28, ఆగస్టు 2026, శుక్రవారం

చిత్తూరు కార్పొరేషన్ కు ఎన్నికలు జరిగేనా?


చిత్తూరు కార్పొరేషన్ కు ఎన్నికలు జరిగేనా?

వార్డుల సంఖ్య పెంచాలని ఎమ్మెల్యే ప్రభుత్వానికి లేఖ

అశాస్త్రీయంగా వార్డుల విభజన జరిగిందని కోర్టుకెక్కిన వైసిపి

పూర్వ స్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు

(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)

చిత్తూరు కార్పొరేషన్‌కు ఎన్నికల ముహూర్తం ఎప్పుడన్నది ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. ఒకవైపు వార్డుల విభజనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ న్యాయపోరాటం చేస్తుండగా.. మరోవైపు అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడు సైతం ప్రస్తుత వార్డుల సంఖ్యపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇప్పటికే 50 వార్డులుగా ఉన్న చిత్తూరు మున్సిపాలిటీని 60 వార్డులకు పెంచుతూ విభజన ప్రక్రియ పూర్తయి నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ.. ఇప్పుడు మరో మూడు వార్డులు పెంచి మొత్తం 63 వార్డులు చేయాలన్న ప్రతిపాదన తెరపైకి రావడంతో ఎన్నికల నిర్వహణపై కొత్త సందేహాలు నెలకొన్నాయి.

చిత్తూరు మున్సిపాలిటీలో గతంలో 50 వార్డులు ఉండేవి. జనాభా పెరుగుదల, పట్టణ విస్తరణ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం వార్డుల సంఖ్యను 60కి పెంచింది. ఇందుకు అనుగుణంగా మున్సిపల్ అధికారులు వార్డుల పునర్విభజనపై విస్తృత కసరత్తు చేపట్టారు. ప్రతిపాదిత వార్డుల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచడంతో పాటు మున్సిపాలిటీ నోటీసు బోర్డుల్లో ప్రదర్శించి, ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించారు. పెద్దగా అభ్యంతరాలు రాకపోవడంతో 60 వార్డుల విభజనను ఖరారు చేసి ప్రభుత్వానికి నివేదించారు. అనంతరం వార్డుల విభజనకు నోటిఫికేషన్ కూడా వెలువడింది. అయితే కథ అక్కడితో ముగియలేదు. వార్డుల విభజనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శాస్త్రీయ ప్రాతిపదికన వార్డులను విభజించలేదని, అధికార పార్టీకి రాజకీయంగా అనుకూలించేలా విభజన జరిగిందని వారు ఆరోపించారు. జనాభా ప్రాతిపదిక, భౌగోళిక పరిస్థితులు, ఓటర్ల సంఖ్య వంటి అంశాలను సమగ్రంగా పరిగణనలోకి తీసుకోకుండా విభజన చేశారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. చిత్తూరు కార్పొరేషన్‌కు సంబంధించిన వార్డుల విభజన అంశంతో పాటు రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లో ఇదే తరహా అభ్యంతరాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోర్టులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఈ కేసులపై విచారణ చేపట్టిన హైకోర్టు పూర్వ స్థితిని కొనసాగించాలని ఆదేశాలు జారీ చేయడంతో వార్డుల విభజన వ్యవహారం న్యాయపరమైన చిక్కుల్లో పడింది. చిత్తూరుతో పాటు ఇతర మున్సిపాలిటీలకు సంబంధించిన కేసులు కూడా పరిష్కారం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కేసులపై తుది స్పష్టత వచ్చే వరకు ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో చిత్తూరు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి విజయానంద రెడ్డి వార్డుల విభజనపై తీవ్రంగా స్పందించారు. వార్డుల పునర్విభజన అశాస్త్రీయంగా జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భారీగా దొంగ ఓట్లు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత తాజా జనాభాను పరిగణనలోకి తీసుకుని వార్డుల సంఖ్య, రిజర్వేషన్లను ఖరారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అప్పటి వరకు మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమ పార్టీ సిద్ధంగా ఉందని, ఈసారి కూడా చిత్తూరు కార్పొరేషన్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

మరోవైపు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడు సైతం వార్డుల సంఖ్య విషయంలో తన అభిప్రాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. తాజా జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే చిత్తూరు కార్పొరేషన్‌లో మరో మూడు వార్డులు పెంచాల్సిన అవసరం ఉందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఉన్న 60 వార్డుల స్థానంలో 63 వార్డులు ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే ఎమ్మెల్యే రాసిన లేఖపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత జనాభా తదితర అంశాలను పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. ఇలా చిత్తూరు కార్పొరేషన్‌లో వార్డుల వ్యవహారం అధికార, ప్రతిపక్ష పార్టీలకు ఒకేలా చిక్కుముడిగా మారింది. వైసీపీ నాయకులు ప్రస్తుత విభజనను వ్యతిరేకిస్తూ కోర్టు మెట్లెక్కితే.. అధికార టీడీపీ ఎమ్మెల్యే మాత్రం వార్డుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వానికి లేఖ రాయడం విశేషంగా మారింది. దీంతో వార్డుల విభజనపై రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం ఎన్నికల ప్రక్రియకు మరింత జాప్యం కలిగించే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుతం చిత్తూరు కార్పొరేషన్‌లో ఎన్నికలకు సంబంధించి మూడు కీలక అంశాలు తెరపై ఉన్నాయి. 60 వార్డులుగా జరిగిన ప్రస్తుత విభజన కొనసాగుతుందా? ఎమ్మెల్యే కోరినట్లు వార్డుల సంఖ్యను 63కి పెంచుతారా? వైసీపీ దాఖలు చేసిన కేసులపై హైకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుంది? అన్నదానిపైనే ఎన్నికల భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఈ మూడు అంశాల్లో స్పష్టత వచ్చిన తర్వాతే ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకునే అవకాశం ఉంది. 

గతంలో మున్సిపాలిటీగా ఉన్న చిత్తూరు.. కార్పొరేషన్‌గా మారిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి మరింత పెరిగింది. అధికార, ప్రతిపక్ష పార్టీలకు ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ప్రతి వార్డు కీలకంగా మారే పరిస్థితుల్లో వార్డుల సరిహద్దులు, జనాభా, ఓటర్ల సంఖ్య, రిజర్వేషన్లు వంటి అంశాలు రాజకీయ పార్టీల వ్యూహాలను ప్రభావితం చేయనున్నాయి. దీంతో ఎన్నికల కంటే ముందే వార్డుల విభజన వ్యవహారం రాజకీయ వేడిని పెంచుతోంది. ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తే చిత్తూరు కార్పొరేషన్ ఎన్నికలకు ఇంకా పలు అడ్డంకులు తొలగాల్సి ఉంది. కోర్టు కేసులకు పరిష్కారం లభించడం, వార్డుల విభజనపై స్పష్టత రావడం, ఎమ్మెల్యే ప్రతిపాదనపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, ఓటర్ల జాబితా తదితర ప్రక్రియలు పూర్తయిన తర్వాతే ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం కానుంది. 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *