23, ఆగస్టు 2026, ఆదివారం

జిల్లాలో కరవును పట్టించుకోని ప్రజాప్రతినిధులు

జిల్లాలో కరవును పట్టించుకోని ప్రజాప్రతినిధులు

మూడు నెలలుగా వర్షాల జాడలేదు.. ఎల్‌నినో ప్రభావంతో విలవిల

ఖరీఫ్‌ సాగు 21.33 శాతానికే పరిమితం.. వేరుశనగ సాగు 11.15 శాతం

భూగర్భ జలాలు అడుగంటుతున్నా.. తాగునీటి కష్టాలు మొదలైనా స్పందన కరవు

జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని రైతుల డిమాండ్‌

(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ)

ఎల్‌నినో ప్రభావంతో చిత్తూరు జిల్లాలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు రైతాంగాన్ని కుదేలు చేస్తున్నా ప్రజాప్రతినిధులు మాత్రం కరువు పరిస్థితులపై ఆశించిన స్థాయిలో స్పందించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత మూడు నెలలుగా జిల్లాలో చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో వ్యవసాయం, పశుపోషణ, తాగునీటి పరిస్థితులు తీవ్రంగా దిగజారుతున్నాయి. ప్రధాన వాణిజ్య పంట వేరుశనగ సాగు భారీగా తగ్గిపోగా, వరి సహా వర్షాధార పంటల సాగు కూడా గణనీయంగా పడిపోయింది. భూగర్భ జలాలు అడుగంటిపోతుండటంతో బోర్లపై ఆధారపడిన రైతులకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. మరోవైపు చెరువులు, కుంటలు ఎండిపోవడంతో పశువులకు మేత, తాగునీరు దొరకడం కష్టంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు ప్రారంభమవుతుండగా చిత్తూరు నగరంలోనూ నీటి ఎద్దడి తీవ్రతరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంతటి సంక్షోభం నెలకొన్నప్పటికీ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ప్రజాప్రతినిధులు సమష్టిగా ముందుకు రాకపోవడంపై రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో సాధారణ ఖరీఫ్‌ సాగు విస్తీర్ణం 44,267.4 హెక్టార్లు కాగా, ఆగస్టు 9 నాటికి కేవలం 9,443.59 హెక్టార్లలో మాత్రమే పంటలు సాగయ్యాయి. దీంతో సాధారణ సాగులో 21.33 శాతం మాత్రమే పూర్తయింది. గత ఏడాది ఇదే సమయానికి 18,425 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. ఈ ఏడాది వర్షాభావం కారణంగా సాగు విస్తీర్ణం భారీగా తగ్గింది. జిల్లాలో ప్రధాన వాణిజ్య పంటగా ఉన్న వేరుశనగ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. సాధారణంగా 21,902.8 హెక్టార్లలో వేరుశనగ సాగు కావాల్సి ఉండగా ఇప్పటివరకు 2,443 హెక్టార్లలో మాత్రమే సాగైంది. అంటే 11.15 శాతం మాత్రమే సాగు ప్రారంభమైంది. ఇంకా 19,459.8 హెక్టార్లలో వేరుశనగ సాగు కావాల్సి ఉంది. వర్షాలు లేకపోవడంతో చాలా ప్రాంతాల్లో రైతులు విత్తనాలు వేయలేకపోయారు. ఇప్పటికే వేసిన పంటలు కూడా భూమిలో తేమ లేక ఎండిపోయే పరిస్థితికి చేరుకున్నాయి. వరి సాగు కూడా తీవ్రంగా వెనుకబడింది. సాధారణంగా 9,067.6 హెక్టార్లలో వరి సాగు కావాల్సి ఉండగా 1,576.3 హెక్టార్లలోనే సాగైంది. సజ్జ 655.6 హెక్టార్లకు గాను 184 హెక్టార్లలో, మొక్కజొన్న 492 హెక్టార్లకు గాను 230.5 హెక్టార్లలో, రాగి 1,779 హెక్టార్లకు గాను 229.4 హెక్టార్లలో సాగయ్యాయి. పప్పుధాన్యాల సాగు పరిస్థితి కూడా ఆశించిన స్థాయిలో లేదు. ఈ నేపథ్యంలో వేరుశనగకు ప్రత్యామ్నాయంగా కందులు, ఉలవలు, మినుములు, సోయాబీన్‌ వంటి పంటలను సాగు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. రైతుల అవసరాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను అందించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే వర్షాలు కురవకపోతే ప్రత్యామ్నాయ పంటల సాగు కూడా ఎంతవరకు సాధ్యమవుతుందన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. నీటి వనరులు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో మాత్రం చెరకు సాగు కొంత ఊరటనిస్తోంది. జిల్లాలో సాధారణంగా 6,559.2 హెక్టార్లలో చెరకు సాగు కావాల్సి ఉండగా ఇప్పటికే 4,520.6 హెక్టార్లలో సాగైంది. దీంతో చెరకు సాగు 68.92 శాతానికి చేరింది. ఈ గణాంకాలు చూస్తే నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో సాగు కొంత మేర కొనసాగుతున్నప్పటికీ పూర్తిగా వర్షాధార వ్యవసాయంపై ఆధారపడిన ప్రాంతాల్లో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. వర్షాలు లేక భూగర్భ జలాలు కూడా వేగంగా అడుగంటుతున్నాయి. బోర్లు, బావుల్లో నీటిమట్టాలు తగ్గిపోవడంతో రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు వ్యవసాయ విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు, అల్పపీడనం రైతుల కష్టాలను మరింత పెంచుతున్నాయి. పగటిపూట నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా అందడం లేదని రైతులు చెబుతున్నారు. లోఓల్టేజీ, తరచూ విద్యుత్‌ అంతరాయాల కారణంగా బోర్లు, మోటార్లు సక్రమంగా పనిచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు నీరు లేక పంటలు ఎండిపోతుండగా, మరోవైపు ఉన్న కొద్దిపాటి నీటిని తోడుకునేందుకు కూడా విద్యుత్‌ అందుబాటులో లేకపోవడం తమ పరిస్థితిని మరింత దయనీయంగా మారుస్తోందని రైతులు అంటున్నారు. వర్షాభావం ప్రభావం పశుపోషణపైనా పడింది. జిల్లాలో పచ్చదనం దాదాపు కనుమరుగవడంతో పశువులకు మేత దొరకడం కష్టంగా మారింది. చెరువులు, కుంటలు ఎండిపోతుండటంతో పశువులకు తాగునీటి సమస్య కూడా ఎదురవుతోంది. వ్యవసాయంతోపాటు పశుపోషణపై ఆధారపడే కుటుంబాలకు ఇది మరో పెద్ద సమస్యగా మారింది. వర్షాలు మరికొంత కాలం కురవకపోతే పశువులకు మేత, నీటి కోసం రైతులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. తాగునీటి పరిస్థితి కూడా క్రమంగా ఆందోళనకరంగా మారుతోంది. చిత్తూరు పట్టణానికి కల్వకుంట నుంచి అందుతున్న నీరు నెలరోజులకే పరిమితమయ్యే పరిస్థితి నెలకొనడంతో ఆ తర్వాత నగరంలో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ బోర్లు, చెరువులు, కుంటలపై ఆధారపడే పరిస్థితి ఉండటంతో ఇప్పటి నుంచే తాగునీటి సమస్యలు ప్రారంభమవుతున్నాయి. ముందస్తు చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో వ్యవసాయంతోపాటు ప్రజల తాగునీటి అవసరాలు కూడా పెద్ద సవాల్‌గా మారే ప్రమాదం ఉంది. ఇదిలా ఉండగా ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో నెలకొన్న పరిస్థితులను తిరుపతి వ్యవసాయ ప్రాంతీయ పరిశోధనాస్థానానికి చెందిన శాస్త్రవేత్తల బృందం క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తోంది. ఈ నెల 3వ తేదీ నుంచి సుమారు 8 మంది శాస్త్రవేత్తలు, విద్యార్థులు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ వర్షపాతం, భూమిలో తేమ, పంటల పరిస్థితి, నీటి లభ్యత, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలిస్తున్నారు. వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక శాఖల అధికారులతో కలిసి రైతులతో నేరుగా మాట్లాడుతున్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి చేపట్టిన రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పర్యటిస్తూ రైతుల సమస్యలను నమోదు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా అధ్యయనం పూర్తయిన తర్వాత సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నారు. అయితే శాస్త్రవేత్తలు, అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేస్తున్నప్పటికీ ప్రజాప్రతినిధులు మాత్రం కరువు సమస్యపై తగిన స్థాయిలో స్పందించడం లేదని రైతులు మండిపడుతున్నారు. ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో జిల్లాలో నెలకొన్న వర్షాభావం, పంటల నష్టం, భూగర్భ జలాల పరిస్థితి, తాగునీటి సమస్య, పశువుల మేత సమస్యలను బలంగా ప్రస్తావించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఆ దిశగా సమష్టి ప్రయత్నం కనిపించలేదని వారు పేర్కొంటున్నారు. జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఇప్పటివరకు ఏకగ్రీవమైన రాజకీయ డిమాండ్‌ ముందుకు రాకపోవడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లా పరిషత్‌ సమావేశంలో కరువు పరిస్థితులపై సమగ్రంగా చర్చించి జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి తీర్మానం చేసి పంపే అవకాశం ఉన్నప్పటికీ ఆ దిశగా చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని రైతులు కోరుతున్నారు. జిల్లా పరిషత్‌ సమావేశానికి ఇద్దరు శాసనసభ్యులు మాత్రమే హాజరయ్యారని, మిగిలిన శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, శాసనమండలి సభ్యులు హాజరు కాలేదని రైతులు గుర్తుచేస్తున్నారు. స్థాయి సంఘ సమావేశాలకు కూడా ఒక్క ఎమ్మెల్యే హాజరు కాకపోవడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలలకు ఒకసారి జరగాల్సిన జిల్లా సమీక్ష మండలి సమావేశం కూడా సకాలంలో జరగడం లేదని, ఆరు నెలలు గడిచినా సమావేశం నిర్వహించకపోవడం వల్ల జిల్లాలోని కీలక సమస్యలు చర్చకు రావడం లేదని రైతులు అంటున్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుని సమావేశాన్ని నిర్వహించి కరువు పరిస్థితులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నారు. జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని, పంట నష్టాన్ని తక్షణమే అంచనా వేసి రైతులకు పరిహారం అందించాలని, పంటల సాగుకు అవసరమైన ప్రత్యామ్నాయ విత్తనాలను ఉచితంగా లేదా రాయితీపై అందించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. పంట బీమా పరిధిలో నష్టపోయిన రైతులకు త్వరితగతిన పరిహారం అందించాలని, రుణాలపై ఉపశమనం కల్పించాలని కోరుతున్నారు. వ్యవసాయానికి పగటిపూట నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని, లోఓల్టేజీ, అంతరాయాలను నివారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎండిపోతున్న చెరువులు, కుంటలను పునరుద్ధరించి పశువులకు తాగునీరు, మేత అందించాలని, గ్రామీణ ప్రాంతాల్లో ముందస్తు తాగునీటి ప్రణాళిక రూపొందించాలని కోరుతున్నారు. ఉపాధి కోల్పోతున్న వ్యవసాయ కుటుంబాలకు గ్రామీణ ఉపాధి అవకాశాలను పెంచాలని కూడా డిమాండ్‌ చేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావం, వరుస వర్షాభావం, పడిపోతున్న భూగర్భ జలాలు, తగ్గుతున్న సాగు విస్తీర్ణం, పంటల నష్టం, పశువులకు మేత, నీటి కొరత, తాగునీటి సమస్యలు ఒక్కొక్కటిగా తీవ్రమవుతున్న నేపథ్యంలో పరిస్థితిని సాధారణ వర్షాభావంగా కాకుండా కరువు సంక్షోభంగా పరిగణించి తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని రైతులు చెబుతున్నారు. శాస్త్రవేత్తల నివేదిక కోసం ఎదురుచూడటంతోపాటు ప్రజాప్రతినిధులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని, జిల్లా పరిషత్‌, స్థాయి సంఘాలు, జిల్లా సమీక్ష మండలి సమావేశాలను వెంటనే నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతున్నారు. రైతులు కష్టాల్లో ఉన్న సమయంలో వారి తరఫున గళమెత్తి, జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే ప్రజాప్రతినిధుల తక్షణ బాధ్యతగా రైతులు పేర్కొంటున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *