రోజా మౌనం వెనక మర్మం ఏమిటి ?
సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారని భావిస్తున్న రోజా
కొన్ని రోజులు మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయం
అధినేత హామీ ఇస్తే, మళ్ళి మీడియా ముందుకు
అప్పటి వరకు చెన్నైలోనే మకాం
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
ఎన్నికల ఫలితాల తరువాత ఫైర్ బ్రాండ్ ఆర్ కె రోజా మౌనం వహించడం జిల్లాలో రక రకాల చర్చలకు తావిస్తోంది. ఆమె వైసిపి ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్నప్పుడు రోజూ మీడియాలో కనిపించే వారు. టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుని పడే వారు. ఆమె దాటిని తట్టుకోలేక టిడిపి అధిష్టానం అదే సామాజిక వర్గానికి చెందిన ఆ పార్టీ అధికార ప్రతినిధులు డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి, ఆనం వెంకటరమణ రెడ్డిల ద్వారా ప్రతి విమర్శలు చేయించే వారు. జనసేన నాయకుడు కిరణ్ రాయల్ ఆమెపై తీవ్రంగా విమర్శలు చేసి పవన్ కళ్యాణ్ కు దగ్గరయ్యారు.
నగరి నుండి రెండు పర్యాయాలు గెలుపొందిన రోజా, మూడవ పర్యాయం ఘోరంగా ఓడిపోయారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చింది. దీంతో రోజా పత్రికా విలేకరులకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ఆమె ఎక్కడ ఉన్నారు, ఏమి చేస్తున్నారు, ఏమి చేయబోతారు అన్న చర్చ ప్రజల్లో జోరుగా జరుగుతోంది. నగరిలో హ్యాట్రిక్ సాధిస్తానని నమ్మకంగా చెప్పే రోజా టిడిపి అభ్యర్థి గాలి భాను ప్రకాష్ చేతిలో 45,004 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తనను ఓడించేందుకు స్వంత నేతలే కుట్ర పన్నారని ఆమె ఎన్నికల సమయంలో ఆరోపించారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా తన గెలుపును ఆపలేరని బీరాలు పలికారు. అయితే విధి వక్రించి ఘోర ఓటమి చవి చూశారు. అప్పటి నుంచి చెన్నైలోని తన నివాసంలో ఉంటున్నారు. అప్పుడప్పుడు నగరి నియోజక వర్గంలోని కార్యకర్తల శుభ కార్యాలలో పాల్గొంటున్నారు. అయితే మీడియాకు దూరంగా ఉన్నారు. మానసిక ప్రశాంతి కోసం గుడులు, గోపురాలు తిరుగుతున్నారు. ఉల్లాసం కోసం విహార యాత్రలు చేస్తున్నారు. దీనితో రాజకీయ వర్గాలు ఆమె మౌనం వెనక మర్మం అన్వేషించే పనిలో పడ్డారు. ఆమె జిల్లా అగ్రనేతలపై అలిగి రాజకీయాలకు దూరంగా ఉన్నారని కొందరు అంటున్నారు. తన మీద జరుగుతున్న రాజాకీయ కుట్ర తెలిసినప్పటికి జగన్ అడ్డుకోక పోవడం పట్ల కొంత అసంతృప్తితో అన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో తాను పార్టీని నెత్తిన మోయాల్సిన అవసరం లేదని ఆమె భావిస్తున్నట్టు సన్నిహితుల ద్వారా తెలిసింది. తాను కూటమి నేతలపై విమర్శలు చేస్తే ప్రతి దాడులు తీవ్ర స్థాయిలో ఉంటాయని ఆమె భావిస్తున్నారు. అయితే జిల్లా అగ్ర నేతలు తనకు మద్దతు ఇవ్వరని, ఒంటరి పోరాటం చేయడం ఎందుకని ఆమె అత్యంత సన్నిహితులతో అన్నట్టు తెలిసింది. కాగా కొంత కాలం మౌనంగా ఉండి జగన్ నుంచి మంచి హామీ, మద్దతు దొరికిన తరువాత రంగంలోకి దిగుతారని ఒక నాయకుడు చెప్పారు. కాగా తమిళ సినీ నటుడు విజయ్ ప్రారంభించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతున్నది. ఆమె భర్త ఆర్ కె సెల్వమణి తమిళ వ్యక్తి కావడం తమిళ నాడులో తెలుగు వారు ఎక్కువ సంఖ్యలో ఉండటం వల్ల అక్కడి రాజకీయాలలో రాణించవచ్చని ఆమె భావిస్తున్నారని కొందరు అంటున్నారు. అయితే విజయ్ ఆమెను పార్టీలో చేర్చుకోవడానికి సుముఖంగా లేరని సోషియల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఆమె కనిపించని లోటు మాత్రం రాజకీయాలలో కనిపిస్తోంది. రోజా మాత్రం ప్రస్తుత రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. అత్యధిక మెజారిటీతో గెలుపొందిన కూటమి ప్రభుత్వం మీద ఇప్పుడే విమర్శలు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మళ్ళి జగన్ తనను పిలిచి మాట్లాడి, టిక్కెట్టు విషయంలో హామీ ఇస్తే తప్ప, మీడియాకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు తెలిసింది. అందుకే నగరిలో కొన్ని కార్యక్రమాలలో రోజా పాల్గొంటున్నా, ఎక్కడ రాజకీయాల మీద నోరు విప్పడం లేదు.
సినీ నటి అయిన ఆమెను టిడిపి అధినేత చంద్రబాబు రాజకీయాలలోకి తెచ్చారు. రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలిగా పదవి ఇచ్చారు. 2004 ఎన్నికల్లో నగరి టికెట్టు ఇచ్చారు. 2009 లో నగరిని కాదని చంద్రగిరిలో పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో టిడిపికి చెందిన ఒక సామాజిక వర్గం వారు తన ఓటమికి కారణం అంటూ ఆరోపించి పార్టీని వీడారు. తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు, జగన్ వైసిపి పెట్టగానే ఆయన వెంట నడిచారు. 2014, 2019 ఎన్నికల్లో నగరి నుంచి వైసిపి అభ్యర్థిగా విజయం సాధించారు. రెండవ విడత విస్తరణలో మంత్రి పదవి చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా క్రీడా పరికరాల కొనుగోలు, శ్రీవారి దర్శనం టిక్కెట్ల విషయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రోజా మీద సి ఐ డి అధికారులు కేసును కూడా నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.