28, ఆగస్టు 2024, బుధవారం

టిడిపి నాయకులు, కార్యకర్తల్లో కనిపించని జోష్

 నిరాశా, నిస్పృహలో పార్టీ క్యాడర్ 

జిల్లాకు మంత్రీ లేదు, ఇంచార్జి మంత్రీ లేదు 

తమ భాధలు ఎవరికీ చెప్పుకోవాలో తెలియని కార్యకర్తలు 

నామినేటెడ్ పదవుల ఆలస్యంపై అసహనం 

జిల్లాకు దిక్కెవరు అంటున్న కార్యకర్తలు 


ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.

కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన సంతోషం చిత్తూరు జిల్లా కార్యకర్తల్లో  ఏమాత్రం కనిపించడం లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కార్యకర్తలు నిరాశ నిస్పృహలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా టిడిపి కార్యకర్తలు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోషియల్ మీడియాలో తమ బాధలు వ్యక్తం చేస్తున్నారు. గత రెండు రోజుల నుంచి ' సమస్యల సుడిగుండంలో తెలుగుదేశం పార్టీ'  అంటూ ఒక మెసేజ్ చక్కర్లు కొడుతోంది. టిడిపి ఎమ్మెల్యేలు, బడా నాయకులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తున్నారని అవేదన వ్యక్తం చేస్తున్నారు. 


జిల్లాకు మంత్రి లేరు, ఇప్పటి వరకు ఇంచార్జి మంత్రిని నియమించలేదు. జిల్లాను సమన్యాయం చేసే నాయకుడు కనిపించడం లేదు. ఉన్న నలుగురు ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేదంటున్నారు. జిల్లా లోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలలో పుంగనూరు నుంచి మాజీ మంత్రి  వైసిపి నేత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఎన్నికయ్యారు. కుప్పం నుంచి ఎన్నికైన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు.మిగిలిన ఐదు నియోజక వర్గాల్లో టిడిపి ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే అందరిని సమన్వయ పరిచే పలమైన నాయకుడు ఎవరూ కనిపించడం లేదు. జిల్లా స్థాయి పార్టీ సమావేశాలు జరగడం లేదని కార్యకర్తలు వాపోతున్నారు. గత వైసిపి ప్రభుత్వంలో అనేక బాధలు పడిన కార్యకర్తలు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోలేక సతమతం అవుతున్నారు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు కూడా చిన్న చిన్న పనులు చేసుకోలేక పోతున్నారు. తమకు తెలిసిన ఉద్యోగులను బదిలీ కూడా చేయించలేక పోతున్నారు. విద్యుత్ శాఖలో పలు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అందులో పార్టీ టైమ్ ఉద్యోగాలు కూడా ఇప్పించుకోలేక పోతున్నామని మాజీ జడ్పీటీసీ ఒకరు వాపోయారు. వైసిపి నేతలు చేసిన భూ కబ్జాల మీద ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం పట్ల అసహమ వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, కె నారాయణ స్వామి, ఆర్ కె రోజా  బాధితులను ఆదుకునే నాథుడే కనిపించడం లేదని రాష్ట్ర నాయకుడు ఒకరు అన్నారు. ఇదిలా ఉండగా నామినేటెడ్ పదవుల నియామకాల్లో జరుగుతున్న జాప్యం పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు ఎవరు అందుబాటులో లేరని అంటున్నారు. కాగా కొందరు ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాము కీలకమైన బదిలీలను కూడా చెయించలేక పోతున్నామని అంటున్నారు. జిల్లా ఎం ఎల్ ఏ లు బదిలీల విషయంలో చేసిన సిఫార్సులను కొందరు అధికారులు లెక్కచేయడం లేదని సమాచారం. ఇటు నామినేట్ పదవులకు తాము చేసే సిఫార్సులకు విలువ లేదని ఒక ఎమ్మెల్యే కార్యకర్తలతో అన్నట్టు తెలిసింది. జనసేన, బిజెపి కార్యకర్తల్లో అసలు అధికార కూటమిలో ఉన్నామన్న  భావన కూడా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు జిల్లాపై ప్రత్యెక శ్రద్ధ చూపాలని కార్యకర్తలు కోరుతున్నారు. జిల్లాకు బలమైన నాయకత్యాన్ని అందించాలని మనవి చేస్తున్నారు. 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *