24, ఆగస్టు 2024, శనివారం

జనావాసాల మధ్య టపాకాయల తయారీ కేంద్రాలు

పట్టణాల్లో కుటీర పరిశ్రమగా బాణ సంచా తయారీ 

చిత్తూరులో భారీగా చిత్తూరు  ఔట్ల తయారీ 

నగరి, పుత్తురులలో విస్తరిస్తున్న టపాకాయల పరిశ్రమ 

అనుమతులు లేకుండా జనావాసాలలో టపాకాయల నిల్వలు 

ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.


చిత్తూరు జిల్లాలో టపాకాయల తయారీ కుటీర పరిశ్రమలుగా చెలామణి అవుతున్నాయి.  చాలా మందికి ఉపాధి కేంద్రాలుగా  వర్ధిల్లుతున్నాయి. జిల్లాలో పలుచోట్ల అనధికారికంగా టపాకాయలు తయారీ జరుగుతోంది. అలాగే పట్టణాల్లో భారీ ఎత్తున టపాకాయలను అనుమతులు లేకుండా నిల్వ చేస్తున్నారు. తరచుగా టపాకాయలు తయారీ కేంద్రంలో,  టపాకాయలు నిల్వచేసిన కేంద్రంలో పేలుళ్లు సంభవిస్తున్నాయి. ఫలితంగా ధన, ప్రాణ నష్టం భారీగా జరుగుతోంది. నిఘా వైఫల్యమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.


చిత్తూరు జిల్లాలో చిత్తూరు, పలమనేరు, నగరి, పుత్తూరు ప్రాంతాలలో భారీగా టపాకాయల తయారి కేంద్రాలు నడుస్తున్నాయి. వీటికి అనుమతి లేకుండానే రహస్యంగా టపాకాయల తయారీ జరుగుతోంది. ఇవి జిల్లాలో పలువురికి కుటీర పరిశ్రమగా మారింది. జిల్లాలో నిఘా వైఫల్యం కారణంగా అప్పుడప్పుడు వీటిల్లో ప్రేలుళ్ళు  సంభవిస్తున్నాయి. వీటి కారణంగా అమాయక ప్రజలు ప్రాణాలను కోల్పోతున్నారు. దీపావళి సమయంలో తమిళనాడులోని శివకాశి నుంచి టపాకాయలు భారీగా దిగుమతి అవుతాయి. మిగిలిన టపాకాయలను వ్యాపారస్తులు తమ ఇళ్లల్లో నిల్వ ఉంచుకుంటున్నారు. వాటిని సాధారణంగా పట్టణ శివార్లలో నిల్వ చేయాల్సి ఉంటుంది. ఇందుకు ప్రభుత్వ అనుమతులు అవసరం.  చిత్తూరు పట్టణంలోని పెద్ద హరిజనవాడ, మురుకంబట్టిలలో టపాకాయల తయారీ కేంద్రాలు ఉన్నాయి. చిత్తూరులో తయారయ్యే చిత్తూరు ఔట్లు చాలా ప్రసిద్ధి. ఇవి భారీ శబ్దంతో ప్రేలుతాయి. కావున ప్రజలు చిత్తూరు ఔట్ల విషయంలో ఆసక్తిని చూపిస్తారు.  చిత్తూరులో చిత్తూరు ఔట్ల  తయారీ పరిశ్రమ నడుస్తోంది. టపాసులు తయారీకి కాలుష్య నియంత్రణ మండలి, పోలీస్, రెవెన్యూ,అగ్నిమాపక  శాఖల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే పేలుడు పదార్థాల చట్టం 198 ప్రకారం నిర్దిష్ట ప్రమాణాలకు లోపటి వీటిని తయారు చేయాలి. జనావాసాల మధ్య టపాసులు తయారు చేయకూడదు. పట్టణ శివారులలో ప్రత్యేకంగా వీటిని తయారు చేయాల్సి ఉంటుంది. అయితే వీటి విషయంలో నిఘా కొరవడడం, అధికారుల అవినీతి కారణంగా ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా టపాకాయల తయారీ కేంద్రాలు వెలుస్తున్నాయి.  ప్రమాదం జరిగితే తప్ప అవి వెలుగును చూడడం లేదు. అలాగే టపాసుల నిల్వ కూడా జనావాసాలలో విచ్చలవిడిగా చేస్తున్నారు. చిత్తూరు బజారు వీధిలో చాలా దుకాణాలలో టపాకాయలు లభిస్తాయి. వీటికి అనుమతి లేకున్నా, టపాకాయలను అనధికారంగా నిల్వ చేస్తున్నారు. చావులు, దేవుళ్ళ ఉత్సవాలు తదితర సమయాలలో టపాకాయలు, బాణసంచాలో భారీగా వినియోగిస్తారు. ఇదే అదునుగా వ్యాపారస్తులు వాటి అధిక మొత్తాలకు  అమ్ముకొని సొమ్ము తీసుకుంటున్నారు. ఇవి జనావాసంలో ఉండడం కారణంగా తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. పోలీసులు నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే కొన్ని సందర్భాలలో పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా అప్పుడప్పుడు పలమనేరు లాంటి ప్రమాదాలు  జరుగుతున్నాయి. ప్రమాదం జరిగినపుడు అధికారులు హడావిడి చేస్తారు. తరువాత షరా మాములే. బాణాసంచా తయారీ , విక్రయ కేంద్రాల నిర్వహణ నిబంధనల ప్రకారం నడవాల్సి ఉంటుంది. దేశంలో బాణాసంచా తయారీకి తమిళనాడు పెట్టింది పేరు. శివకాశీలోనే దేశీయంగా ఉత్పత్తి అయ్యే బాణాసంచాలో అత్యధిక భాగం తయారవుతుంది. ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల్లో కూడా ఈ యూనిట్లున్నాయి. అత్యధిక సమయాల్లో అనుమతి లేకుండానే బాణాసంచా తయారీ కోసం ప్రయత్నించడం ప్రమాదాలకు కారణమవుతుంది. లైసెన్స్ తీసుకున్న యూనిట్లలో కూడా ప్రమాణాలకు విరుద్ధంగా పరిమితికి మించి ఉత్పత్తి కోసం చేసే యత్నాల్లో నిబంధనలు అతిక్రమించడం మరో కారణం. "బాణాసంచా తయారీలో నిబంధనలను పాటించకుండా, లాభాలు అర్జింజడమే ప్రధానంగా వ్యవహరించడం ఎక్కువ ప్రమాదాలకు కారణం. వాటిని నియంత్రించాలి. అధికార యంత్రాంగం ఈ విషయంలో అలసత్వం ప్రదర్శిస్తోంది. భారీ పేలుడు సంభవించేందుకు ఆస్కారమున్న పదార్థాలను ప్రత్యేకంగా నిల్వ ఉంచాలి. కానీ అందుకు విరుద్ధంగా భద్రత లేని చోట్ల అన్ని రకాల బాణాసంచాని కలిపి ఉంచుతారు. అక్కడ పనిచేసే వారి కోసం ప్రత్యేక రక్షణ ఏర్పాట్లుండాలి. ప్రమాదాలు జరిగితే వెంటనే నియంత్రించేందుకు వారికి అవగాహన కల్పించాలి. అలాంటి ఏర్పాట్లు కూడా ఉండాలి. ఇవేమీ లేకపోవడం ఎక్కువ ప్రమాదాలకు కారణం"అని ఒక పోలీస్ అధికారి వ్యాఖ్యానించారు. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఆశించిన స్థాయిలో ఉండకపోవడం ఓ కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. దీపావళి సమయంలో కొంత ప్రయత్నం చేసినా ఆ తర్వాత యంత్రాంగం ఈ విషయంలో శ్రద్ధ పెట్టకపోవడం తయారీదారులకు ఇష్టారాజ్యంగా మారుతుందని ఆయన  అన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *