4, ఆగస్టు 2024, ఆదివారం

శ్రావణ మాసంలో కూటమి నేతలకు పదవుల యోగం ..

సిద్దమవుతున్న జాబితాలు 

తొలి విడుత 25 సంస్థలకు చైర్మన్లు, డైరెక్టర్లు 

ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.

కూటమి ప్రభుత్వం శ్రావణ మాసంలో పదవుల పందేరానికి తెర తీయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. పదవులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వారిలో కొందరిని ఈ వారం రోజుల్లో పదవులు వరుస్తాయని అంటున్నారు.  ఇప్పటికే చాలా పదవుల జాబితా సిద్ధం చేశారని తెలిసింది. అయితే ఆశాడ మాసంలో మంచి రోజులు లేనందున శ్రావణ మాసంలో మంచి ముహూర్తం చూసి పదవుల మొదటి జాబితా విడుదల చేస్తారని తెలిసింది. సోమవారం శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది. అదే రోజు లేదా మరో మంచి రోజున  పదవుల జాబితా విడుదల చేస్తారని సమాచారం. 


మొదటి విడతలో రాష్ట్ర స్థాయిలో 25 సంస్థల అధ్యక్షులు, సభ్యుల పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన పదవులను కూడా నెల రోపుగానే విడతల వారీగా విడుదల చేస్తారని పార్టీ నుంచి స్థానిక నేతలకు సమాచారం అందిందింది. పదవుల పంపిణీలో టిడిపికి ఎక్కువ పదవులు కేటాయించి నప్పటికీ జనసేన, బిజెపి నేతలకు కూడా తగిన ప్రాధాన్యత ఉంటుంది అంటున్నారు. టిడిపి పార్టీ ప్రోగ్రామ్ కమిటీ వారు కొందరికి ఫోన్ చేసి వివరాలు సేకరించారు. అంతకు ముందే అందరి వివరాలను పార్టీ అధిష్టానానికి పంపారు. అయితే అంతా రహస్యంగానే ఉంది. రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు, మాజీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లాంటి వారికి కూడా తెలియకుండా పదవుల భర్తీ చేస్తున్నారని అంటున్నారు. జిల్లాలో జనసేన, బిజెపి నేతల కంటే టిడిపిలో ఎక్కువ మంది పదవులను ఆశిస్తున్నారు. వచ్చే వారంలో కొందరికి అదృష్టం వరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్తూరు అసెంబ్లీ నియోజక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సి కె బాబు, మాజీ ఎమ్మెల్యే మనోహర్, పార్లమెంటు అధ్యక్షుడు సి ఆర్ రాజన్, ప్రధాన కార్యదర్శి కోదండయదవ్, కాజూరు బాలాజీ, కటారి హేమలత, రాజేశ్వరి, వసంత కుమార్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. పూతలపట్టు కు చెందిన రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ రెండు రోజుల క్రితం చంద్రబాబును కలసి వచ్చారు.  గుడిపాలకు చెందిన పీటర్, మాజీ ఎం ఎల్ ఏ గాంధీ, పుత్తూరుకు చెందిన గ్యాస్ రవికుమార్  కూడా పదవి ఆశిస్తున్నారు. బిజెపి నుండి జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి, బిసి నేత అట్లూరి శ్రీనివాసులు కూడా రేసులో ఉన్నారు. పలమనేరు నుంచి పెద్దగా పేర్లు వినిపించడం లేదు. కుప్పం నుంచి బిసి వర్గానికి చెందిన మునిరత్నం, రాజశేఖర్ లలో ఒకరికి పదవి తప్పదని అంటున్నారు. పుంగనూరు నియోజక వర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డితో తలబడి ఓడిపోయిన చల్లా రామచంద్రా రెడ్డికి పదవి వచ్చే అవకాశం ఉందని తెలిసింది. జి. డి నెల్లూరు నియోజక వర్గం నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి, రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి భీమినేని చిట్టిబాబు నాయుడులకు పదవీ యోగం ఉందంటున్నారు. జనసేన ఇంచార్జి డాక్టర్ పొన్న యుగంధర్ కూడా పదవి రేసులో ఉన్నారు. నగరి నియోజకవర్గంలో మాధవ నాయుడు, పోతుగుంట విజయబాబు పదవులను ఆశిస్తున్నారు. అయితే అక్కడ సిద్ధార్థ విద్యాసంస్థలు అధిపతి అశోక్ రాజుకు బిజెపి కోటాలో పదవి వచ్చే అవకాశం ఉంది.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *