మున్సిపల్ ఎన్నికల వేడిని పెంచిన రిజర్వేషన్ల ఖరారు
మున్సిపల్ ఎన్నికల వేడిని పెంచిన రిజర్వేషన్ల ఖరారు
మరింత వేడెక్కిన చిత్తూరు కార్పొరేషన్ రాజకీయాలు
బీసీ రిజర్వేషన్లపై కేబినెట్ నిర్ణయంతో ఆశావహుల్లో ఉత్కంఠ
సెప్టెంబరు 3న వార్డుల వారీ ఓటర్ల జాబితాలు..
టికెట్ల కోసం అప్పుడే లాబీయింగ్
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)
మున్సిపల్ ఎన్నికల నగారా మోగకముందే చిత్తూరు జిల్లా పట్టణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసే దిశగా రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం, మేయర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్లను ప్రత్యక్షంగా ఎన్నుకునే విధానానికి ఆమోదం లభించడం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపింది. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం వార్డుల వారీ ఫొటో ఓటర్ల జాబితాల ప్రక్రియను ముందుకు తీసుకెళ్తుండటంతో రాజకీయ పార్టీల్లో ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రక్రియలో భాగంగా సెప్టెంబరు 3న వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితాలను ప్రచురించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో చిత్తూరు కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. వార్డుల వారీగా బలాబలాలను అంచనా వేసుకుంటూ తమకు అనుకూలమైన అభ్యర్థులకు టికెట్లు ఇప్పించుకునేందుకు ఆయా పార్టీల ముఖ్య నాయకుల వద్ద లాబీయింగ్ ప్రారంభమైంది.
చిత్తూరు నగరంలో టీడీపీ ఇప్పటికే ఎన్నికల ప్రచార వాతావరణాన్ని తలపించేలా ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని చేపట్టింది. గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ నేతలు, ఆశావహులు వార్డుల్లో పర్యటిస్తున్నారు. ప్రత్యేకత ఏమిటంటే మేయర్, కార్పొరేటర్ పదవులను ఆశిస్తున్న పలువురు నాయకులు ఈ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రజల్లో తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. చిత్తూరు కార్పొరేషన్‌లో మేయర్ పీఠంపై ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. అయితే మేయర్ పదవికి ఏ వర్గానికి రిజర్వేషన్ ఖరారవుతుందన్నది అధికారికంగా తేలాల్సి ఉండటంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. రిజర్వేషన్ ఖరారైన వెంటనే ప్రధాన పార్టీల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో మేయర్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వు కాగా, ఈసారి బీసీ, ఓసీ, మహిళ తదితర వర్గాల్లో ఏదో ఒకదానికి దక్కే అవకాశం ఉందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అయితే అధికారిక రిజర్వేషన్ ప్రకటన వెలువడే వరకు ఇవి కేవలం అంచనాలుగానే ఉన్నాయి. టీడీపీలో మాజీ ఎమ్మెల్యే సీకే బాబు వర్గం నుంచి ఆయన సతీమణి సీకే లావణ్య పేరు, కాజూరు బాలాజీ పేరు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మాజీ మేయర్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ కుటుంబం నుంచి వినోద్, మాజీ కార్పొరేటర్ చెరుకూరి వసంత్‌కుమార్, వ్యాపార వర్గాలకు చెందిన కోడి ఈశ్వర్‌బాబు పేర్లు కూడా రాజకీయ చర్చల్లో ఉన్నాయి. కూటమి భాగస్వామి జనసేన కూడా చిత్తూరు మేయర్ పీఠంపై ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతుండగా, ఆ పార్టీ నాయకురాలు ఆరణి కవిత పేరు కూడా వినిపిస్తోంది. వీరిలో ఎవరి పేరు ఖరారవుతుందన్నది రిజర్వేషన్, పార్టీ అధిష్ఠాన నిర్ణయాలపై ఆధారపడి ఉంది. గత ఎన్నికల్లో చిత్తూరు కార్పొరేషన్‌లో 50 డివిజన్లకు గాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 46 డివిజన్లు గెలుచుకుంది. ఈసారి ఆ ఫలితాన్ని తారుమారు చేసి కార్పొరేషన్‌పై పట్టు సాధించేందుకు కూటమి వ్యూహరచన చేస్తోంది. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌నాయుడు నాయకత్వంలో టీడీపీ వార్డుల వారీగా బలమైన అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా గత బలాన్ని నిలబెట్టుకునేందుకు కేడర్‌ను సమాయత్తం చేస్తోంది. జిల్లాలోని పలమనేరు, నగరి, కుప్పం తదితర పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అభ్యర్థిత్వాల కోసం ఆశావహులు ఇప్పటి నుంచే పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉండగా, తమ అనుచరులకు వార్డు సభ్యుల టికెట్లు ఇప్పించేందుకు కూడా ప్రయత్నాలు సాగుతున్నాయి. దీంతో ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే పట్టణాల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మొత్తంగా ఓటర్ల జాబితాల ప్రచురణకు తేదీ ఖరారు కావడం, రిజర్వేషన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, మేయర్, చైర్‌పర్సన్ ఎన్నికల విధానంలో మార్పులతో మున్సిపల్ ఎన్నికలపై ఉత్కంఠ మరింత పెరిగింది. ఇక రిజర్వేషన్లు అధికారికంగా ఖరారైతే చిత్తూరు సహా జిల్లాలోని పట్టణాల్లో టికెట్ల కోసం పోటీ, లాబీయింగ్ మరింత ముదిరే అవకాశముంది. దీంతో ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే చిత్తూరు పట్టణ రాజకీయాల్లో ఎన్నికల వేడి రాజుకుంది.

