13, ఆగస్టు 2026, గురువారం

జిల్లాలో ఎల్‌నినో పరిస్థితులను అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు



 జిల్లాలో ఎల్‌నినో పరిస్థితులను అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు

 3వ తేదీ నుంచి శాస్త్రవేత్తల క్షేత్రస్థాయి అధ్యయనం

 వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక శాఖల అధికారులతో కలిసి 

 జిల్లావ్యాప్తంగా పర్యటించి సమగ్ర నివేదిక.. ప్రభుత్వానికి అందజేత

 వర్షాభావంతో ఖరీఫ్‌ సాగు 21.33 శాతానికే పరిమితం

 ప్రధాన వాణిజ్య పంట వేరుశనగ సాగు 11.15 శాతానికే పరిమితం

(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)

ఎల్‌నినో ప్రభావంతో చిత్తూరు జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, వాటి ప్రభావంతో పంటల సాగు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తిరుపతి వ్యవసాయ ప్రాంతీయ పరిశోధనాస్థానానికి చెందిన శాస్త్రవేత్తల బృందం క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తోంది. ఈ నెల 3వ తేదీ నుంచి శాస్త్రవేత్తల బృందం జిల్లాలోని వివిధ మండలాల్లో పర్యటిస్తూ వాతావరణ పరిస్థితులు, వర్షపాతం, భూమిలో తేమ, పంటల సాగు, ఇప్పటికే సాగు చేసిన పంటల పరిస్థితిని పరిశీలిస్తోంది. సుమారు 8 మంది శాస్త్రవేత్తలతో పాటు విద్యార్థులు కూడా ఈ పర్యటనలో పాల్గొంటూ రైతులతో నేరుగా మాట్లాడి ఎల్‌నినో కారణంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంటున్నారు. జిల్లాలోని అన్ని మండలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం పరిస్థితులపై సమగ్ర నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందజేయనున్నారు.

శాస్త్రవేత్తలతో పాటు వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక శాఖల అధికారులు కూడా రైతుల వద్దకు వెళ్లి పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభమైన రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా గ్రామ గ్రామాన పర్యటిస్తూ రైతులతో నేరుగా మాట్లాడుతున్నారు. వర్షాభావం కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులు, పంటల పరిస్థితి, నీటి లభ్యత, రైతులకు అవసరమైన విత్తనాలు తదితర వివరాలను సేకరిస్తున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఏ పంటలు సాగు చేయాలి, ఇప్పటికే వేసిన పంటలను ఎలా కాపాడుకోవాలి, ప్రత్యామ్నాయ పంటలు ఏవి అనువుగా ఉంటాయన్న దానిపై రైతులకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. జిల్లాలో వర్షపాతం లోటు తీవ్రంగా ఉండటంతో ఖరీఫ్‌ సాగు కూడా గణనీయంగా వెనుకబడింది. జూన్‌ నెలలో సాధారణంగా 79.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 70.75 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. జూలైలో 102.3 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికి గాను కేవలం 17.2 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. ఆగస్టులో 123.3 మిల్లీమీటర్ల వర్షపాతం సాధారణంగా నమోదు కావాల్సి ఉండగా ఇప్పటివరకు 23 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. వరుసగా వర్షాలు తగ్గిపోవడంతో భూమిలో తేమ లేక వర్షాధార పంటల సాగు తీవ్రంగా దెబ్బతింది. ఇప్పటికే వేసిన కొన్ని పంటలు కూడా నీటి కొరతతో ఎండిపోతున్నాయి. జిల్లాలో సాధారణ ఖరీఫ్‌ సాగు విస్తీర్ణం 44,267.4 హెక్టార్లు కాగా, ఆగస్టు 9 నాటికి 9,443.59 హెక్టార్లలో మాత్రమే పంటలు సాగయ్యాయి. దీంతో సాధారణ సాగులో 21.33 శాతం మాత్రమే పూర్తయింది. గత ఏడాది ఇదే సమయానికి 18,425 హెక్టార్లలో పంటలు సాగవగా, ఈ ఏడాది సాగు విస్తీర్ణం భారీగా తగ్గింది. ప్రధాన వాణిజ్య పంట అయిన వేరుశనగ పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. సాధారణంగా 21,902.8 హెక్టార్లలో వేరుశనగ సాగు కావాల్సి ఉండగా ఇప్పటివరకు 2,443 హెక్టార్లలో మాత్రమే సాగైంది. అంటే 11.15 శాతం మాత్రమే సాగు ప్రారంభమైంది. ఇంకా 19,459.8 హెక్టార్లలో వేరుశనగ సాగు కావాల్సి ఉంది. వర్షాలు లేకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో విత్తనాలు వేయలేకపోగా, ఇప్పటికే వేసిన పంటలు కూడా ఎండిపోయే పరిస్థితి నెలకొంది. వరి సాగు కూడా వెనుకబడింది. సాధారణంగా 9,067.6 హెక్టార్లలో వరి సాగు కావాల్సి ఉండగా 1,576.3 హెక్టార్లలో మాత్రమే సాగైంది. సజ్జ 655.6 హెక్టార్లకు గాను 184 హెక్టార్లలో, మొక్కజొన్న 492 హెక్టార్లకు గాను 230.5 హెక్టార్లలో, రాగి 1,779 హెక్టార్లకు గాను 229.4 హెక్టార్లలో సాగయ్యాయి. మొక్కజొన్న 46.85 శాతంతో కొంత ముందంజలో ఉంది. పప్పుధాన్యాల పరిస్థితి కూడా ఆశించిన స్థాయిలో లేదు. ఎర్రకందులు 1,494.8 హెక్టార్లకు గాను 103.7 హెక్టార్లలో, పెసలు 63.2 హెక్టార్లకు గాను 4 హెక్టార్లలో, మినుములు 67.8 హెక్టార్లకు గాను 7.04 హెక్టార్లలో, ఉలవలు 1,385.2 హెక్టార్లకు గాను కేవలం 1.4 హెక్టార్లలోనే సాగయ్యాయి. వేరుశనగ సాగు తగ్గిపోవడంతో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అధికారులు దృష్టి సారించారు. సోయాబీన్‌ సాగుకు సుమారు 1,000 హెక్టార్లకు సరిపడా విత్తనాలను సిద్ధం చేయగా ఇప్పటివరకు 95 హెక్టార్లలో సాగైంది. ప్రత్యామ్నాయ వ్యవసాయ ప్రణాళిక కింద 375 క్వింటాళ్ల కందులు, 3,845 క్వింటాళ్ల ఉలవలు, 120 క్వింటాళ్ల మినుముల విత్తనాలను రైతులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. రైతుల అవసరాలను గ్రామాల వారీగా తెలుసుకుని అందుకు అనుగుణంగా విత్తనాలు, సాంకేతిక సూచనలు అందించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇదిలా ఉండగా నీటి వనరులు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో చెరకు సాగు మాత్రం ముందంజలో ఉంది. జిల్లాలో సాధారణంగా 6,559.2 హెక్టార్లలో చెరకు సాగు కావాల్సి ఉండగా ఇప్పటికే 4,520.6 హెక్టార్లలో సాగైంది. దీంతో చెరకు సాగు 68.92 శాతానికి చేరింది. అయితే వర్షాధార పంటల పరిస్థితి మాత్రం ఆందోళనకరంగానే ఉంది. ఎల్‌నినో ప్రభావంపై శాస్త్రవేత్తల బృందం జిల్లావ్యాప్తంగా చేపడుతున్న క్షేత్రస్థాయి అధ్యయనం, రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా వివిధ శాఖల అధికారులు సేకరిస్తున్న వివరాల ఆధారంగా రూపొందించే సమగ్ర నివేదికపై ఇప్పుడు రైతుల్లో ఆశలు నెలకొన్నాయి. వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు అవసరమైన చర్యలు, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక, రైతులకు అవసరమైన విత్తనాలు, సాంకేతిక సహాయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునేందుకు ఈ నివేదిక కీలకం కానుంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *