23, ఆగస్టు 2024, శుక్రవారం

రాయలసేమలో విచిత్రమైన వాతావరణ పరిస్ధితులు


  • మూడు జిల్లాల్లో అతివృష్టి, చిత్తూరులో అనావృష్టి

  • ఆగస్టులో చిత్తూరు జిల్లాలో  మండుతున్న ఎండలు 

  • ఎండ తీవ్రత, ఉక్కపోతతో జిల్లా ప్రజలు సతమతం 

  • వర్షాలు లేకపోవడంతో ఎండిపోతున్న వేరుశనగ 

ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.


గతంలో ఎన్నడూ లేని విధంగా రాయలసీమ జిల్లాల్లో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు వ్యక్తం అవుతున్నాయి. అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలో భారీ వర్షాలు పడుతుండగా, చిత్తూరు జిల్లాలో మాత్రం ఎండలు మండిపోతున్నాయి. శ్రావణమాసంలో సాధారణంగా కనిపించే ముసురు కూడా కనిపించడం లేదు. జిల్లాలో ఎండలు 34 నుంచి 35 డిగ్రీలు నమోదు అవుతున్నాయి. ఉక్కపోతతో చిత్తూరు జిల్లా ప్రజలు సతమతం అవుతున్నారు. చిత్తూరు జిల్లాలో గత వారం, పది రోజులుగా వర్షాలు పడకపోవడంతో వేరుశనగ పంట ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. జిల్లా అంతట ఎండలో దంచి కొడుతున్నాయి. ఇది వర్షా కాలమా ? ఎండా కాలమా? అనే సందేహం ప్రజల్లో వ్యక్తం అవుతోంది.


శ్రావణమాసం అంటే  ఎడతెరిపి లేకుండా రోజుల తరబడి ముసురు పట్టే పరిస్థితి. చిత్తూరు జిల్లాలో ఆ వాతావరణం కనుమరుగైంది. వేసవి మాదిరిగా ఎండ తీవ్రత, భరించలేని ఉక్కపోత నెలకొంది. వర్షాల కోసం గ్రామాల్లో పూజలు చేసే పరిస్థితి ఏర్పడింది. చిత్తూరు జిల్లా మొత్తం ఇదే పరిస్థితి. వర్షాలు అన్ని ప్రాంతాల్లో కురిసే పరిస్థితి మాయమైంది. ఇది వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రుతుపవనాల సీజన్‌లో ఆగస్టును అత్యంత కీలకమైన నెలగా పరిగణిస్తారు. ఖరీఫ్‌ పంటలకు దోహదం చేసేలా ముసురుపట్టి వర్షాలు కురవాలి. కానీ, ప్రస్తుతం వేసవి కాలమా అనే సందేహం కలిగేలా వాతావరణం ఉంటోంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మిగులు వర్షపాతం నమోడు అవుతుందని భావించినా, అనేక మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. గత రెండున్నర నెలల కాలాన్ని పరికించి చూస్తే వాతావరణంలో అనేక మార్పులు వచ్చాయని స్పష్టమవుతుంది. వర్షాలకు భూమి, ఆకాశం, సముద్రాలు సహకరించాలి. అంటే మూడింట మధ్య ఏర్పడే తేడాల ప్రభావంతో వర్షాలు కురవాలి. కానీ, ఈ మూడూ వేడెక్కడంతో సమతుల్యత తప్పింది. నైరుతి సీజన్‌లో బంగాళాఖాతంలో సగటున ప్రతి వారం ఒక అల్పపీడనం ఏర్పడాలి. సీజన్‌ మొత్తం ఆరేడు వాయుగుండాలు రావాలి. కానీ, పది రోజులక్రితం భూమిపై అల్పపీడనం ఏర్పడగా, మళ్లీ శుక్రవారం వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం వచ్చింది. ఈ నెలలో గత 16 రోజుల్లో రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వర్షాభావం కొనసాగుతుండడం ఖరీఫ్‌ సాగుపై ప్రభావం చూపింది. అయితే చిత్తూరు జిల్లాలో మాత్రం వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వేరుశనగ పంట ఎండిపోతుంటే, రైతులు భాధగా ఆకాశం వైపు చూస్తున్నారు. వీటన్నింటినీ పరిగణన లోకి తీసుకునే నైరుతి రుతుపవనాల తీరు మారిందని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.


వేసవి ఛాయలు..

జిల్లాలోని అనేక మండలాల్లో ఆగస్టులో వేసవి ఛాయలు నెలకొన్నాయి. ఉదయం నుంచి ఎండ తీవ్రత, భరించలేని ఉక్కపోత ఉంటున్నాయి. అసలైతే ముసురు వాతావరణంతో ఉష్ణోగ్రతలు కనీస స్థాయికి పడిపోవాలి. కానీ, గత 16 రోజుల్లో రెండు, మూడు రోజుల తప్ప ఎక్కువ రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నాలుగైదు రోజులు అత్యధిక ఉష్ణోగ్రతలు జిల్లాలో నమోదయ్యాయి. రానురాను వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయని నిపుణులు చెబుతున్న నేపథ్యంలో గతేడాది కంటే ఈ ఏడాది రుతుపవనాల సీజన్‌లో తేడా మరింత ఎక్కువగా కనిపిస్తోంది.  ఇది పంటలపై ప్రభావం చూపుతుందని రైతులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో వేరుశనగ పంట వర్షం మీదనే ఆధారపడింది.  రోజుల తరబడి పొడి వాతావరణం నెలకొనడంతో పంటల ఎదుగుదల, మనుగడ ఇబ్బందిగా మారుతుందని విశ్లేషిస్తున్నారు. 

జిల్లాలో 16 మండలాల్లో వర్షాభావం..

నైరుతి సీజన్‌లో జూన్‌ ఒకటి నుంచి శుక్రవారం వరకు రాష్ట్రంలోని 16 మండలాల్లో వర్షాభావం నెలకొంది. 15 మండలాల్లో ఈ నెల 21 వ తేదిన వర్షాలు పడ్డాయి. 16 మండలాల్లో వారం, పాడి రోజులుగా వర్షాలు పడలేదు. . కొన్ని  కొన్ని మండలాల్లో సాధారణం కంటే చాలా ఎక్కువగా, మరికొన్నిచోట్ల అతి తక్కువ వర్షపాతం నమోదైంది. కొన్ని మండలాల్లో అసలు వర్షాలే కురవలేదు. జూలైలోకూడా జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదు కాలేదు. 104 మిల్లిమీటర్లు పడాల్చి ఉండగా, 90 మిల్లి మీటర్ల వర్షం మాత్రం పడింది. ఆగస్టు నెలలలో ఎక్కువ వర్షం పడలేదు. ఎండలు మండుతున్నాయి.  


వేడెక్కిపోతున్న సముద్రం, భూమి, ఉపరితలం..

రుతుపవనాల సీజన్‌లో ఒక వారం వర్షాలు కురిస్తే, మరో వారం కొంత వరకు పొడి వాతావరణం ఉంటుంది. అంటే వర్షం పడిన తరువాత సముద్రంలో తిరిగి తేమ తయారీకి వారం పడుతుంది. కానీ, ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది. భూమి, సముద్రం, వాతావరణం మూడూ కూడా వేడెక్కిపోతున్నాయి. సాధారణంగా భూమి వేడెక్కినప్పుడు సముద్రం చల్లగా ఉంటే మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తాయి. ఈ మూడు వేడెక్కడంతో పరిస్థితి భిన్నంగా తయారైందని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ మేఘాలు ఆవరించినా అవి ముక్కలై ఒక వైపు భారీ వర్షం కురిస్తే మరోవైపు పొడి వాతావరణం నెలకొంటుంది. ప్రస్తుతం కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలు వర్షంతో తడిచి ముద్దవుతున్నాయి. పక్కనే ఉన్న చిత్తూరు జిల్లాలో మాత్రం ఎండలు దంచికోడుతున్నాయి. రాయలసేమలో ఈ విచిత్ర పరిస్థితి గతం ఎన్నడూ లేదు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *