జిల్లాలోని రైతులకు సరఫరాకు 21,608 మెట్రిక్ టన్నుల ఎరువులు సిద్దం
రూ. 1555 కోట్ల పంట రుణాలు రైతులకు పంపిణి
పీఎం కిసాన్ పథకం కింద 1.75 లక్షల రైతులకు రూ. 35 కోట్లు వితరణ
రాయితీపైన 40,332 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాల పంపిణి
'ప్రభ న్యూస్ బ్యూరో' తో జిల్లా వ్యవసాయ శాఖాధికారి మురళీకృష్ణ
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
చిత్తూరు జిల్లాలోని రైతులకు 21,608 మెట్రిక్ టన్నుల ఎరువులను సరఫరా చేయనున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జి. మురళీకృష్ణ తెలిపారు. ఆయన శనివారం చిత్తూరులో 'ప్రభ న్యూస్ బ్యూరో'తో మాట్లాడుతూ ఈ మేరకు ఎరువులను జిల్లాలోని రైతు సేవా కేంద్రాలలో నిల్వ ఉంచామన్నారు. అవసరమైన రైతులు ఎరువులను తీసుకోవచ్చని తెలిపారు. రైతులకు సరఫరా చేయడానికి 16,197 టన్నుల యూరియా, 1,346 టన్నుల డిఏపి, 265 టన్నుల ఎంఓపి, 3,434 టన్నుల కాంప్లెక్స్, 366 టన్నుల ఎస్ఎస్పి రైతు సేవా కేంద్రాల్లో సిద్ధంగా ఉన్నాయని వివరించారు. ఇప్పటి వరకు రైతులకు 2,444 మెట్రిక్ టన్నుల ఎరువులను పంపిణీ చేశామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి 4,072 కోట్ల వ్యవసాయ పంట రుణాలు లక్ష్యం గాక ఇప్పటివరకు 1555 కోట్ల రూపాయలను రైతులకు పంట రుణాలుగా పంపిణీ చేశామన్నారు. వ్యవసాయతర పంట రుణాలుగా 2322 కోట్లు లక్ష్యం కాగా, ఇప్పటివరకు 629 కోట్ల రూపాయలను రైతులకు అందజేశామని తెలిపారు. పీఎం కిసాన్ పథకం కింద 17 వ విడత 1,75,051 మంది రైతుల కుటుంబాలకు 35 కోట్ల రూపాయలను జమ చేయడం జరిగిందన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యతను నిర్ధారించడానికి ప్రభుత్వం సమగ్ర వ్యవసాయ ప్రయోగశాలలో నియోజకవర్గాన్ని ఒకటి చొప్పున, జిల్లాస్థాయిలో ఒకటి ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో 3890 మంది రైతులకు పంట సాగుదారు హక్కు పత్రాలను ఇవ్వాలని లక్ష్యం కాగా, ఇప్పటివరకు 331 మందికి పంట సాగు హక్కు పత్రాలను అందజేశామన్నారు. జిల్లాలోని కౌలు రైతులకు 127.2 లక్షల రూపాయలను రుణాలకు అందజేశామని చెప్పారు. చిత్తూరు జిల్లాలో ఈ ఖరిఫ్ సీజనుకు వర్షపాతం తగ్గిందన్నారు. జూన్, జూలై నెలల్లో సాధారణ వర్షపాతం 904 మిల్లీమీటర్ల దాకా, ఇప్పటివరకు 278 మిల్లిమీటర్లు మాత్రమే నమోదు అయిందన్నారు. ఫలితంగా జిల్లాలో 81,169 హెక్టార్లలో పంటలు సాగు కావాల్సి ఉండగా, ఈ ఖరీఫ్ సీజన్ కు 32,990 హెక్టార్లు మాత్రమే సాగైందని తెలిపారు. జిల్లాలో రాయితీపైన 40,332 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను 86,290 మంది రైతులకు పంపిణీ చేశామన్నారు. అలాగే 1,533 పచ్చరోట్ట విత్తనాలను 5,419 రైతులకు పంపిణీ చేశామన్నారు. ఈ పచ్చరొట్ట ఎరువులను పొలంలో చల్లి, అవి ఏపుగా పెరిగిన తర్వాత దున్నితే, భూసారం పెరుగుతుందని వివరించారు. భూసార పరీక్ష లో భాగంగా ఖరీఫ్ సీజన్లకు 15,972 మట్టి నమూనాలు సేకరించి, భూసార పరీక్ష నిమిత్తం తిరుపతికి పంపించామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ తెలిపారు.