ఆయకట్టు వరకు నీరు చేరేలా చర్యలు తీసుకుంటేనే ఈ భారీ ప్రాజెక్టు లక్ష్యం నెరవేరుతుందని రైతులు అభిప్రాయపడుతున్నారు.

