16, ఆగస్టు 2024, శుక్రవారం

పశువులకు, గొర్రెలకు, నాటు కోళ్లకు సబ్సిడీతో షెడ్ల మంజూరు

252 మెట్రిక్ టన్నుల జొన్న, మొక్కజొన్నలు పంపిణికి సిద్దం

అవసరం అయిన రైతులకు పాడి ఆవులు 

250 టన్నుల దాణామృతం పంపిణి

జిల్లాలో రోజుకు 11 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి

రేపు నెల నుండి అఖిల భరత పసుగణన  ప్రారంభం 

"ప్రభ న్యూస్ బ్యురో"తో పశుసంవర్థక శాఖ జె డి  ప్రభాకర్ 


ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.

పశువులకు, గొర్రెలకు, నాటు కోళ్లకు సబ్సిడీతో షెడ్లను మంజూరు చేస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు ఎం. ప్రభాకర్ వెల్లడించారు. మంగళవారం ఆయన చిత్తూరులో "ప్రభ న్యూస్ బ్యూరో" తో మాట్లాడుతూ జిల్లాలో  252 మెట్రిక్ టన్నుల జొన్న, మొక్కజొన్నలు పంపిణికి సిద్దంగా ఉన్నాయన్నారు.  250 టన్నుల దాణామృతం పంపిణి చేశామని, 1,200 చాప్ కాట్టర్లను సబ్సిడీ మీద అందచేశామని వివరించారు. జిల్లా సెప్టెంబర్ నెల నుండి అఖిల భారత పశు గణన ప్రారంభం అవుతుందన్నారు. జిల్లాలో పాడి ఆవులు అవసరం అయిన రైతులను గుర్తించి, తక్కువ వడ్డికి బ్యాంకు రుణాలను అందచేస్తామని చెప్పారు. గుడ్లు, పాల ఉత్పత్తిలో చిత్తూరు జిల్లా అగ్రస్థానంలో ఉందన్నారు.


 జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా పశువులకు, గొర్రెలకు, నాటు కోళ్లకు సబ్సిడీతో షెడ్లను మంజూరు చేస్తున్నట్లు జాయింట్ డైరెక్టర్ ప్రభాకర్ తెలిపారు. ఈ పథకం కింద జిల్లాకు 875 యూనిట్లు మంజూరయ్యాయని అన్నారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, విడోలకు, వికలాంగులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది దరఖాస్తులను స్వీకరిస్తున్నారని, షెడ్లు త్వరలోనే మంజూరు చేస్తామన్నారు. ఈ పథకం కింద ఆవుల షెడ్లకు 90 శాతం, గొర్రెలు, నాటు కోళ్ళకు 75 శాతం  సబ్సిడీ ఉంటుందని, మిగిలినది లబ్ధిదారుని వాటాగా పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఈ పథకం కింద రెండు, నాలుగు, ఆరు ఆవులు ఉన్న పాడి రైతులకు,  20 పైన గొర్రెలు ఉన్నవారికి, వందపైన నాటు కోళ్లు ఉన్నవారికి షెడ్లను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. రెండు ఆవులు ఉన్న పాడి రైతులకు 1.30 లక్షలు,   నాలుగు ఆవులు ఉన్న పాడి రైతులకు 1.85 లక్షలు, ఆరు ఆవులు ఉన్న రైతులకు 2.30 లక్షల రూపాయలు యూనిట్ ధరగా నిర్ణయించడం జరిగిందన్నారు. ఇందులో 90 శాతం సబ్సిడీ ఇజీఎస్ ద్వారా లభిస్తుందని వివరించారు. 20 గొర్రెలు ఉన్నవారికి 1.3 లక్షలు, 50 గొర్రెలు ఉన్నవారికి 2.30 లక్షల రూపాయలు యూనిట్ కాస్ట్ గా నిర్ణయించామని, వీరికి 75% సబ్సిడీ ఇస్తామన్నారు. అలాగే 100 నాటు కోళ్లు ఉంటే 87 వేల రూపాయలు, 200  ఉంటే 1.32 లక్షల రూపాయలు యూనిట్ ధరగాగా నిర్ణయించామని వివరించారు. జిల్లాలోని ఆవులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేయడం జరిగిందని, అలాగే పేయ దూడలకు వ్యాక్సిన్ వేశామన్నారు. మేకలు, గొర్రెలకు నట్టల నివారణ మందును, డి వార్మింగ్ మందును సరఫరా చేసామని తెలిపారు. జిల్లాలో 252 మెట్రిక్ టన్నుల జొన్న, మొక్కజొన్నలను పాడి రైతులకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ మొత్తాన్ని పశువైద్యశాలల్లో నిల్వ చేశామని అవసరమైన రైతులు తీసుకోవచ్చన్నారు. ఇందుకు 75% సబ్సిడీ లభిస్తుందని, ఒక్కొక్క రైతు 20 కేజీలకు మించకుండా జొన్న, మొక్కజొన్నలను తీసుకోవచ్చని తెలిపారు. చాప్ కట్టర్స్ పసికం కింద 40 శాతం సబ్సిడీతో 1,200  మందికి గత సంవత్సరం అందజేశామన్నారు. దాణామృతం పథకం కింద 40 శాతం ఫిడ్డు, 60% గడ్డిని జిల్లాలో 250 టన్నులను సబ్సిడీ మీద సరఫరా చేశామని తెలిపారు. అఖిలభారత పశుగణన కార్యక్రమము సెప్టెంబర్ నెల నుంచి 4 నెలల పాటు జరుగుతుందన్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు జిల్లాలో చేయడం జరిగిందని జాయింట్ డైరెక్టర్ తెలిపారు. చిత్తూరు జిల్లాలో 5.4 లక్షల ఆవులు, 4,900 బర్రెలు, 52 లక్షల గొర్రెలు, 22 లక్షల మేకలు ఉన్నాయని వివరించారు. జిల్లాలో ఆవులు, బర్రెల ద్వారా  రోజుకు 11 లక్షలు లీటర్ల పాల దిగుబడి అవుతుందన్నారు. జిల్లాకు నిర్ణయించిన లక్ష్యం  మేరకు సంవత్సరానికి 11 లక్షల మెట్రిక్ టన్నుల పాలు, 66,000  మెట్రిక్ టన్నుల మాంసం, 11,900 కోట్ల కోడిగుడ్లు ఉత్పత్తి అవుతున్నాయని వివరించారు. జిల్లాలో పశువుల ఆరోగ్యాన్ని కాపాడడానికి ఒక వెటర్నరీ పాలీ క్లినిక్, 14 ఏరియా వెటర్నరీ ఆసుపత్రులు, ఆరు నియోజకవర్గస్థాయి వ్యాధి నిర్ధారణ కేంద్రాలు, 68 వెటర్నరీ డిస్పెన్సరీలు, 77 రూలర్ లైవ్ స్టాక్ యూనిట్లు, 496 రైతు సేవ కేంద్రాలు తమ ఆధ్వర్యంలో నడుస్తున్నాయని పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు ఎం. ప్రభాకర్ వివరించారు. 

పో రై గంగ 1 పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు ఎం. ప్రభాకర్

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *