16, ఆగస్టు 2026, ఆదివారం

విద్యా శాఖలో తాత్కాలిక ఉపాధ్యాయులు

విద్యా శాఖలో తాత్కాలిక ఉపాధ్యాయులు !

 చిత్తూరు జిల్లాలో 249 అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ 

156 ఎస్‌జీటీలు.. 93 స్కూల్‌ అసిస్టెంట్లు

 8 నెలలపాటు తాత్కాలిక నియామకం.. సెప్టెంబరు 1 నుంచి విధుల్లోకి

టెట్‌ అర్హులకు ప్రాధాన్యం.. స్థానిక అభ్యర్థులకు తొలి అవకాశం

 ఉపాధ్యాయుల కొరతను అధిగమించి విద్యార్థులకు నిరంతర బోధనే లక్ష్యం

( చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ )

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థుల చదువుకు అంతరాయం కలగకుండా ప్రభుత్వం తాత్కాలికంగా అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లను నిర్మించార అది నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. 2026–27 విద్యా సంవత్సరంలో చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్‌, మున్సిపల్‌, మున్సిపల్‌ కార్పొరేషన్‌ పాఠశాలల్లో 249 మంది అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లను నియమించనున్నారు. వీరిలో 156 మంది ఎస్‌జీటీలు, 93 మంది స్కూల్‌ అసిస్టెంట్లు ఉంటారు. ఈ నియామకాలు 2026 సెప్టెంబరు 1 నుంచి 2027 ఏప్రిల్‌ 30 వరకు 8 నెలలపాటు కొనసాగనున్నాయి.


ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉంటే ఒకవైపు అందుబాటులో ఉన్న ఉపాధ్యాయులపై అదనపు బోధనా భారం పడుతుంది. మరోవైపు కొన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులకు బోధనలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో శాశ్వత నియామకాలు జరిగేంతవరకు విద్యా సంవత్సరం సజావుగా కొనసాగించేందుకు అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లను తాత్కాలికంగా నియమిస్తున్నారు. ఈ నియామకాల ద్వారా ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలలకు అదనపు బోధనా సిబ్బంది అందుబాటులోకి వస్తారు. ఫలితంగా తరగతుల నిర్వహణ సులభతరం కావడంతోపాటు విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా బోధన నిరంతరంగా అందే అవకాశం ఉంటుంది. జిల్లాలోని 27 మండలాలకు పాఠశాలల అవసరాలకు అనుగుణంగా అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టులను సబ్జెక్టుల వారీగా కేటాయించారు. ఎస్‌జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ విభాగాల్లో తెలుగు, ఉర్దూ, తమిళం, ఇంగ్లిష్‌, గణితం, భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం, సామాజిక శాస్త్రం తదితర సబ్జెక్టులకు పోస్టులు ఉన్నాయి. మండలాల వారీ కేటాయింపు పట్టికలో మొత్తం 249 పోస్టులు చూపించారు. దీంతో సబ్జెక్టు ఉపాధ్యాయులు అందుబాటులో లేని చోట తాత్కాలికంగా బోధనా సిబ్బందిని సమకూర్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థుల అభ్యసనలో అంతరాయం తగ్గించడం, పరీక్షలకు అవసరమైన బోధనను సకాలంలో పూర్తి చేయడం వంటి ప్రయోజనాలు కలగనున్నాయి.

*ఎవరికి అవకాశం?*

ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసే సమయంలో స్థానికతకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. సంబంధిత గ్రామం, మండలానికి చెందిన అభ్యర్థులు అందుబాటులో ఉంటే వారికి మొదటి ప్రాధాన్యం ఉంటుంది. అక్కడ అర్హులైన అభ్యర్థులు లభించకపోతే ఇతర మండలాలకు చెందిన అభ్యర్థులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. సంబంధిత పోస్టుకు టెట్‌ అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. టెట్‌ అర్హత కలిగిన అభ్యర్థి అందుబాటులో లేని సందర్భంలో సంబంధిత పోస్టుకు అవసరమైన విద్యా, వృత్తిపరమైన అర్హతలు ఉన్న అభ్యర్థులను పరిగణనలోకి తీసుకుంటారు. దరఖాస్తు నమూనాలో పదో తరగతి, ఇంటర్మీడియట్‌, డిగ్రీ, పీజీతోపాటు డీఎడ్‌, బీఎడ్‌ వంటి వృత్తి విద్యార్హతలు, టెట్‌ మార్కుల వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే పోస్టుల వారీగా నిర్దిష్ట కనీస విద్యార్హతలను ఉత్తర్వుల్లో విడిగా పేర్కొనలేదు. కాబట్టి అభ్యర్థులు తాము దరఖాస్తు చేసే పోస్టుకు సంబంధించిన అర్హతలను మార్గదర్శకాల ప్రకారం నిర్ధారించుకోవాలి.

*ఎనిమిది నెలల ఉద్యోగమే..*

ఇవి శాశ్వత ఉద్యోగాలు కావు. 2026 సెప్టెంబరు 1 నుంచి 2027 ఏప్రిల్‌ 30 వరకు మాత్రమే అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్ల సేవలను వినియోగించనున్నారు. 2027 మే 1 నుంచి వారి సేవలు ఆటోమేటిక్ గా ముగుస్తాయి. ఎస్‌జీటీలకు నెలకు రూ.10,000, స్కూల్‌ అసిస్టెంట్లకు రూ.12,500 చొప్పున గౌరవ వేతనం చెల్లించనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 16 నుంచి 21 వరకు సంబంధిత మండల విద్యాశాఖ కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించాలి. దరఖాస్తుతోపాటు విద్యార్హతలు, వృత్తిపరమైన అర్హతలకు సంబంధించిన ధ్రువపత్రాల ప్రతులను జత చేయాలి. ఆగస్టు 23 నుంచి 26 వరకు దరఖాస్తుల పరిశీలన, 27, 28 తేదీల్లో జిల్లా కలెక్టర్‌ ఆమోద ప్రక్రియ జరుగుతుంది. ఆగస్టు 29న ఎంపికైన అభ్యర్థుల జాబితాను సంబంధిత మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులకు అందజేస్తారు. ఆగస్టు 30, 31 తేదీల్లో నియామక ఉత్తర్వులు జారీ చేసి సెప్టెంబరు 1న విధుల్లో చేరేలా చర్యలు చేపట్టనున్నారు.

*విద్యార్థులకు ప్రధాన ప్రయోజనం*

అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్ల నియామకంతో ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలల్లో బోధనకు అదనపు బలం లభిస్తుంది. ఒకే ఉపాధ్యాయుడిపై ఉండే అదనపు భారం కొంత తగ్గడంతోపాటు విద్యార్థులకు తరగతులు క్రమం తప్పకుండా నిర్వహించే అవకాశం ఉంటుంది. సబ్జెక్టుల వారీగా బోధన అందడం వల్ల విద్యార్థుల అభ్యసన స్థాయిని మెరుగుపరచడానికి కూడా ఈ నియామకాలు దోహదపడనున్నాయి. మరోవైపు స్థానికంగా విద్యార్హతలు కలిగిన నిరుద్యోగ అభ్యర్థులకు 8 నెలలపాటు ఉపాధి అవకాశం లభించనుంది. గౌరవ వేతనం నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు జాతీయ బ్యాంకులో ఖాతా కలిగి ఉండాలి. అంటే.. శాశ్వత ఉపాధ్యాయ నియామకాలు జరిగే వరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పడే బోధనా లోటును భర్తీ చేయడంతోపాటు విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడడమే ఈ 249 అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్‌ నియామకాల అసలు లక్ష్యం. 8 నెలలపాటు అదనపు బోధనా సిబ్బంది అందుబాటులో ఉండటం పాఠశాలలకు, విద్యార్థులకు తాత్కాలికంగా గణనీయమైన ఊరటనివ్వనుంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *