15, ఆగస్టు 2026, శనివారం

వాడవాడలా మువ్వన్నెల రెపరెపలు

వాడవాడలా మువ్వన్నెల రెపరెపలు
దేశభక్తితో పులకించిన చిత్తూరు జిల్లా
మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన చైర్మన్లు


చిత్తూరు, ఆగస్టు 15 (ఆంధ్రప్రభ బ్యూరో) : ఎక్కడ చూసినా మువ్వన్నెల రెపరెపలు.. జాతీయ గీతాలాపన.. దేశభక్తి నినాదాలు.. విద్యార్థుల నృత్యాలు.. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల స్మరణ.. ఇదీ 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం చిత్తూరు జిల్లాలో కనిపించిన దృశ్యం. పట్టణం, పల్లె అన్న తేడా లేకుండా వాడవాడలా జాతీయ పతాకాలు రెపరెపలాడాయి. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు, విద్యాసంస్థలు, బ్యాంకులు, స్థానిక సంస్థల కార్యాలయాలు ఇలా అన్ని చోట్లా జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు. దీంతో జిల్లావ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ సందడి నెలకొంది.

జిల్లా కేంద్రంలో పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌ వేదికగా నిర్వహించిన ప్రధాన వేడుకలకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. క్రమశిక్షణతో సాగిన పోలీసు కవాతు, శకటాల ప్రదర్శన, డాగ్‌ షో, విద్యార్థుల దేశభక్తి సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించేలా వివిధ శాఖలు ఏర్పాటు చేసిన శకటాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లాలోని పాఠశాలలు ప్రత్యేక అలంకరణలతో కళకళలాడాయి. విద్యార్థులు జాతీయ జెండా రంగుల దుస్తుల్లో సందడి చేశారు. దేశభక్తి గీతాలు ఆలపించడంతో పాటు దేశభక్తి గీతాలకు నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. జాతీయ సమైక్యత, దేశభక్తి, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతిబింబించేలా విద్యార్థులు నిర్వహించిన కార్యక్రమాలు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజలను ఆకట్టుకున్నాయి. పాఠశాలల ప్రాంగణాల్లో జాతీయ పతాకావిష్కరణ అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు.

చిత్తూరు జిల్లా పరిషత్‌ కార్యాలయంలో చైర్మన్‌ జి. శ్రీనివాసులు (వాసు) మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ సీఈఓ రవికుమార్‌ నాయుడు, సిబ్బంది పాల్గొన్నారు. స్వాతంత్ర్య ఫలాలు అందరికీ అందాలంటే మండల పరిషత్‌ అధికారులు, సిబ్బంది కష్టపడి పనిచేయాలని శ్రీనివాసులు పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్య, పోషకాహారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అనంతరం సిబ్బందికి మిఠాయిలు పంచిపెట్టారు.

జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఆవరణంలో చైర్మన్‌ అమాస రాజశేఖర్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. బ్యాంకు సీఈఓ శంకర్‌బాబు, డీసీఓ లక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు. రైతులు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రాజశేఖర్‌రెడ్డి అన్నారు. అర్హులైన రైతులందరికీ విరివిగా రుణాలు అందించాలని, రుణాల మంజూరులో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా చూడాలని సూచించారు. రుణాల రికవరీపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు.

పాత జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలోని చుడా కార్యాలయ ఆవరణలో చుడా చైర్‌పర్సన్‌ కటారి హేమలత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా అభివృద్ధికి చుడా అధికారులు, సిబ్బంది తమవంతు కృషి చేయాలని ఆమె సూచించారు. అనంతరం చిన్నారులకు మిఠాయిలు పంపిణీ చేశారు.

ఉమ్మడి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ రెడ్డివారి గురువారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్ర్యం ఎందరో మహానుభావుల త్యాగఫలమని, బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా పోరాడి సాధించుకున్న స్వాతంత్ర్యానికి 80 ఏళ్లు పూర్తయ్యాయని ఆయన అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. సంపద సృష్టించి ఆ సంపదను పేద ప్రజల సంక్షేమానికి వినియోగించే విధంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. అమరావతి రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేయడంతో పాటు పోలవరం నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తున్నారని తెలిపారు. సూపర్‌ సిక్స్‌ హామీలను జవాబుదారీతనంతో అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థులతో కలిసి మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

కలెక్టరేట్‌లో జాయింట్‌ కలెక్టర్‌ ఆదర్శ రాజేంద్రన్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. నాటి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగఫలమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యమని ఆయన అన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన మహానుభావుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, వారి దేశభక్తిని ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, జిల్లా రెవెన్యూ అధికారి మోహన్‌కుమార్‌, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్‌ సిబ్బంది పాల్గొన్నారు.


జిల్లా కేంద్రంలోనే కాకుండా మండల కేంద్రాలు, గ్రామాల్లోనూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రైవేటు కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు స్వాతంత్ర్య వేడుకల్లో భాగస్వాములయ్యాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు. అనేక ప్రాంతాల్లో దేశభక్తి గీతాలు మార్మోగాయి. మొత్తంగా చిత్తూరు జిల్లాలో 80వ స్వాతంత్ర్య దినోత్సవం ప్రజల భాగస్వామ్యంతో పండుగలా మారింది. మువ్వన్నెల జెండా రెపరెపల మధ్య పాఠశాలల చిన్నారుల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, సాధారణ ప్రజల వరకు ప్రతి ఒక్కరూ తమదైన రీతిలో దేశభక్తిని చాటుకున్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించాలనే సంకల్పంతో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జిల్లావ్యాప్తంగా ఉత్సాహభరితంగా ముగిశాయి.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *