జిల్లాలో జరిగిన ఇసుక అక్రమాలపై సిఐడి విచారణ ప్రారంభం
గనులు, భూగర్భ శాఖ అధికారుల నుండి కీలక దస్త్రాలు స్వాదీనం
ఇసుకాసురులు, వారికీ సహకరించిన అధికారుల్లో మొదలైన దడ
జిల్లా అధికారులు గతంలో ఇచ్చిన నివేదికల మీద కూడా దృష్టి
జిల్లాలో ఇంకా కొనసాగుతున్న ఇసుక అక్రమ రవాణా
భారీగా కేసులను నమోదుచేసిన పోలీసు, రెవిన్యూ అధికారులు
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
చిత్తూరు జిల్లాలో జరిగిన ఇసుక అక్రమలపైన సిఐడి విచారణను ప్రారంభించింది. జిల్లా గనులు, భూగర్భ శాఖ అధికరులనుండి సంబందిత ఫైళ్ళను శనివారం సిఐడి అధికారులు స్వాదినం చేసుకున్నారు. ఇసుక రీచ్ లు, కాంట్రాక్టర్ల వివరాలను అధికారులు సిఐడి అధికారులకు అందచేశారు. ఈ దస్త్రాల ఆధారంగా సిఐడి అధికారులు విచారణను ప్రారంభించారు. తొలుత దస్త్రాలను పరిశీలించి, తరువాత క్షేత్ర స్థాయిలో కూడా పర్యటించి, నిజానిజాలను నిగ్గు తేల్చనున్నారు. దీంతో జిల్లాలోని ఇసుకాసురులలో, వారికీ సహకరించిన అధికారులలో దడ ప్రారంభం అయ్యింది. ఈ కేసులో పలువురి వైసిపి నాయకుల బండారం బయట పడనుంది. అలాగే వారికీ సహకరించిన అధికారులు, క్షేత్ర సిబ్బందిపై కూడా వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో ఇంకా కూడా యదేచ్చగా ఇసుక అక్రమ రవాణా జరుతున్నట్లు తెలుస్తుంది. పోలీసులు, రెవిన్యూ అధికారులు నమోదుచేసిన కేసులే ఇందుకు ఉదాహరణ.
చిత్తూరు జిల్లాలో వాగులు, వంకలు విస్తారంగా ఉన్నాయి. ఇందులో ఇసుక భారీగా ఉంది. ఇదే అదునుగా వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత ఇసుక అక్రమ రవాణాకు అడ్డూ, అదుపూ లేకుండా పోతోంది. ఇసుక మాఫియా దారులు రోజురోజుకు పెరిగిపోతూ యధేచ్ఛగా ఇసుకను అక్రమ రవాణా చేశారు. పాలారు, బాహుదా, అరణియారు, అరుణా కాళంగి, రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ప్రవహించే జిల్లాలోని నదులు. ఇవే అప్పుడు కొందరు అంతరాష్ట్ర చీకటి వ్యాపారులకు వనరులు. ఈ నదులు, ఏరులు, వాగుల్లో ఇసుక తవ్వేస్తున్న వ్యాపారులు.. అర్థరాత్రుల్లో అడ్డదారుల్లో సరిహద్దులు దాతించారు. పుత్తూరు, చుట్టుపక్కల మండలాల నుంచే రోజుకు 200 లారీల ఇసుక పొరుగు రాష్ట్రానికి తరలివెళ్ళడం తీవ్రతకు అద్దం పడుతోంది. కుప్పం ప్రాంతం నుంచి బెంగుళూరుకు సరఫరా చేస్తున్నారు. అక్రమార్కులు పగటి పూట ఇక్కడి నదుల్లో తవ్వి మారుమూల ప్రాంతాల్లో కుప్పలుగా పోసి రాత్రి వేళల్లో సరిహద్దులు దాతించారు. అనుమతి లేకుండా కర్ణాటకకు ఇసుకను తరలిస్తుండగా పలమనేరు వాణిజ్య పన్నుల శాఖ తనిఖీ కేంద్రం వద్ద పట్టుకున్నారు. 1.50 లక్షల రూపాయలు జరిమానా విధించారు. మళ్ళీ ఇదే తరహాలో మరో వాహనంలో ఎలాంటి అనుమతి లేకుండా ఇసుక తరలిపోతుంటే పట్టుకున్న వాణిజ్య పన్నుల శాఖ సిబ్బంది రూ.50 వేలు అనధికారికంగా వసూలు చేసి వాహనాన్ని సరిహద్దు దాటించారు. అసలు ఆ వాహనాన్ని పట్టుకున్నట్లు ఎక్కడా రికార్డుల్లో నమోదు చేయలేదు. నిత్యం ముందస్తు ఒప్పందంతో అక్కడి సిబ్బంది సూచించిన సమయాల్లో ఇసుక వాహనాలు ఎలాంటి అనుమతులు లేకుండా యధేచ్చగా సరిహద్దు దాటిపోయాయి. ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే. నిత్యం ఇలాంటి అక్రమాలు తంతు యధేచ్ఛగా సాగుతోంది. నిబధనల ప్రకారం నదుల్లో యంత్రాలతో తవ్వరాదు. ప్రతి రేవుకు పర్యావరణ అనుమతి తప్పనిసరి. యంత్రాలతో తవ్వినా సరిహద్దులు దాటించినా అధిక ధరలకు విక్రయించినా చర్యలు తప్పవు. భూగర్భ జలాలకు, పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా అనుమతించిన రేవుల్లో మాత్రమే ఇసుకను తవ్వుకోవాలి అంటూ ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ తీసుకువచ్చిన సందర్భంలో చేసిన హెచ్చరిక. కానీ ఈ నిబంధన అదే ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధుల అండతో తాటాకు చప్పుడుగా మిగిలింది. తూర్పు ప్రాంతానికి ఒక ఎమ్మెల్యే ఇసుక రేవుల మీదే రూ.కోట్లకు పడగలెత్తడం గమనార్హం. కూలీలతో మాత్రమే తవ్వుకోవాలన్నా నిబంధనలున్నా, యంత్రాలతో తవ్వి ప్రకృతిని ధ్వంసం చేస్తున్నారు. సరిహద్దులు దాటించడం ట్రాక్టర్లు, బండ్లలో అయితే కుదరదు కాబట్టి తక్కువ సమయంలో భారీ లారీలను నింపేందుకు ప్లొక్లైయిన్ వాడుతున్నారు. జిల్లాలో చిన్నా పెద్దా కలిపి మొత్తం 114 ఇసుక రేవులను ప్రభుత్వం గుర్తించి అనధికారికంగా తవ్వకాలకు అనుమతినిచ్చింది. వాటిలో మాత్రమే స్థానిక అవసరాలకు ఉచితంగా తప్పుకోవచ్చు. ఒక మీటరుకు మించి తవ్వకూడదన్న నిబంధనలను పక్కనబెట్టి ఉచితమనే ప్రకటనను అవకాశంగా చేసుకుని ఎక్కడ పడితే అక్కడ త్రవ్వేస్తున్నారు. కొందరు ఇసుకమేటలకు రహదారులు ఏర్పాటు చేసుకుని విచ్చలవిడిగా తవ్వుతున్నారు. ట్రాక్టర్ ఇసుక 6 వేల రూపాయలు, టిప్పర్‌కు రూ.24 వేలకు పైగా విక్రయిస్తూ సొమ్ము చేసుకున్నారు. ఇసుక అక్రమ రవాణాను అధికార యంత్రాంగం తమకేమీ సంబంధంలేదనే రీతిలో వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. పలువురు జిల్లా అధికారులు కూడా ఇందుకు సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ వత్తిళ్ళ కారణంగా కొందరు మౌనంగా అక్రమాలకు సహకరించారు. ఇసుక అక్రమ రవాణా విషయంలో సుప్రింకోర్టు జిల్లా అధికారుల నుండి నివేదికను కోరింది. కొందరు అధికారులు సుప్రీంకోర్టు కూడా తప్పుడు నివేదికలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రకృతి వనరులను కాపాడల్చిన అధికారులే అక్రమార్కులకు సహకరించడంతో వారి ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. నదులు, వాగులు, వంకల్లో రాత్రి పూట యంత్రాలతో ఇసుకను తవ్వి వారికీ అనుకూలమైన ప్రాంతాలలో నిల్వలు చేసుకున్నారు. ఇలాంటి భారీ డంపులు చిత్తూరు జిల్లాలో ఇప్పటికి నాలుగు బయటపడ్డాయి. రహస్య ప్రాంతాలలో ఇంకా ఉన్నట్లు తెలుస్తుంది. రెండు రోజుల కిందట జరిగిన విలేకరుల సమావేశంలో కొత్తగా ఒక డంపును కనుగొన్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడించారు. ఇసుక అక్రమ రవాణా కూడా ఇంకా జరుగుతోంది. రెవిన్యూ అధికారులు 74 ట్రాక్టర్ లను సిజ్ చేశారు. పోలీసులు 14 కేసులను నమోదుచేసి, 7 లారీలు, 2 జేసిబిలను సిజ్ చేశారు. ఈ విషయాలను పరిశిలేస్తే, జిల్లాలో ఇంకా అక్రమ రవాణా యదేచ్చగా జారుతోంది. అక్రమార్కులు ఇసుకను ఇతర రాష్ట్రాలకు యదేచ్చగా అమ్ముకుంటున్నారు.