చిత్తూరు మీదుగా చెన్నై, బెంగళూరు మధ్య బుల్లెట్ ట్రైన్
73 నిమిషాల్లో చెన్నై నుంచి బెంగళూరుకు ప్రయాణం
చిత్తూరు నుండి 45 నిమిషాలలో బెంగళూరుకు
మొగిలి ఘాట్ వద్ద 11 కిలోమీటర్ల సొరంగ మార్గం నిర్మాణం
బెంగళూరులో వైట్‌ఫీల్డ్, బైయప్పనహళ్లి మధ్య 12 కిలోమీటర్ల మేర
చెన్నైలో 2.5 కిలోమీటర్ల మేర అండర్‌గ్రౌండ్ సెక్షన్
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)
రైల్వే వ్యవస్థ రూపురేఖలు వేగంగా మారుతున్న తరుణంలో, దక్షిణ భారతదేశంలోని రెండు ప్రధాన నగరాలైన బెంగళూరు–చెన్నై మధ్య ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కీలక దశలోకి ప్రవేశిస్తోంది. ఎప్పటినుంచో చర్చనీయాంశంగా ఉన్న చెన్నై–బెంగళూరు హైస్పీడ్ రైల్ కారిడార్ ఇప్పుడు ప్రణాళిక దశ నుంచి అమలు దశకు అడుగులు వేస్తుండటం విశేషం. కేంద్ర బడ్జెట్ 2026–27లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లలో ఈ మార్గం ఒకటిగా ఉండటంతో ప్రాజెక్ట్‌కు మరింత ప్రాధాన్యం లభించింది.
నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సుమారు 306 కిలోమీటర్ల పొడవున్న ఈ కారిడార్‌కు సంబంధించిన సర్వేలు ఇప్పటికే పూర్తయ్యాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల గుండా ప్రయాణించే ఈ బుల్లెట్ ట్రైన్ దక్షిణ భారత ఆర్థిక, పారిశ్రామిక, ఐటీ నగరాల మధ్య వేగవంతమైన అనుసంధానాన్ని కల్పించబోతోంది. చెన్నై సెంట్రల్, పూనమల్లి, పరందూర్ (కొత్త విమానాశ్రయ ప్రాంతం), ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు సమీపంలోని రామాపురం, కర్ణాటకలో హుడుకుల (కోలార్ సమీపం), కోడిహళ్లి (హోస్కోట్ సమీపం), వైట్‌ఫీల్డ్, బైయప్పనహళ్లి వంటి స్టేషన్లు ప్రతిపాదిత జాబితాలో ఉన్నట్లు ప్రాజెక్ట్ అధ్యయనాలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం చెన్నై నుంచి బెంగళూరు వరకు రైలు లేదా రోడ్డు మార్గంలో ప్రయాణించాలంటే కనీసం 5 నుండి 6 గంటల సమయం పడుతోంది. కానీ హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి వస్తే ఈ ప్రయాణ సమయం కేవలం 1 గంట 10 నుండి 1 గంట 15 నిమిషాల మధ్యకే కుదించబడనుంది. అధికారిక అంచనాల ప్రకారం సుమారు 1 గంట 13 నిమిషాల్లోనే చెన్నై నుంచి బెంగళూరు చేరుకునే అవకాశం ఉంది. గంటకు 350 కిలోమీటర్ల గరిష్ట వేగంతో, సగటు కార్యాచరణ వేగం 250 నుండి 320 కిలోమీటర్ల మధ్య ఈ రైళ్లు ప్రయాణించేలా రూపకల్పన చేస్తున్నారు.
సొరంగ మార్గాలు
ఈ ప్రాజెక్ట్‌లో అత్యంత కీలకమైన అంశం సొరంగ మార్గాలు, భూగర్భ స్టేషన్ల నిర్మాణం. రద్దీ నగరాల్లో భూసేకరణ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు అత్యాధునిక ఇంజినీరింగ్ సాంకేతికతతో భూగర్భ సెక్షన్లను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. బెంగళూరు నగరంలోని వైట్‌ఫీల్డ్–బైయప్పనహళ్లి మధ్య దాదాపు 12 కిలోమీటర్ల మేర బుల్లెట్ ట్రైన్ భూగర్భంలో ప్రయాణించనుంది. దీంతో నగర ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం కలగకుండా, వేగవంతమైన ప్రయాణం సాధ్యమవుతుంది. ఇదే విధంగా చెన్నై నగర పరిధిలో సుమారు 2.5 కిలోమీటర్ల మేర అండర్‌గ్రౌండ్ సెక్షన్ నిర్మించనున్నారు. మరింత ప్రాధాన్యం పొందుతున్నది చిత్తూరు జిల్లా సమీపంలోని మొగిలి ఘాట్ ప్రాంతం. ఇక్కడ సుమారు 11 నుండి 11.5 కిలోమీటర్ల మేర సొరంగ మార్గం (టన్నెల్) నిర్మించే ప్రతిపాదన ఉంది. ఈ సొరంగ మార్గం ద్వారా కొండ ప్రాంతాలు, పర్యావరణ సున్నిత ప్రాంతాలను దాటుతూ రైలు సురక్షితంగా, వేగంగా ప్రయాణించేందుకు వీలు కలుగుతుంది. పర్యావరణానికి హాని కలగకుండా, భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ టన్నెల్ డిజైన్ చేయనున్నారు.
రామాపురం వద్ద హైస్పీడ్ రైల్వేస్టేషన్
చిత్తూరు జిల్లా దృష్ట్యా ఈ ప్రాజెక్ట్ చారిత్రాత్మక ప్రాధాన్యం సంతరించుకుంది. గుడిపాల మండల రామాపురం సమీపంలో ప్రతిపాదిత హైస్పీడ్ స్టేషన్ ఏర్పడితే, చిత్తూరు జిల్లాకు నేరుగా హైస్పీడ్ రైల్ కనెక్టివిటీ లభించనుంది. ప్రస్తుతం చిత్తూరు నుంచి బెంగళూరుకు రోడ్డు మార్గంలో 4 నుండి 5 గంటలు పడుతుండగా, బుల్లెట్ ట్రైన్ ద్వారా ఈ ప్రయాణం సుమారు 40 నుండి 45 నిమిషాలకు తగ్గే అవకాశముంది. అదే విధంగా చిత్తూరు నుంచి చెన్నై ప్రయాణం కూడా ప్రస్తుతం 3.5 నుండి 4 గంటలు పడుతుండగా, హైస్పీడ్ రైలు ద్వారా గంటలోపే చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బెంగళూరు–చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే సమాంతరంగా
ఈ కారిడార్ ప్రధానంగా బెంగళూరు–చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే సమాంతరంగా సాగనున్నట్లు ప్రాథమిక అలైన్‌మెంట్ అధ్యయనాలు సూచిస్తున్నాయి. కర్ణాటక సరిహద్దు ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించే ఈ మార్గం చిత్తూరు జిల్లాలో గుడిపాల, యాదమరి, బంగారుపాలెం, పలమనేరు, గంగవరం మీదుగా నంగిలి వద్ద కర్ణాటక రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. దీనివల్ల చిత్తూరు, పలమనేరు, సమీప పారిబెంగళూరు–చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే సమాంతరంగా సాగశ్రామిక ప్రాంతాలకు భారీ అభివృద్ధి అవకాశాలు ఏర్పడనున్నాయి. ప్రాజెక్ట్ అమలు పరంగా చూస్తే ఎలివేటెడ్ ట్రాక్‌లు, గ్రేడ్ సెపరేటెడ్ కారిడార్‌లు, ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థలు, అంతర్జాతీయ ప్రమాణాల స్టేషన్లు నిర్మించనున్నారు. ఒక్కో రైల్లో వందలాది ప్రయాణికులు ప్రయాణించగల సామర్థ్యం ఉండేలా అధునాతన కోచ్‌లు రూపొందించే యోచన ఉంది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా దేశీయ తయారీ సంస్థలు హైస్పీడ్ రైళ్ల తయారీలో భాగస్వామ్యం కానున్నాయి.
రెండవ దశ మైసూర్ వరకు
భవిష్యత్తులో ఈ కారిడార్‌ను మైసూరు వరకు రెండో దశలో విస్తరించే ప్రణాళిక కూడా పరిశీలనలో ఉంది. అంతేకాకుండా బెంగళూరు, హైదరాబాద్ హైస్పీడ్ కారిడార్‌ను అభివృద్ధి చేసే యోచనతో దక్షిణ భారతదేశంలో హైస్పీడ్ ట్రయాంగిల్ రూపుదిద్దుకునే అవకాశం ఉందని రవాణా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నెట్‌వర్క్ అమల్లోకి వస్తే హైదరాబాద్ ప్రయాణం కూడా కేవలం రెండు గంటల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. సుమారు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో అభివృద్ధి చెందుతున్న ఈ మెగా మౌలిక వసతుల ప్రాజెక్ట్ దేశ రైల్వే ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చబోతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ట్రాన్సిట్ ఓరియెంటెడ్ డెవలప్‌మెంట్ ద్వారా స్టేషన్ల చుట్టుపక్కల కొత్త వాణిజ్య కేంద్రాలు, ఐటీ పార్కులు, పరిశ్రమలు, నివాస ప్రాజెక్టులు వేగంగా అభివృద్ధి చెందే అవకాశముంది. మొత్తం మీద చెన్నై–బెంగళూరు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కేవలం వేగవంతమైన రవాణా సౌకర్యం మాత్రమే కాకుండా దక్షిణ భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశను చూపించే చారిత్రాత్మక ప్రాజెక్ట్‌గా నిలవనుంది. ముఖ్యంగా సొరంగ మార్గాలు, భూగర్భ స్టేషన్లు, అత్యాధునిక సాంకేతిక నిర్మాణంతో రూపుదిద్దుకుంటున్న ఈ హైస్పీడ్ కారిడార్ భవిష్యత్తులో చిత్తూరు జిల్లా సహా మొత్తం ప్రాంత అభివృద్ధికి బలమైన పునాది వేయబోతోందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

