25 మండలాల్లో ఎండిపోతున్న వేరుశనగ పంట
6 మండలాల్లో కొంత ఆశాజనకం
రెండు వారాలుగా ముఖం చాటేసిన వరుణుడు
ఊడలు దిగి, కాయలు ఊరే దశలో తీవ్ర వర్షాభావం
ఆకాశం వైపు ఆశగా చూస్తున్న రైతులు
భారీగా నష్టపోనున్న వేరుశనగ రైతులు
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
చిత్తూరు జిల్లాలో వరుణదేవుడు గత రెండు వారాలుగా ముఖం చాటేశాడు. దీంతో జిల్లాలో వర్షాధారం మీద ఆధారపడి వేసిన వేరుశనగ పంట ఎండిపోతోంది. రైతులు దిగాలుగా ఆకాశం వైపు చూస్తున్నారు. ఆకాశంలో మబ్బులు ఎక్కడం తప్ప వర్షం పడటం లేదు. ఆరుకాలం శ్రమపడి పండించిన పంటలు ఎండిపోవడంతో వేరుశనగ రైతులు నిరాశకు గురవుతున్నారు. వరుణదేవుడు ఎప్పుడు కరుణిస్తాడని ఆకాశం వైపు ఆశగా ఎదురుచూపులు చూస్తున్నారు.
చిత్తూరు జిల్లాలో ఈ సంవత్సరం 81,169 హెక్టర్లలో వేరుశనగ పంట సాగు అయింది. వేరుశనగ పంట ఇప్పుడు ఊడలు దిగి, కాయలు ఏర్పడే దశలో ఉంది. కీలకమైన ఈ సమయంలో వర్షం లేకపోవడంతో జిల్లాలో వేరుశనగ పంట ఎండిపోతుంది. తాము కష్టపడి పండించిన వేరుశనగ పంట తమ కళ్ళముందర ఎండిపోతుండదంతో వేరుశనగ రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. జిల్లాలో గత నాలుగైదు సంవత్సరాలుగా వేరుశనగ విస్తీర్ణం తగ్గిపోతుంది. ఇందుకు కారణం సకాలంలో వర్షాలు పడకపోవడం. వేరుశనగ పంట చేతికి రాకపోవడం, ఒక సంవత్సరం భారీ వర్షాలతో వేరుశెనగ పంటను ఓడుపుకునే అవకాశం కూడా లేకుండా పంట చేలలోనే కుళ్లిపోయింది. ఇలా ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా వేరుశనగ పంట దెబ్బతింటూనే ఉంది. అయినా ఆశతో రైతులు వేరుశనగ పంట వేస్తూనే ఉన్నారు. ఈ సంవత్సరం 81 వేల హెక్టార్లలో వేరుశనగ పంట సాగైందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇందుకు రాయితీ మీద నలభై వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను రైతులకు సరఫరా చేశారు. దీంతో రైతులు ఎంతో ఆశగా వేరుశనగ విత్తనాలను సాగు చేశారు. వేరుశనగ పంట వేసిన తర్వాత కొంతకాలం సక్రమంగానే వర్షాలు పడ్డాయి. దీంతో వేరుశనగ పంటలో కలుపును కూడా తీసి, పంటకు సిద్ధం చేశారు. తీరా వేరుశనగ ఊడల దిగి, కాయలు తయారయ్యే పరిస్థితుల్లో వరుణదేవుడు ముఖం చాటు వేశాడు. దీంతో జిల్లాలో వేరుశనగ పంట ఎండిపోతుంది. చిత్తూరు జిల్లాలో 31 మండలాలు ఉండగా 6 మండలాల్లో మాత్రం పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. వెదురు కుప్పం, శ్రీరంగ రాజపురం, వి.కోట, శాంతిపురం, గుడిపల్లి, రామకుప్పం మండలాల్లో ఈ నెల 21వ తేదీన కొంత మేరకు వర్షాలు పడ్డాయి. మిగిలిన 25 మండలాల్లో చివరిసారిగా ఈనెల 11 వ తారీఖున వర్షాలు పడ్డాయి. 16 రోజులపాటు వర్షాలు లేకపోవడంతో వేరుశనగ పంట వాడిపోతుంది. జిల్లాలో క్రమంగా వేరుశనగ పంట విస్తీర్ణం కూడా తగ్గుతుంది. సకాలంలో వర్షాలు పడకపోవడంతో రైతులు ఉద్యానవన పంటలైన మామిడి వైపు ఎక్కువ ఆసక్తిని చూపుతున్నారు. ఒకవైపు సకాలంలో వర్షాలు పడకపోవడం, మరోవైపు వేరు విత్తనాలు విత్తడానికి, అందులో కలుపు తీయడానికి, వేరుశనగ పీకడం, కాయలు ఒలువడం వంటి పనులకు కూడా జిల్లాలో కూలీలు దొరకడం లేదు. కూలీల రోజుకు 500 నుంచి 700 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పంట రాబడి కంటే కూలీలకు అయ్యే ఖర్చు ఎక్కువ అవుతుంది. లెక్కలు వేసుకుంటున్న పలువురు రైతులు వ్యవసాయానికి స్వస్తిపలుకుతున్నారు. మామిడి వైపు మొగ్గు చూపుతున్నారు. బంగాళాఖాతంలో తుఫానులు ఏర్పడ్డాయి, రాయలసీమలో భారీ వర్షాలు అంటూ వాతావరణ శాఖ అధికారులు మాత్రం రోజు ఊరిస్తూనే ఉన్నారు. అయితే చిత్తూరు జిల్లాలో మబ్బులు ఆడడం తప్ప వర్షం కురవడం లేదు. వర్షం కురువకపోవడంతో వేరుశనగ పంటతోపాటు ఇతర రకాల పంటలు కూడా భారీగా దెబ్బతింటున్నాయి. ఇదే పరిస్థితి మరో వారం రోజులు పాటు కొనసాగితే చిత్తూరు జిల్లాలో వేరుశనగ పంట పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉంది. బోరు బావులు ఉండి రైన్ గన్స్ ఉన్న రైతులు మాత్రం కొంతవరకు వేరుశనగ పంటను కాపాడుకోగలుగుతున్నారు. బోరు బావులు కింద పంట లేని రైతులు వేరుశనగ పంటలు నష్టపోతున్నారు. జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి, వేరుశనగ పంటకు నష్టపరిహారం ఇవ్వాలని జిల్లాలోని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
పో రై గంగ 1 జిల్లాలో ఎండిపోతున్న వేరుశనగ పంట