11, ఆగస్టు 2026, మంగళవారం

స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రజలలో వ్యతిరేకత తగ్గించడానికి చర్యలు



స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రజలలో వ్యతిరేకత తగ్గించడానికి చర్యలు 

సంక్షేమ పథకాల నుంచి ఆసుపత్రులు, రేషన్, రెవెన్యూ, పారిశుధ్యంపై ప్రజల్లో వ్యతిరేకత

రేషన్, గ్యాస్ సరఫరా, పంచాయతీ సేవలు, తాగునీరు, రవాణా తదితర శాఖల్లో కూడా

ఫిర్యాదులకు ముందే పరిష్కారం.. ప్రజల సంతృప్తే ప్రభుత్వ లక్ష్యం

ఐవిఆర్ఎస్ ద్వారా ప్రజల అభిప్రాయ సేకరణ ... వ్యతిరేకత నివారణ చర్యలకు శ్రీకారం

జిల్లాస్థాయిలో నోడల్ అధికారి నియామకం 

వారానికి ఒకసారి జిల్లా కలెక్టర్ సమీక్ష

(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ శాఖల సేవలపై ప్రజల్లో ఏర్పడుతున్న వ్యతిరేకతను తగ్గించి, ప్రభుత్వంపై సానుకూల విశ్వాసాన్ని పెంచేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ ఆసుపత్రులు, రేషన్‌, గ్యాస్‌ సరఫరా, రెవెన్యూ, పంచాయతీ సేవలు, పారిశుధ్యం, తాగునీరు, రవాణా తదితర రంగాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించేందుకు చర్యలు చేపడుతోంది. ప్రజలు ఫిర్యాదు చేసిన తర్వాత స్పందించడం కంటే సమస్య ఉత్పన్నం కాకముందే లోపాలను గుర్తించి సేవలను మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఐవీఆర్‌ఎస్‌ విధానాన్ని విస్తృతంగా వినియోగించనున్నారు. వివిధ శాఖల సేవలపై ప్రజల నుంచి వచ్చే ప్రతికూల స్పందనను విశ్లేషించి, సమస్యాత్మక ప్రాంతాలు, శాఖలను గుర్తించనున్నారు. అనంతరం సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలకు పరిష్కారం చూపాల్సి ఉంటుంది. ఇందుకోసం కలెక్టరేట్‌లో ప్రత్యేక జిల్లా స్థాయి పర్యవేక్షణ విభాగాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయిలో ఒక నోడల్‌ అధికారిని నియమించి శాఖల వారీగా చర్యలను పర్యవేక్షించనున్నారు. జిల్లా కలెక్టర్‌ వారానికి ఒకసారి అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రజా సేవల పరిస్థితిని పరిశీలించనున్నారు.

గృహ నిర్మాణ పథకంలో లబ్ధిదారులకు దశలవారీగా చెల్లింపులు అందుతున్నప్పటికీ ఉపాధి హామీ పథకం బకాయిలు, ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉండటం వంటి కారణాలతో కొందరు ప్రతికూల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి సమస్యలను పరిష్కరించడంతో పాటు పథకాల అమలుపై పూర్తి అవగాహన కల్పించాలని నిర్ణయించారు. సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల ఆరోగ్యం, సంతృప్తిని పెంచేందుకు ఆర్వో నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయడం, ప్రతి నెలా తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించడం, విద్యా ప్రమాణాలు, క్రమశిక్షణ, పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని నిర్ణయించారు. రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖలో ఫీజుల విషయంలో ప్రజలకు స్పష్టత ఉండేలా ప్రతి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజులు, అమ్మకం, బహుమతి, సెటిల్‌మెంట్‌, ఎన్‌కంబరెన్స్‌ ధ్రువపత్రాలు, ధ్రువీకృత ప్రతుల ఫీజుల వివరాలతో పట్టికలు ఏర్పాటు చేయనున్నారు. కార్యాలయాల్లో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన సమాచారాన్ని అందించనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది హాజరు, రోగులతో వ్యవహరించే తీరుపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టనున్నారు. రాత్రివేళ ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంతో పాటు వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. తక్షణ ఫలితాలు అందించే నిర్ధారణ పరీక్షల సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు ఉచిత మందుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రోగి సంరక్షణ సమన్వయకర్తలు, ప్రయోగశాల సాంకేతిక నిపుణులు, ఫార్మసిస్టులు రోగులతో మర్యాదగా వ్యవహరించేలా సూచనలు ఇచ్చారు. ఆసుపత్రుల్లో పారిశుధ్యానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికుల సౌకర్యాలపై కూడా దృష్టి సారించారు. చిత్తూరు బస్టాండ్లలో మూడు సీట్ల కుర్చీలు, ఫ్యాన్లు, ఆర్వో శుద్ధి చేసిన తాగునీటి కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరుగుదొడ్లు, ప్లాట్‌ఫారాలను తరచూ శుభ్రం చేయడంతో పాటు తడి, పొడి చెత్తకు ప్రత్యేక డబ్బాలు ఏర్పాటు చేశారు. రవాణా శాఖలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను స్వయంచాలకంగా మార్చి వాహన్‌ వ్యవస్థ ద్వారా 24 గంటల్లో రిజిస్ట్రేషన్‌ పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు. పన్నుల చెల్లింపు, అనుమతులు, వాహన సామర్థ్య ధ్రువపత్రాలు తదితర సేవలను ఆన్‌లైన్‌ విధానంలో అందిస్తున్నారు.

మహిళా, శిశు సంక్షేమ శాఖలో అంగన్‌వాడీ కేంద్రాలకు పోషకాహార సరుకులు ప్రతి నెల 20వ తేదీలోపు చేరేలా పర్యవేక్షించనున్నారు. తల్లిదండ్రులకు అంగన్‌వాడీల్లో తాగునీరు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలపై అవగాహన కల్పించనున్నారు. ఐవీఆర్‌ఎస్‌లో ప్రతికూల స్పందన వచ్చిన కేంద్రాలను పర్యవేక్షకులు స్వయంగా సందర్శించి కారణాలను తెలుసుకుని పరిష్కరించనున్నారు. సామాజిక సంక్షేమ శాఖలో సిబ్బంది బయోమెట్రిక్‌ హాజరును పర్యవేక్షించడంతో పాటు అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నారు. దీపం పథకంలో గ్యాస్‌ వినియోగదారుల నుంచి అదనపు మొత్తాల వసూళ్లపై వచ్చే ప్రతికూల స్పందనను తగ్గించేందుకు గ్యాస్‌ బుకింగ్‌ సమయంలో డిజిటల్‌, యూపీఐ ద్వారా రీఫిల్‌ చార్జీ చెల్లించే విధానంపై ప్రచారం చేపట్టారు. సరిహద్దు మండలాల్లో భాష సమస్యను పరిష్కరించేందుకు క్షేత్రస్థాయి సిబ్బంది, డెలివరీ సిబ్బందికి ప్రత్యేక సూచనలు ఇచ్చారు. గ్యాస్‌ డీలర్ల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడబోమని హామీ పత్రాలు తీసుకోవడంతో పాటు పేలవమైన పనితీరు కనబరిచే వారికి షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తున్నారు. రేషన్‌ పంపిణీలో వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు పెద్ద సంఖ్యలో కార్డుదారుల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. రెవెన్యూ శాఖలో ఆర్ఓఆర్‌, ఎఫ్‌లైన్‌, రీసర్వే అంశాలపై ప్రతికూల అభిప్రాయాన్ని తగ్గించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ సర్వేయర్లకు క్షేత్రస్థాయి శిక్షణ ఇచ్చారు. ఆర్డీవోలు, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. దరఖాస్తుదారులకు యాదృచ్ఛికంగా ఫోన్‌ చేసి సమస్య పరిష్కార స్థితిని తెలుసుకుంటున్నారు. సేవలు నిర్ణీత గడువులో అందుతున్నాయో లేదో పర్యవేక్షించేందుకు నియంత్రణ గదిని ఏర్పాటు చేశారు.

పంచాయతీరాజ్‌ శాఖలో రోజువారీ చెత్త సేకరణ, వీధిదీపాల నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు స్వయం సహాయక సంఘాల సభ్యులను భాగస్వామ్యం చేయనున్నారు. గ్రామసభలు, వీడియో ప్రచారం నిర్వహించడంతో పాటు వీధిదీపాల సమస్యలను ప్రజలు నేరుగా తెలియజేసేందుకు విద్యుత్‌ స్తంభాలకు క్యూఆర్‌ కోడ్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పురపాలక శాఖలో అన్న క్యాంటీన్ల పారిశుధ్యం, సిబ్బంది సేవలను మెరుగుపరచడంతో పాటు పనిచేయని ఎల్‌ఈడీ వీధిదీపాలు, దెబ్బతిన్న స్తంభాలు, కేబుళ్లు, విద్యుత్‌ కనెక్షన్లను ప్రత్యేక కార్యక్రమాల ద్వారా మార్చనున్నారు. ఇంటింటి చెత్త సేకరణను జీపీఎస్‌ పర్యవేక్షణతో బలోపేతం చేయడం, అదనపు వాహనాలు, సిబ్బందిని సిద్ధంగా ఉంచడం, చెత్తను అక్రమంగా వేసే ప్రాంతాలపై నిఘా పెట్టడం, తాగునీటి సరఫరా నిరంతరాయంగా ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ఇలా శాఖల వారీగా ప్రజల్లో ఏర్పడుతున్న ప్రతికూల అభిప్రాయానికి కారణాలను గుర్తించి, సేవల నాణ్యతను మెరుగుపరచడం, క్షేత్రస్థాయి పర్యవేక్షణ పెంచడం, ప్రజలకు అవగాహన కల్పించడం, ఫిర్యాదుల పరిష్కారాన్ని నిరంతరం అనుసరించడం ద్వారా ప్రజల సంతృప్తిని పెంచేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *