జిల్లాలో కొత్తగా 22 పాల సేకరణ కేంద్రాల ఏర్పాటు
20 శాతం పాల దిగుబడి పెంపునకు సమగ్ర ప్రణాళికలు
ఉచిత పశు వైద్య శిబిరాలు సూపర్ సక్సెస్
ఆంధ్రప్రభతో పశుసంవర్ధక శాఖ జెడి ఉమామహేశ్వరి
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు)
జిల్లాలో ప్రస్తుతం పాల ఉత్పత్తిదారుల 56,390 మంది ఉన్నారనీ, రోజుకు సగటున 1.8 లక్షల లీటర్ల పాలు సేకరణ జరుగుతోందని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ దర్శిగుంట ఉమామహేశ్వరి తెలిపారు. మంగళ వారం చిత్తూరులో ఆంధ్రప్రభ బ్యూరోతో మాట్లాడుతూ ... పాల శీతలీకరణ కేంద్రాల సామర్థ్యాన్ని 20 శాతం పెంచే దిశగా చర్యలు చేపట్టామన్నారు. రైతులకు మార్కెట్ భరోసా కల్పించేందుకు జిల్లాలో 22 కొత్త పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. దీని ద్వారా గ్రామీణ పాల ఉత్పత్తిదారులకు నేరుగా లాభం చేకూరుతుందని, మధ్యవర్తులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుందని వివరించారు. జిల్లాలో పశుసంవర్ధక రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి పరచడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా గణనీయమైన పురోగతి సాధిస్తున్నామని తెలిపారు. పాలు, మాంసం, కోళ్ల ఉత్పత్తి రంగాల్లో స్థిర వృద్ధి సాధించడమే లక్ష్యంగా విభిన్న కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు.
పశువైద్య సేవలను గ్రామీణ స్థాయిలో బలోపేతం చేయడానికి జిల్లాలో 12 మొబైల్ పశువైద్య వాహనాలు పనిచేస్తున్నాయని తెలిపారు. వీటి ద్వారా నెలకు సగటున 31,300 పశువులకు వైద్య సేవలు అందుతున్నాయని చెప్పారు. 2025 జనవరి వరకు నిర్వహించిన టీకా కార్యక్రమాల్లో భాగంగా 2.18 లక్షల పశువులకు టీకాలు వేయడం జరిగిందని వివరించారు. వ్యాధి నివారణ, త్వరిత చికిత్స, గర్భ నిర్ధారణ, కృత్రిమ గర్భాధానం వంటి సేవలు ఇంటింటికీ చేరుతున్నాయని పేర్కొన్నారు. పశుసంపద విస్తరణలో భాగంగా 2025 26 సంవత్సరంలో జిల్లాకు 5,880 మేక యూనిట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఒక్కో యూనిట్‌లో 10 మేకలు ఉండేలా రూపకల్పన చేయగా, ఇప్పటివరకు 3,750 యూనిట్లు పంపిణీ పూర్తి అయ్యాయని చెప్పారు. గొర్రెల అభివృద్ధి పథకం కింద 4,520 లబ్ధిదారులకు 35 గొర్రెలు చొప్పున యూనిట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఇవి గ్రామీణ పేద కుటుంబాలకు ఆదాయ వనరులుగా మారుతున్నాయని చెప్పారు.
పౌల్ట్రీ రంగంలో 1,835 చిన్న కోళ్ల యూనిట్లు
పౌల్ట్రీ రంగంలో 1,835 చిన్న కోళ్ల యూనిట్లు ఏర్పాటు చేసి గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించామని తెలిపారు. మహిళా సంఘాల ద్వారా 375 పాడి యూనిట్లు, 50 పశు పోషణ కేంద్రాలు ఏర్పాటు చేసి మహిళల ఆర్థిక స్వావలంబనకు తోడ్పడుతున్నామని పేర్కొన్నారు. పచ్చికాభివృద్ధి కార్యక్రమాల కింద జిల్లాలో 725 హెక్టార్లలో పశుగడ్డి సాగు ప్రోత్సహించామని తెలిపారు. ఎండకాలాన్ని దృష్టిలో ఉంచుకుని 588 మెట్రిక్ టన్నుల పశు ఆహారం నిల్వ చేశామని, రైతులకు 973 మెట్రిక్ టన్నుల గడ్డి విత్తనాలు సరఫరా చేసినట్లు వివరించారు. పశువులకు పోషకాహారం అందుబాటులో ఉండడం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతోందని చెప్పారు. ఇటీవల నిర్వహించిన ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు ఘన విజయాన్ని సాధించాయని ఉమామహేశ్వరి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు మంచి స్పందన చూపుతున్నారని, పశువుల ఆరోగ్యం మెరుగుపడితే రైతుల ఆదాయం 25 నుండి 30 శాతం వరకు పెరుగుతుందని వివరించారు. సంప్రదాయ పద్ధతులతో పాటు శాస్త్రీయ పద్ధతులను అనుసరించాలని రైతులకు సూచించారు. జిల్లాలో పశుసంవర్ధక రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారంగా మారుతోందని ఆమె స్పష్టం చేశారు.
13 రోజుల వ్యవధిలో 718 పశువైద్య శిబిరాలు
జిల్లాలో జనవరి 19 నుండి 31వ తేదీ వరకు ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను విస్తృతంగా నిర్వహించామని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ ఉమామహేశ్వరి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పశువుల ఆరోగ్య పరిరక్షణకు ఈ శిబిరాలు ఎంతో ఉపయోగపడ్డాయని ఆమె వివరించారు. ఈ 13 రోజుల వ్యవధిలో మొత్తం 718 పశువైద్య శిబిరాలు నిర్వహించామని, వాటి ద్వారా 27,656 మంది రైతులకు ప్రత్యక్ష లబ్ధి చేకూరిందన్నారు. శిబిరాల్లో 88,303 పశువులకు వైద్య చికిత్సలు అందించామని వెల్లడించారు. సంతానోత్పత్తి లోపాలతో బాధపడుతున్న 8,405 పశువులకు ప్రత్యేక చికిత్సలు నిర్వహించామని చెప్పారు. కృత్రిమ గర్భాధాన కార్యక్రమం కింద సాధారణ విధానంలో 4,529, సెక్స్ సార్టెడ్ వీర్యం విధానంలో 490 కలిపి మొత్తం 5,019 కృత్రిమ గర్భాధానాలు నిర్వహించినట్లు తెలిపారు. గర్భ నిర్ధారణ పరీక్షలు 6,309 నిర్వహించామని పేర్కొన్నారు.
గొర్రెలు, మేకలకు కూడా ...
పశువుల కడుపు పురుగుల నివారణ కోసం పెద్ద పశువులకు 38,072, దూడలకు 22,273, గొర్రెలు, మేకలకు 83,273 మందులకు కడుపు పురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేసినట్లు చెప్పారు. వ్యాధి నివారణ చర్యల్లో భాగంగా గొర్రెలు, మేకలకు పాక్స్ వ్యాధి నిరోధక టీకాలు 32,336 వేయగా, కోళ్లకు 31,668 టీకాలు వేశామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పశుసంవర్ధక సేవలను ఇంటింటికీ చేర్చాలనే లక్ష్యంతో మొబైల్ వైద్య బృందాలు సమర్థంగా పనిచేశాయని, రైతులు మంచి స్పందన చూపుతున్నారని జాయింట్ డైరెక్టర్ ఉమామహేశ్వరి తెలిపారు. పశువుల ఆరోగ్యం మెరుగుపడితే రైతుల ఆదాయం కూడా పెరుగుతుందని, ఇలాంటి శిబిరాలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని ఆమె స్పష్టం చేశారు.
గంగ 3 పశుసంవర్ధక శాఖ జెడి ఉమామహేశ్వరి
గంగ 4 పశు వైద్య శిబిరం

