చిత్తూరు జిల్లాకు కృష్ణ నదీ జలాల మళ్లింపు
జిల్లాలోని 2,71,442 మందికి పించన్లు
వ్యవసాయ పంట రుణాల కింద రూ. 1,555 కోట్లు
రూ.450 కోట్లతో విద్యాసంస్థల మరమ్మత్తులు, ఆదునిణీకరణ
రూ. 431 కోట్లతో జల జీవన్ మిషన్ కింద ఇంటింటికి కొల్లాయి
కుప్పం, పలమనేరు, పుంగనూరు పట్టణాల్లో అన్నా క్యాంటీన్లు
స్వాతంత్య దినోత్సవ ప్రసంగంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
చిత్తూరు ప్రజల దాహార్తిని తీర్చడానికి కృష్ణా జలాలను చిత్తూరుకు మళ్లించనున్నట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ వైద్య విద్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ వెల్లడించారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గురువారం ఆయన చిత్తూరు పోలీస్ పేరెంట్ గ్రౌండ్లో జాతీయ పతాక ఆవిష్కరించి, జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ జిల్లా సమగ్ర అభివృద్ధికి, అన్నదాతల మోములో చిరునవ్వులు నింపేందుకు జిల్లాకు కృష్ణా జలాలను తీసుకురానున్నట్లు వివరించారు. కృష్ణ జలాల కారణంగా జిల్లాలో తాగునీరు, సాగునీరు అవసరాలు తీరుతాయని, జిల్లా సస్యశ్యామలం అవుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. పాలనలో బాధ్యత, జవాబుదారితనాన్ని పెంచేందుకు, ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రతి సోమవారం జిల్లా, డివిజన్, మండల కేంద్రాలలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా కింద జిల్లాలోని 2,71,442 మంది పింఛన్దారులకు ఒకటవ తారీఖున పెంచిన పింఛన్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పించను మొత్తాలను పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ సామాన్యులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రవేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, వసతులు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. పేద ప్రజలకు కార్పొరేట్ తరహా ఉచిత వైద్య సేవలు అందించాలని లక్ష్యంతో ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద ప్రతి కుటుంబంలోని ప్రతి వ్యక్తికి ఆరోగ్య భద్రత ఉచిత వైద్య సేవలు కల్పించాలని నిర్ణయించమన్నారు. అయిదు లక్షల రూపాయల వార్షిక ఆదాయం లోపు ఉన్న ప్రతి వ్యక్తికి 3,255 జబ్బులకు మన రాష్ట్రంలో గుర్తింపబడిన ఆస్పత్రులలో ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని అమలు చేస్తున్నామని, ఈ ఆసుపత్రులలో 25 లక్షల వరకు ఉచిత వైద్య పరీక్షలు, శస్త్ర చికిత్సలు చేసి, మందులను కూడా ఉచితంగా అందజేస్తున్నామన్నారు. నిరుపేదలకు ఐదు రూపాయలకే భోజనం, అల్పాహారం అందించడానికి కుప్పం, పలమనేరు, పుంగనూరు పట్టణాల్లో గురువారం నుండి అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని, ఇప్పటికే చిత్తూరులో అన్నా క్యాంటీన్ నడుస్తుందని వివరించారు. విద్యా విద్యారంగంలో సమూల సంస్కరణలు చేపట్టి నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించడానికి ఒత్తిడి లేని ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు విద్యను అభ్యసించడానికి, మారుతున్న కాలానికి అనుగుణంగాఉత్తమ విద్యా విధానాలను అవలంబిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల హామీల అమలులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మెగా డీఎస్సీని 16,347 టీచర్లతో ప్రకటించారని, చిత్తూరు జిల్లాకు 1, 470 పోస్టులను కేటాయించామన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకం కింద జిల్లాలోని 2,444 పాఠశాలల్లో 1,63,704 మంది విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందజేస్తున్నామని తెలిపారు. మనబడి మన భవిష్యత్తు పథకం కింద 1,180 పాఠశాలలు, 30 జూనియర్ కళాశాలలో 450 కోట్ల రూపాయలతో ప్రభుత్వ భవనాల మరమ్మత్తులు, ఆదునిణీకరణ చేయనున్నట్లు తెలిపారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ రూపొందించి, ప్రతి రెవెన్యూ గ్రామంలో అర్జీలు స్వీకరించి వాటిని పరిష్కరించడానికి గ్రామ గ్రామాన రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామన్నారు. రైతు సంక్షేమంలో భాగంగా పిఎం కిసాన్ 1,75 051 కుటుంబాలకు 35 కోట్ల రూపాయలని జమ చేశామని, రైతు సేవ కేంద్రాల ద్వారా 2444 మెట్రిక్ టన్నుల ఎరువులను సరఫరా చేశామన్నారు. వ్యవసాయ పంట రుణాల కింద 1,555 కోట్ల రూపాయలు, వ్యవసాయేతర పంట రుణాలు కింద 629 కోట్ల రూపాయలను మంజూరు చేస్తామన్నారు.40,332 క్వింటాళ్ల వేరుశెనగ విత్తనాలను 86,290 మంది రైతులకు సరఫరా చేశామన్నారు. ఉద్యానవన పంటల పెంపకానికి బిందు సేద్యం ద్వారా ఐదు ఎకరాల లోపు ఉన్న చిన్నసన్నకారు రైతులకు 90 శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలను అందజేయనున్నట్లు తెలిపారు. సమగ్ర ఉద్యాన అభివృద్ధి మిషన్ పథకం కింద 8.80 కోట్ల రూపాయలతో పండ్లతోటల విస్తరణకు ప్రణాళికను రూపొందించామన్నారు. కుప్పం ఇండో - ఇజ్రాయిల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా 92 లక్షల కూరగాయల అంటు మొక్కలు ఉత్పత్తి చేసి, రాష్ట్రవ్యాప్తంగా రైతులకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 18 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతుందని, రాబోయే రెండు సంవత్సరాల్లో 23 లక్షల లీటర్లకు పెంచడానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. గూడులేని నిరుపేదుల కోసం ఇకపై కొత్తగా ఎంపిక చేసే లబ్ధిదారులకు ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలను అందజేయనున్నట్లు తెలిపారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా 60 శాతం రాష్ట్ర ప్రభుత్వం వాటా 40 శాతం ఉంటుందని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు భూమిని అందజేయనున్నట్లు తెలిపారు. ఎన్నికల హామీలో భాగంగా ఇసుక ఉచిత విధానాన్ని అమలు చేస్తున్నామని, నిత్యం కరువుతో తల్లడిల్లుతున్న రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి తాగు, సాగునీటి కోసం హంద్రీ నీవా సుతుల స్రవంతి ప్రాజెక్టు ద్వారా పుంగనూరు, కుప్పం బ్రాంచ్ కెనాల్ కు నీరు అందించాలని ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు. కార్వేటి నగరం మండలం, కృష్ణాపురం రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఆధునికరణకు 30 కోట్ల రూపాయల వ్యయంతో పరిపాలన ఆమోదం మంజూరు చేశామన్నారు. జిల్లాలో ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వడానికి 431 కోట్ల రూపాయల వ్యయంతో జల జీవన్ మిషన్ పధకం కింద 5,041 పనులను చేపట్టనున్నట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. తొలిత మంత్రి సాయిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా అభివృద్ధిని వివరిస్తూ జరిగిన శకటాల ప్రదర్శనను పరిశీలించారు. విద్యార్థుల నృత్యాలను ఆసక్తిగా తిలకించారు. ఉత్త ఉత్తమ సేవలందించిన ప్రభుత్వ అధికారులకు, ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, కడ ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్, అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ, డిఆర్ఓ పుల్లయ్య, డ్వామా పీడీ రాజశేఖర్, చిత్తూరు పార్లమెంట్ సభ్యుడు దగ్గుమళ్ళ ప్రసాదరావు, జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, చిత్తూరు నగర మేయర్ అముద, చిత్తూరు శాసనసభ్యుడు గురజాల జగన్మోహన్ నాయుడు, పూతలపట్టు శాసనసభ్యులు మురళీ మోహన్, గంగాధర నెల్లూరు శాసనసభ్యుడు థామస్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పో రై. గంగ 1 చిత్తూరు పొలిసు మైదానంలో జాతీయ జండాను ఆవిష్కరిస్తున్న మంత్రి సత్యకుమార్ యాదవ్
గంగ 2 సాయుధ దళాల గౌరవ వందనం స్వికరిస్తున్న మంత్రి సత్యకుమార్ యాదవ్
గంగ 3 జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న మంత్రి సత్యకుమార్ యాదవ్