ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట
జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో వేరువేరుగా గ్రీవెన్స్
మండల స్థాయిలో వినతుల స్వీకరణకు ప్రత్యేక అధికారులు
నియోజకవర్గస్థాయిలో వినతుల పరిష్కారానికి ప్రత్యేక అధికారులు
భవిష్యత్తులో నియోజకవర్గ ఎమ్మెల్యే, జిల్లా మంత్రి ఆధ్వర్యంలో వినతుల స్వీకరణ
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు
కూటమి ప్రభుత్వం ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఇదివరకు ఉన్న గ్రీవెన్స్ సెల్ ను ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికగా పేరును మార్పు చేసింది. ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ స్వయంగా ఫిర్యాదుదారుల నుండి వినతులను స్వీకరిస్తున్నారు. అలాగే జిల్లా ఎస్పీ కూడా తన కార్యాలయంలో ఫిర్యాదులను స్వికరిస్తున్నారు. జిల్లా కేంద్రానికి ఫిర్యడుదారులు వెల్లువెత్తడంతో మండల స్థాయిలోనే ఫిర్యాదులను పరిష్కరించడానికి జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు ప్రతి మండలానికి ఒక జిల్లా స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించారు. ప్రతి సోమవారం వీరు ఆ మండలంలో ఉంటూ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తారు. అలాగే ప్రతి నియోజకవర్గానికి ఒక సీనియర్ జిల్లా అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించారు. ఆ సీనియర్ అధికారి నియోజకవర్గ కేంద్రంలో సోమవారం ప్రజల నుండి వినతులను స్వీకరిస్తారు. భవిష్యత్తులో నియోజకవర్గ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కూడా వినతులను స్వీకరించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే జిల్లా మంత్రి కూడా జిల్లాలో వినతులను స్వీకరించే విధంగా చర్యలు తీసుకోనున్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా ఫిర్యాదులను స్వీకరించడానికి ఉండవల్లిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారానికి ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల నుంచి ఫిర్యాదులను సేకరిస్తున్నారు. అలాగే ప్రతిరోజు ఎవరో ఒక మంత్రి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉండి ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. అదేవిధంగా జనసేన పార్టీ కార్యాలయంలో కూడా ఆ పార్టీ నేతలు ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి, పరిష్కారానికి ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. ప్రజలు ఫిర్యాదు చేయడానికి రాజధానికి వ్యయప్రయాసలకు ఓర్చి వెళ్తున్నారు. వారిని అదుపు చేయడం కష్టతరమవుతుంది. కావున ప్రజా ఫిర్యాదులను జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో స్వీకరించాలని, వాటి పరిష్కారానికి ఎక్కడకక్కడే ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ప్రతివారం ప్రజల నుండి వినతులను స్వీకరిస్తున్నారు. జిల్లా కేంద్రానికి కూడా భారీ ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. కావున ఫిర్యాదులను సరళతరం చేయడానికి నియోజకవర్గ, మండల స్థాయిలలో ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ నిర్ణయించారు. ఇందుకోసం 31 మండలాలకు, చిత్తూరు, కుప్పం, నగరి, పలమనేరు, పుంగనూరు మున్సిపాలిటీలకు జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. మీరు ప్రతి సోమవారం నిర్ణీత కేంద్రంలో ఉంటూ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తారు.
నియోజకవర్గస్థాయిలో ప్రత్యేక అధికారులు
ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించడానికి నియోజకవర్గ స్థాయిలో ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని జిల్లా కలెక్టర్ నియమించారు. జిల్లాలోని సీనియర్ జిల్లా అధికారులను నియోజకవర్గం ప్రత్యేక అధికారులుగా నియమించారు. పలమనేరు నియోజకవర్గానికి జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ చంద్రశేఖర్, నగరికి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ, పుంగునూరుకు ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డిని, గంగాధర నెల్లూరుకు సర్వ శిక్ష అభియాన్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ వెంకటరమణారెడ్డిని ప్రత్యేక అధికారులుగా నియమించారు. కుప్పం నియోజకవర్గానికి జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రబ్బానీ భాష, పూతలపట్టు నియోజకవర్గం బీసీ కార్పొరేషన్ ఇ డి శ్రీదేవిని, చిత్తూరు నియోజకవర్గానికి జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి చిన్నారెడ్డిని ప్రత్యేక అధికారులుగా నియమించారు. వీరు ప్రతి సోమవారం ఆ నియోజకవర్గ కేంద్రాలలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. ప్రజల నుంచి ఫిర్యాదులను సేకరిస్తారు. ప్రజలు వ్యయ ప్రయాసలకు వచ్చి జిల్లా కేంద్రానికి వచ్చి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదులు ఇచ్చే అవసరం లేకుండా నియోజకవర్గ, మండల స్థాయిలోని ఆ సమస్యలను తెలుసుకుని పరిష్కరించడానికి జిల్లా కలెక్టర్ ఏర్పాట్లు చేశారు. భవిష్యత్తులో నియోజకవర్గస్థాయిలో జిల్లా స్థానిక శాసనసభ్యుల ఆధ్వర్యంలో కూడా వినతులను స్వీకరించడానికి ఏర్పాటు చేస్తున్నారు. అలాగే జిల్లా మంత్రి లేక జిల్లా ఇన్చార్జి మంత్రి ఆధ్వర్యంలో కూడా వినతులను స్వీకరించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలోనే శాసనసభ్యులు, మంత్రులు కూడా ప్రజలను వినతులను స్వీకరించి, వాటి పరిష్కారానికి కృషి చేయనున్నారు.