జడ్పీలో కోట్ల నిధులు స్వాహా ..
జడ్పీలో కోట్ల నిధులు స్వాహా .. అయితే ఎవరు స్వాహా చేశారో తెలియదు
నిధుల రికవరీ ఊసే లేదు ... క్రమశిక్షణ చర్యల జాడలేదు
రూ.35 కోట్లకు పైగా నిధులు దుర్వినియోగం ?
వ్యక్తిగత ఖాతాలకు కోట్లాది రూపాయల మళ్లింపు
దస్త్రాలు, ఓచర్లు మాయం.. జడ్పీ తీర్మానం లేకుండానే నిధుల వ్యయం
జడ్పీ సీఈఓ సంతకం లేకుండానే చెక్కుల జారీ
ముగ్గురు సభ్యుల కమిటీ విచారణలో సంచలన విషయాలు
అవకతవకలు జరిగాయని తేల్చినా.. బాధ్యులెవరో తేల్చలేకపోయిన వైనం
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)
చిత్తూరు జిల్లా పరిషత్‌లో ఏళ్ల తరబడి సాగిన నిధుల వ్యవహారంపై జరిగిన విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం మంజూరు చేసిన కోట్లాది రూపాయల నిధులు నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేయడం, జడ్పీ తీర్మానం లేకుండానే పనులకు నిధులు కేటాయించడం, వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు నిధులు మళ్లించడం, జడ్పీ సీఈఓ సంతకం లేకుండానే చెక్కులు జారీ చేయడం వంటి అనేక అక్రమాలు చోటుచేసుకున్నట్లు విచారణలో గుర్తించినట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారాలకు సంబంధించిన కీలక దస్త్రాలు, ఓచర్లు, ఇతర ఆధారాలు మాయమవడంతో అసలు బాధ్యులను గుర్తించడంలో విచారణ కమిటీ చేతులెత్తేసిన పరిస్థితి నెలకొంది. దీంతో కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగమైనట్లు తేలినా.. ఎవరు చేశారు? ఎవరి హయాంలో జరిగింది? ఎవరి ఖాతాలకు వెళ్లాయి? అన్న ప్రశ్నలకు మాత్రం స్పష్టమైన సమాధానం లేకుండా పోయింది. దీంతో దుర్వినియోగమైన కోట్లాది రూపాయల రికవరీ గురించి ప్రస్తావన లేకుండా పోయింది. దోచుకున్న ప్రభుత్వ ధనం దోచుకున్న వారికి సొంతం అయ్యింది. ఇందుకు సంబంధించిన రికార్డులు లభ్యం కాకపోవడంతో ఎవరిని దోషులుగా తేల్చలేదు. కావున ఎవరి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవలసిన అవసరం కూడా లేదు. ప్రభుత్వ వ్యవహారము అంటే ఇలానే ఉంటుంది అన్న భావన ప్రజలలో బలపడుతోంది. అందరూ శ్రీ వైష్ణవులే కానీ బుట్టలో చేపలు మాయం అన్న సామెత జిల్లా పరిషత్ నిధుల దుర్వినియోగం విషయానికి అతికినట్లు సరిపోతుంది.
*జిల్లా పరిషత్ నిధుల దుర్వినియోగం నిజమే*
జిల్లా పరిషత్‌కు విడుదలైన వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు (బీఆర్‌జీఎఫ్), ఆర్థిక సంఘం నిధులు, వాటిపై వచ్చిన వడ్డీల విషయంలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. జడ్పీకి వివిధ పథకాల కింద విడుదలైన సుమారు రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు నిధులను బ్యాంకుల్లో డిపాజిట్ చేసినట్లు సమాచారం. వాటిపై వచ్చిన వడ్డీతో పాటు బీఆర్‌జీఎఫ్ నిధులను కూడా నిబంధనలకు విరుద్ధంగా వినియోగించినట్లు అప్పటి జడ్పీ ఉద్యోగులు లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లా ఆడిట్ అధికారి కృష్ణారెడ్డిని కలెక్టర్ విచారణాధికారిగా నియమించారు. ఆయన 2024 ఆగస్టులో విచారణ నిర్వహించి నివేదిక సమర్పించారు. అయితే ఆ నివేదికపై సంతృప్తి చెందని జిల్లా కలెక్టర్ మరోసారి సమగ్ర విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. జిల్లా ఆడిట్, సహకార శాఖ అధికారులు, జడ్పీ సీఈఓలతో త్రీ సభ్య కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఖాతాల వారీగా పరిశీలన చేయడంతో నిధుల మళ్లింపు, దుర్వినియోగానికి సంబంధించిన మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.
*ఇందుకు సంబంధించిన ఫైళ్లు మాయమయ్యాయి?*
నిధుల దుర్వినియోగానికి సంబంధించిన కీలక దస్త్రాలు, బిల్లులు, ఓచర్లు, అనుమతులు, చెక్కులకు సంబంధించిన రికార్డులు పెద్ద సంఖ్యలో అందుబాటులో లేకపోవడం విచారణ అధికారులను విస్మయానికి గురిచేసినట్లు తెలుస్తోంది. నిధుల అక్రమ వినియోగానికి సంబంధించిన ఆధారాలను ముందుగానే తొలగించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని ముఖ్యమైన దస్త్రాలు పథకం ప్రకారం మాయం చేసినట్లు అధికారులు భావించినట్లు సమాచారం. జిల్లా పరిషత్‌లో ఒకే అధికారి వివిధ దశల్లో సీనియర్ సహాయకుడు, పర్యవేక్షకుడు, పరిపాలనా అధికారి, ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి, చివరకు సీఈఓగా కూడా బాధ్యతలు నిర్వహించడం కూడా అనుమానాలకు తావిచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆ కాలానికి సంబంధించిన వ్యవహారాల్లో అంతర్గత నియంత్రణలు, పర్యవేక్షణ ఏ మేరకు జరిగాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
*జడ్పీ తీర్మానం లేకనే నిధుల మంజూరు*
జిల్లా పరిషత్ సమావేశంలో తీర్మానం చేయడం, సంబంధిత పనులకు అనుమతి పొందడం, నిధుల వినియోగానికి నిర్దేశిత ప్రక్రియను పాటించడం వంటి నిబంధనలు ఉన్నప్పటికీ అనేక పనులకు జడ్పీ తీర్మానం లేకుండానే నిధులు కేటాయించినట్లు విచారణలో గుర్తించినట్లు సమాచారం. ఒక్కో జడ్పీ సమావేశానికి రూ.10 లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు రికార్డులు సృష్టించినట్లు కూడా అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. కొత్తగా నిర్మించిన జిల్లా పరిషత్ భవనం విషయంలోనూ పలు అనుమానాస్పద వ్యవహారాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. భవనానికి మంజూరైన లిఫ్టు ఏర్పాటు ప్రక్రియను రద్దు చేయడం, సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఏసీ యంత్రాలు పనిచేయకుండా చేసి సమావేశాల సమయంలో బయట నుంచి ఏసీ యంత్రాలను అద్దెకు తెప్పించినట్లు రికార్డులు చూపుతున్నట్లు తెలుస్తోంది. వీటి నిర్వహణకు భారీగా ఖర్చు చేసినట్లు లెక్కలు చూపినప్పటికీ వాస్తవ పరిస్థితిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.
*వ్యక్తిగత ఖాతాలకు నిధుల మళ్లింపు*
బీఆర్‌జీఎఫ్, ఆర్థిక సంఘం నిధుల్లో నుంచి సుమారు రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు ఒక జడ్పీ ఉద్యోగి బ్యాంకు ఖాతాకు మళ్లించినట్లు విచారణలో తేలినట్లు సమాచారం. మరికొంత మొత్తాన్ని అదే శాఖలోని ఇతర ఉద్యోగుల ఖాతాలకు మళ్లించినట్లు కూడా గుర్తించినట్లు తెలుస్తోంది. ఇలా వివిధ మార్గాల్లో నిధులు మళ్లింపునకు గురైనట్లు ప్రాథమికంగా గుర్తించగా, మొత్తం దుర్వినియోగం సుమారు రూ.75 కోట్ల వరకు ఉండొచ్చని తొలుత అంచనా వేసినట్లు సమాచారం. అనంతరం మరో జడ్పీ సీఈఓ ఆధ్వర్యంలో జరిగిన పరిశీలనలో దుర్వినియోగమైన మొత్తాన్ని సుమారు రూ.35 కోట్లుగా నిర్ధారించి ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు తెలుస్తోంది. అయితే వ్యక్తిగత ఖాతాలకు నిధులు మళ్లించినట్లు అనుమానాలు ఉన్నప్పటికీ, వాటికి సంబంధించిన ఓచర్లు, పూర్తి స్థాయి లావాదేవీ రికార్డులు అందుబాటులో లేకపోవడంతో విచారణను ముందుకు తీసుకెళ్లడం కష్టంగా మారినట్లు సమాచారం.
*జడ్పీ సీఈఓ సంతకం లేకనే చెక్కుల జారీ*
జిల్లా పరిషత్ నిధుల విడుదలలో అత్యంత కీలకమైన అంశమైన చెక్కుల జారీ విషయంలోనూ నిబంధనలు ఉల్లంఘించినట్లు విచారణలో గుర్తించినట్లు తెలుస్తోంది. సాధారణంగా జడ్పీ సీఈఓ సంతకంతో జారీ కావాల్సిన చెక్కుల్లో అనేక చెక్కులు పర్యవేక్షకుడి సంతకంతోనే జారీ అయినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. కొన్ని చెక్కులపై ‘సీఈఓ తరఫున’ అన్న రీతిలో సంతకాలు చేసి, సీఈఓకు పూర్తి సమాచారం లేకుండానే నిధులు విడుదల చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఇది నిజమైతే జిల్లా పరిషత్ ఆర్థిక వ్యవహారాల్లో అమలులో ఉన్న నియంత్రణ వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
*రూ.35 కోట్ల నిధులు ఎక్కడికి వెళ్లాయి?*
విచారణలో మొత్తం దుర్వినియోగమైన నిధుల విలువను సుమారు రూ.35 కోట్లుగా తేల్చినట్లు సమాచారం. అయితే ఈ మొత్తం ఏయే పనులకు ఖర్చయింది? ఎంత మొత్తం ఏయే బ్యాంకు ఖాతాలకు వెళ్లింది? వ్యక్తిగత ఖాతాలకు మళ్లించిన మొత్తం ఎంత? దానికి ఎవరు బాధ్యులు? అన్న అంశాలపై పూర్తి స్థాయి ఆధారాలు లభించలేదని తెలుస్తోంది. బ్యాంకుల్లో జమ చేసిన ప్రభుత్వ నిధులపై వచ్చిన వడ్డీని కూడా నిబంధనలకు విరుద్ధంగా వినియోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి వచ్చిన గ్రాంట్లను ఇష్టానుసారంగా వివిధ బ్యాంకుల్లో జమ చేసి, వాటిపై వచ్చిన వడ్డీని సైతం సొంత అవసరాలకు వినియోగించినట్లు విచారణలో అనుమానాలు వ్యక్తమైనట్లు సమాచారం.
*పూర్వ సీఈవోల పాత్రపై అనుమానం*
ఈ మొత్తం వ్యవహారంలో గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన పలువురు జడ్పీ సీఈవోల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిధుల విడుదల, పనుల మంజూరు, చెక్కుల జారీ, బ్యాంకు ఖాతాల నిర్వహణ వంటి అంశాల్లో అప్పటి అధికారుల పర్యవేక్షణ ఏ మేరకు ఉందన్న దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే కీలకమైన దస్త్రాలు, రికార్డులు, ఓచర్లు అందుబాటులో లేకపోవడంతో అధికారుల పాత్రను నిర్ధారించడంలో విచారణ కమిటీకి ఇబ్బందులు ఎదురైనట్లు తెలుస్తోంది. మరింత లోతైన దర్యాప్తు జరిగితే నిధులు ఎక్కడికి మళ్లాయి, ఎవరి ఆదేశాలతో ఖర్చయ్యాయి, వ్యక్తిగత ఖాతాలకు ఎందుకు వెళ్లాయి వంటి అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ప్రస్తుత అధికారులు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.
*అవకతవకలు నిజమే.. అయితే ఎవరు చేశారో తెలియదు*
జిల్లా పరిషత్‌లో భారీగా ఆర్థిక అవకతవకలు జరిగినట్లు ముగ్గురు సభ్యుల కమిటీ నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. జడ్పీ తీర్మానం లేకుండా నిధులు ఖర్చు చేయడం, నిబంధనలకు విరుద్ధంగా చెక్కులు జారీ చేయడం, నిధులు మళ్లించడం వంటి అంశాలను కమిటీ గుర్తించినట్లు సమాచారం. అయితే ఈ అక్రమాలకు సంబంధించిన కీలక ఆధారాలు, దస్త్రాలు మాయమవడంతో నిర్దిష్టంగా ఎవరి మీద చర్యలు తీసుకోవాలో తేల్చలేకపోయినట్లు తెలుస్తోంది. ఇదే ఇప్పుడు జిల్లా పరిషత్‌లో చర్చనీయాంశంగా మారింది. కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైనట్లు విచారణలో తేల్చి, అదే సమయంలో బాధ్యులను గుర్తించలేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కొండను తవ్వి ఎలుకను పట్టలేకపోయిన చందంగా ముగ్గురు సభ్యుల కమిటీ విచారణ ముగిసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ఈ వ్యవహారంలో సస్పెన్షన్‌కు గురైన మాజీ సీఈఓ ప్రభాకర్‌రెడ్డికి కూడా పదవీ విరమణ ప్రయోజనాల్లో సుమారు 75 శాతం మేర అందించినట్లు సమాచారం. భారీగా నిధుల దుర్వినియోగం జరిగినట్లు నిర్ధారణ అయిన నేపథ్యంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకుండా పదవీ విరమణ ప్రయోజనాలు కల్పించడం పట్ల కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా పరిషత్‌లో దీర్ఘకాలంగా పాతుకుపోయిన కొందరు అధికారులు, సిబ్బంది కారణంగానే ఈ స్థాయిలో ఆర్థిక అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రత్యేక అధికారులతో మరోసారి సమగ్ర దర్యాప్తు నిర్వహించి, బ్యాంకు ఖాతాలు, పాత రికార్డులు, అందుబాటులో ఉన్న లావాదేవీ వివరాలను సాంకేతికంగా పరిశీలిస్తే నిధుల గమ్యం, బాధ్యుల పాత్రపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా మాయమైన దస్త్రాల వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి, ప్రజాధనానికి జరిగిన నష్టాన్ని రికవరీ చేయడంతో పాటు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది.

