19, ఆగస్టు 2024, సోమవారం

తేలని నామినేటెడ్ పదవుల పందారం

అశానిరాశాలతో కుట్టుమిట్టాడుతున్న తెలుగు తమ్ముళ్ళు 

ప్రకటన కోసం వేయి కళ్ళతో ఎదురుచూపులు

 చైర్మన్ గిరిపైనే కూటమి నేతల గురి 

నామినేటెడ్ పోస్టులకు టిడిపి నుండి 23 వేల దరఖాస్తులు..

టిటిడి చైర్మన్, డైరెక్టర్ పోస్టులకు భారీ డిమాండ్ 

ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు. 

కూటమి ప్రభుత్వంలో కీలక సంస్థల చైర్మన్ పదవులపై చిత్తూరు జిల్లా నేతలు గురి పెట్టారు. వరలక్ష్మీ వ్రతం రోజైన శుక్రవారం పదవుల ప్రకటన వెలువడుతుందని కొందరు ఆశించారు. అయితే సాయంత్రానికి అందరూ నిరాశ పడ్డారు. అయితే కనీసం వారం రోజుల్లో 40 పదవులకు నియామకాలు జరగవచ్చని సమాచారం. ఒకటి రెండు రోజుల్లో పదవుల పంపకం గురించి ప్రకటన వెలువడుతుందని కూటమి నేతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియ అంతా ఇప్పటికే కంప్లీట్‌ అయిందని అంటున్నారు. అయితే ఎవరికీ ఏ పదవి అన్నది ఎవరికీ అంతు చిక్కడం లేదు. టిడిపి కేంద్ర కార్యాలయంలో ఉన్నవారికి కూడా సమాచారం లేదని తెలిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదవువుల కోసం వస్తున్న నాయకులను ఎవరిని కలువడం లేదు. ఇప్పటికే ముఖ్యమంత్రి మీద విపరీతమైన వత్తిడి ఉన్నట్లు తెలుస్తుంది. ఈ వత్తిడి కారణంగానే నామినేటెడ్ పోస్టుల ప్రకటన  ఆలస్యం అవుతుందని టిడిపి వర్గాలు అంటున్నాయి.


తొలుత కేబినెట్‌ ర్యాంకు కలిగిన నామినేటెడ్‌ పదవులను భర్తీ చేయాలని నిర్ణయించారు. తర్వాత తక్కిన నామినేటెడ్‌ పదవుల నియామకాలు చేపట్టనున్నారు. అందుకు సంబంధించిన కసరత్తు ఊపందుకుంది. అత్యంత రహస్యంగా నామినేటెడ్‌ పదవుల ఎంపిక జరుపుతున్నారు. పార్టీలో సీనియర్‌ నేతలకు కూడా అంతు చిక్కడం లేదు. ఎవరిని నామినేటెడ్‌ పదవులు వరిస్తాయి అనే దానిని అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. ఈ పదవుల ఎంపిక అంతా సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు, మంత్రి నారా లోకేష్‌ కనుసన్నుల్లో జరుగుతుండటమే ఈ గోప్యత కు కారణంగా ఆ పార్టీ శ్రేణులు చర్చించు కుంటున్నారు. ఎన్నికల సమయంలో కీలకంగా వ్యవహరించిన రాబిన్‌ శర్మ టీమ్‌ను రంగంలోకి దింపారు. లోకేష్‌ మదిలోని నేతల గురించి ఆరా తీస్తున్నారు. ఆ నేతలకు లీక్‌ కాకుండా వారి గురించిన పూర్తి స్థాయి డేటాను ఇప్పటికే సేకరించారు. ఎన్నికల సమయంలో పార్టీ గెలుపు కోసం బాగా కష్టపడి పని చేసిన వారికి ప్రాధాన్యత కల్పించే దిశగా లోకేష్‌ అడుగులు వేస్తున్నారు. ఎలాంటి ఫలితాలు ఆశించకుండా పార్టీకి పని చేస్తున్నారు. లాయల్టీ, సిన్సియారిటీ, హార్డ్‌ వర్క్, వర్క్‌ ప్రోగెస్‌ వంటి పలు అంశాలును ప్రాతిపదికగా చేసుకొని నేతలను ఎంపిక చేయనున్నారు. కష్టపడే వారికే పదవి వచ్చే విధంగా లోకేష్‌ పావులు కదుతున్నారు. పార్టీ కోసం పని చేయకుండా ఎన్నికల సయమంలో కేసులు పెట్టించుకోవడం, ప్రత్యర్థి పార్టీ నేతలను విమర్శించడం వంటి అంశాలను పెద్దగా పరిగణలోకి తీసుకోపోవచ్చనే టాక్‌ అంతర్గతంగా సాగుతోంది. ఎన్నికల్లో కానీ పార్టీ కోసం కానీ వర్క్‌ ప్రోగ్రెస్‌ కలిగిని నేతలకు నామినేటెడ్‌ పదవులు వరించే విధంగా లెక్కలు వేస్తున్నారు. వీటితో పాటుగా కులాలు, ఉప కులాలు వంటి సామాజిక సమీకరణల అంశాలను కూడా పరిగణలోకి తీసుకోనున్నారు. ఎంతో మంది పోటీ పడుతున్న నామినేటెడ్‌ పదవుల నియామకాల్లో ఒక్కో పోస్టుకు ఐదుగురు చొప్పున ఫిల్టర్‌ చేయనున్నారు. ఈ ఐదుగురి లో దీ బెస్ట్ అనుకున్న వారికి పదవి కట్టబెట్టాలని లోకేష్‌ ఆలోచనలు చేస్తున్నారు. మాదిగ కార్పొరేషన్‌కు తిరువూరు నియోజక వర్గానికి చెందిన ఏ కొండూరు మాజీ ఎంపీపీ వాసం మునియ్య రేస్‌లో అగ్ర స్థానంలో ఉన్నట్లు తెలిసింది.


టీటీడీ చైర్మన్‌కు తీవ్ర పోటీ


అన్నింటి కంటే టీటీడీ చైర్మన్‌ పోస్టుకు పోటీ నెలకొంది. జనసేన, బీజేపీ నేతలు కూడా దీనికోసం పోటీ పడుతున్నారు. అయితే టీవీ-5 అధినేత బిఆర్‌ నాయుడుకు ఖరారు కావచ్చే టాక్‌ వినిపిస్తోంది. మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ పోస్టుకు తీవ్ర పోటీ నెలకొంది. చంద్రగిరి ఎమ్మెల్యే పులిపర్తి నాని సతీమణి సుధారెడ్డికి ఖరారయ్యే అవకాశాలు ఉన్నట్లు అత్యంత సన్నిహితుల్లో టాక్‌ నడుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో తనకే కావాలని ఆమె పట్టుబడుతున్నట్లు సమాచారం. అయితే టీడీపీతో పాటు కూటమి పార్టీలైన జనసేనకు, బీజేపీకి ఎన్ని పదవులు కేటాయిస్తారనే దానిపైన ఆ పార్టీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టీడీపీకి 70 శాతం, జనసేనకు 25 శాతం, బీజేపీకి 5 శాతం చొప్పున నామినేటెడ్‌ పదవులు ఇచ్చే విధంగా ఆ పార్టీ పెద్దలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు చర్చ సాగుతోంది. ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన పుట్టి పెరిగిన నారావారిపల్లి తిరుపతి జిల్లాలో ఉంది. దీనితో ఆయన, ఆయన కుటుంబ సభ్యులతో ఉన్న బంధుత్వం, సాన్నిహిత్యం ఆధారంగా నామినేటెడ్ పదవులు దక్కించుకోవాలని పలువురు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లను కలవడం వీలుపడక పోవడంతో పార్టీలో కీలకనేతల చుట్టూ తిరుగుతున్నారు. గురువారం జండా ఎగురవేయడానికి చిత్తూరు వచ్చిన ఆరోగ్యశాఖ మంత్రి శత్యకుమార్ యాదవ్ (బిజెపి) ను పలువురు కలసి తమ పదవుల కోసం సిఫారసు చేయాలని కోరారు. అలాగే కుప్పం ఇంచార్జిగా ఉన్న ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ ను పలువురు కలిశారు. ఇటీవల కుప్పం వచ్చిన నారా భువనేశ్వరిని కొందరు కలిశారు. అలాగే తిరుపతి వచ్చిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని పలువురు నేతలు కలసి పదవులు కోరారు. అయితే పార్టీకి చేసిన సేవలు ఆధారంగానే పదవుల పంపిణీ ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవి చేపట్టాలని కొందరు పట్టుదలగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పెనుమూరు మండలం పూనేపల్లెకు చెందిన  టీవీ 5 చైర్మన్ బి ఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవి కోసం పట్టు పడుతున్నారు. ఆయన చానల్ పార్టీ కోసం పనిచేసింది. ఆయనకు బలకృష్ణతో బంధుత్వం కూడా ఉంది. అలాగే అదే మండలానికి చెందిన పార్లమెంటు తెలుగు మహిళ అధ్యక్షురాలు అరుణ భువనేశ్వరి ద్వారా రాష్ట్ర పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. పాలసముద్రం మండలానికి చెందిన రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి భీమినేని చిట్టిబాబు నాయుడు తనకు రాష్ట్ర స్థాయి పదవి తప్పదన్న ధీమాతో ఉన్నారు. జి డి నెల్లూరు  జనసేన ఇంచార్జి డాక్టర్ పొన్న యుగంధర్ కూడా పదవి రేసులో ఉన్నారు. చిత్తూరుకు చెందిన మాజీ రాజ్యసభ సభ్యురాలు ఎన్ పి దుర్గా రామకృష్ణ(బిజెపి) డిల్లీ స్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా మాజీ ఎమ్మెల్యేలు సి.కె బాబు, మనోహర్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు తదితరులు పదవులు ఆశిస్తున్నారు. పుంగనూరు నియోజక వర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డితో తలపడి ఓడిపోయిన చల్లా రామచంద్రా రెడ్డి ప్రాధాన్యత గల రాష్ట్ర స్థాయి పదవి కోరుకుంటున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులిపర్తి నాని భార్య సుధా రెడ్డి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవి ఆశిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర అధికార ప్రతినిధులు డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి, డాక్టర్ సప్తగిరి ప్రసాద్, సురేంద్ర నాయుడు రాష్ట్ర స్థాయి పదవి ఆశిస్తున్నారు. రాజాకీయ కేంద్రమైన తిరుపతిలో ఎక్కువ మంది పదవుల వేటలో ఉన్నారు. కీలకమైన తుడ చైర్మన్ పదవి రాష్ట్ర కార్యదర్శి సూరా సుధాకర్ రెడ్డికి దక్కవచ్చని భావిస్తున్నారు. అయితే దీని కోసం రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి మబ్బు దేవ నారాయణ రెడ్డి, బిజెపి, జనసేన నేతలు కొందరు ప్రయత్నం చేస్తున్నారు. తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడు జి నరసింహ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు సుగుణమ్మ, మోహన్ కూడా రాష్ట్ర స్థాయి పదవి ఆశిస్తున్నారు.గత ఎన్నికల్లో టిక్కెట్ కోసం ప్రయత్నించి విఫలం అయిన మాజీ ఎమ్మెల్సీ ఎస్ సి వి నాయుడు, మదనపల్లి ఇంచార్జి దొమ్మలపాటి రమేష్, మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ తదితరులు రాష్ట్ర స్థాయి పదవులు ఆశిస్తున్నారు.

నామినేటెడ్ పోస్టులకు టీడీపి నుంచి 23 వేల దరఖాస్తులు..?

వివిధ ప్రభుత్వ శాఖల్లో నామినేటెడ్ పదవుల కోసం సుమారు 23 వేలకుపైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. వీరిలో దాదాపు 2,500 మందికి పదవులు దక్కే అవకాశం ఉంది. కార్యకర్తల్లో అసంతృప్తి రగలకుండా ఈ వారంలోనే తొలి జాబితా ప్రకటించనున్నట్లు సమాచారం.  పొత్తులో భాగంగా సీట్లు కోల్పోయిన 31 మంది నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, అధ్యక్షులుగా, ఇన్ఛార్జిలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. పార్టీకి ఆర్థికంగా అండగా నిలిచినవారికి కూడా పదవులు దక్కనున్నాయి.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *