21, ఆగస్టు 2024, బుధవారం

నామినేటెడ్ పోస్టుల ప్రకటన మళ్ళి వాయిదా ?

నిరాశలో కూటమి నాయకులు 

వారం, పది రోజుల తర్వాతే ప్రకటన 

దశల వారిగా పోస్టుల ప్రకటన

వైరల్ అవుతున్న పోస్టులో వాస్తవం లేదంటున్న సీనియర్ నేత  


ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు. 

కూటమి నేతలు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న నామినేటెడ్ పదవుల  ప్రకటన మరోసారి వాయిదా పడింది.తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి విశ్వసనీయ సమాచారం మేరకు ఈనెలాఖరులోపు నామినేటెడ్ పోస్టుల భర్తీ జరిగే అవకాశం లేదని తెలిసింది. ఈ విషయాన్నీ ఒక సీనియర్ టిడిపి నేత వెల్లడించారు.  నామినేటెడ్ పోస్టులు భర్తీ అన్ని ఒకేసారి కాకుండా, దశల వారీగా జరిగే అవకాశం ఉందని తెలిపారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ అన్ని ఒకేసారి ప్రకటిస్తే పదవులను ఆశిస్తున్న వారు  అసంతృప్తిని వ్యక్తం చేసే అవకాశం ఉంది. కావున అసంతృప్తులను చల్లార్చాలి అంటే  దశల వారీగా ఊరించి, ఊరించి పదవులను ప్రకటిస్తారని ఆయన విశ్లేషించారు. సోషల్ మీడియాలో ఒక జాబితా కూడా విడుదల అయింది. అందులో పలువురికి చైర్మన్ పోస్టులను ఖరారు చేశారని, నేదో, రేపో  ప్రకటన ఉంటుందని ఉంది. ఆ పోస్టు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అయితే అందులో సగం కూడా వాస్తవం లేదని పార్టీ సీనియర్  నాయకుడు స్పష్టం చేశారు. అవి ఉహాగానాలు మాత్రమేనని, ఒకటి, రెండు నిజం కావచ్చని అభిప్రాయపడ్డారు.


నామినేటెడ్ పదవులపైన తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు గంపేడు ఆశలు పెట్టుకున్నారు. నామినేటెడ్ పోస్టుల ప్రకటన నేడు రేపు ఉంటుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద విపరీతమైన ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఒత్తిడి కారణంగా నామినేటెడ్ పదవులు భర్తీ ఆలస్యం అవుతుందని సమాచారం. ఫలితంగా చంద్రబాబు టిడిపి ముఖ్యనేతలను కూడా కలవడంలేదని సమాచారం. తొలుత బిజెపి, జనసేన కోసం ఎమ్మెల్యే టికెట్లను త్యాగం చేసిన 31 మందికి చైర్మన్ పోస్టులు దక్కనున్నాయని ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో ఒక జాబితా కూడా విడుదల అయింది. అందులో పలువురికి చైర్మన్ పోస్టులను ఇచ్చేశారు. ఒకటి రెండు రోజుల్లో ప్రకటన ఉంటుందని ఊరించారు. ఆ పోస్టు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. దాన్ని చూసిన తెలుగుదేశం పార్టీ నేతలు తమకు పదవులు వచ్చేస్తున్నాయని కొందరు లొట్టలు వేసుకుంటున్నారు. తన పేరు లేదని మరి కొందరు ఆవేదన చెందుతున్నారు. అయితే ఈ విషయమై తెలుగుదేశం పార్టీ ఒక ముఖ్యమైనది మాట్లాడుతూ ప్రస్తుతం వైరల్ అవుతున్న జాబితాలో 50 శాతం కూడా వాస్తవాలు లేవని కొట్టిపారేశారు. ఆ జాబితా మొత్తం కల్పనగా వర్ణించారు. ఆ జాబితా నిజమయ్యే అవకాశాలు ఎంత మాత్రం లేదని స్పష్టం చేశారు. రానున్న కాలంలో ఒక్కొక్క పర్యాయం 10 నుండి 12 మంది పేర్లతో నామినేటెడ్ పోస్టులు జాబితాలో ప్రకటించి అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. పోస్టుల ప్రకటనకు తొలుత శ్రావణ శుక్రవారం మంచి రోజుగా భావించారు. ఆరోజు సాయంకాలం వరకు ఇదిగో అదిగో జాబితా విడుదల అవుతుందని జోరుగా ప్రచారం జరిగింది. మళ్లీ ఈనెలాఖరు వరకు మంచి రోజులు లేకపోవడంతో వారం పది రోజులపాటు ఆశావహులు  ఎదురు చూడాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది. ఒకవేళ జాబితా విడుదలైన డజనుకు మించి పేర్లు ఉండే అవకాశం లేదని తెలుస్తోంది, డజను, అరడజను నామినేటెడ్ పోస్టులతో వరుసగా దశలవారీగా నామినేటెడ్ పోర్టులకు ప్రకటన జరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇలా అయితే,  తెలుగుదేశం పార్టీ నాయకులను అసంతృప్తిని చల్లార్చడానికి అవకాశం ఉందని అధిష్టానం అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది. ఒక పక్క అసంత్రుప్తిలు బహిర్గతం కాకుండా, మరో వైపు పార్టీ గెలుపు కోసం పనిచేసిన, సహకారం అందించిన వారికీ న్యాయం చేయడానికి పధకం ప్రకారం జాబితాలు విడుదల కానున్నాయి. ఏది ఏమైనా నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్న కూటమి నాయకులకు మరికొన్ని రోజులపాటు ఎదురుచూపులు తప్పేటట్లు లేదు.


 చిత్తూరు అసెంబ్లీ నియోజక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సి కె బాబు, మాజీ ఎమ్మెల్యే మనోహర్, మాజీ ఎం ఎల్ సి దొరబాబు  పార్లమెంటు అధ్యక్షుడు సి ఆర్ రాజన్, పార్టీ అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్,  ప్రధాన కార్యదర్శి కోదండయదవ్, కాజూరు బాలాజీ, కటారి హేమలత, వై వి.రాజేశ్వరి, చెరుకూరు వసంత కుమార్, గుదిపలకు చెందిన అరణి బాలాజీ  పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. పూతలపట్టుకు చెందిన రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పుష్పరాజ్ ఇటేవల చంద్రబాబును కలసి వచ్చారు. తవనంపల్లికి చెందిన కోడందయ్య కూడా పదవుల రేస్ లో ఉన్నారు. గుడిపాలకు చెందిన పీటర్, మాజీ ఎం ఎల్ ఏ గాంధీ, పుత్తూరుకు చెందిన గ్యాస్ రవికుమార్  కూడా పదవి ఆశిస్తున్నారు. బిజెపి నుండి జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి, బిసి నేత అట్లూరి శ్రీనివాసులు కూడా రేసులో ఉన్నారు. పలమనేరు నుంచి పెద్దగా పేర్లు వినిపించడం లేదు. కుప్పం నుంచి బిసి వర్గానికి చెందిన మునిరత్నం, రాజశేఖర్ లలో ఒకరికి పదవి తప్పదని అంటున్నారు. పుంగనూరు నియోజక వర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డితో తలబడి ఓడిపోయిన చల్లా రామచంద్రా రెడ్డికి పదవి వచ్చే అవకాశం ఉందని తెలిసింది. జి. డి నెల్లూరు నియోజక వర్గం నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి, రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి భీమినేని చిట్టిబాబు నాయుడు, తెలుగు మహిళ అధ్యక్షురాలు అరుణలకు పదవీ యోగం ఉందంటున్నారు. జనసేన ఇంచార్జి డాక్టర్ పొన్న యుగంధర్ కూడా పదవి రేసులో ఉన్నారు. నగరి నియోజకవర్గంలో మాధవ నాయుడు, పోతుగుంట విజయబాబు పదవులను ఆశిస్తున్నారు. అయితే అక్కడ సిద్ధార్థ విద్యాసంస్థలు అధిపతి అశోక్ రాజుకు బిజెపి కోటాలో పదవి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. విశేషం ఏమంటే, అందరు చైర్మన్ పోస్టులపై దృష్టిని పెట్టారు. ఎం ఎల్ ఏ, ఎంపి సిఫారసు లేఖలను జత చేశారు. తనకు పదవి తప్పదని అందరు నాయకులు ఆత్మస్థైర్యంతో కనిపిస్తున్నారు.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *