ప్రతి కుటుంబానికి స్మార్ట్ ఫ్యామిలీ కార్డు !
జిల్లాలో జోరుగా జరుగుతున్న కుటుంబ సర్వే
ఈ నెలాఖరుకు సర్వే పూర్తి కావాలని ఆదేశాలు
బహుళ ప్రయోజన కార్డులుగా స్మార్ట్ ఫ్యామిలీ కార్డు
అన్ని ప్రభుత్వ పథకాలకు ఉపయోగకరంగా ఒకే కార్డు
ఓకే కార్డులు 25 రకాల సేవలు అందుబాటులోకి
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)
స్మార్ట్ రేషన్ కార్డులను అందజేసిన రాష్ట్ర ప్రభుత్వం అదే స్ఫూర్తితో డిజిటల్ పాలనలో మరో కీలక సంస్కరణగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి స్మార్ట్ ఫ్యామిలీ కార్డు అందించేందుకు సిద్ధమవుతోంది. ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఎఫ్‌బీఎంఎస్) కింద రూపొందిస్తున్న ఈ కార్డులను జూన్ నాటికి జిల్లాలోని 20 వేల కుటుంబాలకు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో స్మార్ట్ ఫ్యామిలీ కార్డుల అమలు, డేటా సమగ్రత, పౌరసేవల సరళీకరణపై సీఎం కీలక సూచనలు చేశారు. ఇప్పటికే అమల్లో ఉన్న రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీఎస్) డేటా లేక్‌ను ఈ ప్రాజెక్టుకు ప్రధాన ఆధారంగా ఉపయోగిస్తూ కుటుంబాల సమగ్ర సమాచారాన్ని ఒకే డిజిటల్ వ్యవస్థలో సమీకరించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది.
ఈ స్మార్ట్ ఫ్యామిలీ కార్డులపై ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ముద్రించి ఆల్-ఇన్-వన్ కార్డు రూపంలో అందించనున్నారు. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసిన వెంటనే ఆ కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలు, వారికి అందుతున్న సంక్షేమ పథకాల సమాచారం, రేషన్ సేవలు, పింఛన్లు, స్కాలర్‌షిప్‌లు, ఆరోగ్య వివరాలు, వ్యాక్సినేషన్, పోషణ సమాచారం, ఆధార్ లింకేజ్, ఆదాయం ఆధారిత సేవలు వంటి సుమారు 24 నుంచి 25 రకాల కీలక సమాచారం ఒకే చోట అందుబాటులోకి వచ్చేలా కార్డును రూపొందిస్తున్నారు. కుటుంబ స్థాయి స్టాటిక్, డైనమిక్ డేటాను నిరంతరం అప్డేట్ చేసే విధంగా సాంకేతిక ఏర్పాట్లు చేపడుతున్నారు. ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్‌గా పరిగణించి ప్రభుత్వ సేవల అమలును మరింత ఖచ్చితంగా, వేగంగా నిర్వహించడమే ఈ పథక ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటివరకు వేర్వేరు సేవల కోసం వేర్వేరు కార్డులు, పత్రాలు తీసుకెళ్లాల్సిన పరిస్థితిని ఈ స్మార్ట్ ఫ్యామిలీ కార్డు పూర్తిగా మార్చబోతోంది. ఇకపై రేషన్, పెన్షన్, విద్యా స్కాలర్‌షిప్‌లు, ఆరోగ్య పథకాలు, గృహ పథకాలు, సామాజిక సంక్షేమ సేవలు, పోషణ కార్యక్రమాలు వంటి అన్ని ప్రభుత్వ పథకాలు ఒకే కార్డు ద్వారా ట్రాక్ చేయబడతాయి. శాఖల మధ్య సమన్వయం మెరుగుపడి అర్హులైన లబ్ధిదారులను సులభంగా గుర్తించడం సాధ్యమవుతుంది. దీంతో పథకాల అమలులో పారదర్శకత పెరిగి మధ్యవర్తుల ప్రభావం తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
బహుళ ప్రయోజన కార్డులుగా ....
ఈ స్మార్ట్ ఫ్యామిలీ కార్డు ద్వారా ప్రజలకు అనేక విధాలుగా ప్రయోజనాలు కలగనున్నాయి. ఒకే కార్డుతో అన్ని ప్రభుత్వ సేవలు పొందే అవకాశం ఉండటంతో ప్రజలు అనేక కార్డులు, పత్రాలు వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. అర్హులైన వారికి మాత్రమే సంక్షేమ పథకాల లబ్ధి చేరేలా డేటా ఆధారిత గుర్తింపు వ్యవస్థ పనిచేయడం వల్ల తప్పులు, అవకతవకలు తగ్గుతాయి. ఆధార్ లింకేజ్, సమగ్ర డేటా సమీకరణతో డూప్లికేట్ రికార్డులు, నకిలీ రేషన్ కార్డులు, తప్పుడు పింఛన్లు వంటి సమస్యలకు చెక్ పడనుంది. కుటుంబంలోని ప్రతి సభ్యుని ఆరోగ్యం, విద్య, పోషణ, సంక్షేమ వివరాలు ఒకే చోట ఉండటం వల్ల కుటుంబ అభివృద్ధిపై ప్రభుత్వానికి స్పష్టమైన అంచనా లభిస్తుంది. పౌరులు ప్రతి సేవ కోసం వేర్వేరు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గి సేవలు వేగంగా, సులభంగా అందుబాటులోకి వస్తాయి. అత్యవసర పరిస్థితులు, ఆరోగ్య సంక్షోభాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రభుత్వం కుటుంబాల వివరాలను వెంటనే యాక్సెస్ చేసి సహాయక చర్యలు చేపట్టేందుకు ఈ కార్డు కీలకంగా ఉపయోగపడుతుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో డిజిటల్ సేవల విస్తరణకు ఇది దోహదపడటంతో పాటు భవిష్యత్ సంక్షేమ పథకాల రూపకల్పనకు ఖచ్చితమైన డేటా అందించే సమగ్ర వ్యవస్థగా నిలవనుంది.
ఆధార్ కూడా అనుసంధానం
ఆధార్ సహా వివిధ ప్రభుత్వ డేటాబేస్‌లను ఈ కార్డుతో అనుసంధానం చేయడం వల్ల అవినీతి నియంత్రణలో కూడా ప్రభుత్వం కీలక పురోగతి సాధించగలదని అంచనా వేస్తున్నారు. ఒకే ప్లాట్‌ఫామ్ ద్వారా సమాచారాన్ని ట్రాక్ చేయడం వల్ల పారదర్శకత పెరగడంతో పాటు పౌరసేవల వేగం గణనీయంగా మెరుగుపడనుంది. జిల్లా, మండల స్థాయి అధికారుల పరిశీలనతో పాటు గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా కుటుంబ వివరాలను క్రమం తప్పకుండా అప్డేట్ చేసే విధానం అమలు చేయనున్నారు. స్మార్ట్ ఫ్యామిలీ కార్డుల జారీకి ముందు రాష్ట్రవ్యాప్తంగా కుటుంబ సర్వే వేగవంతంగా కొనసాగుతోంది. నిర్ణయించిన గడువులో సర్వే పూర్తికాకపోవడంతో ఈ నెలాఖరు వరకు గడువు పొడిగించారు. సర్వే పూర్తయిన అనంతరం సమగ్ర వివరాల ఆధారంగా కార్డులను తయారు చేసి పంపిణీ చేయనున్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల తరువాత స్మార్ట్ ఫ్యామిలీ కార్డులను ప్రవేశపెట్టడం ద్వారా టెక్నాలజీ ఆధారిత సుపరిపాలనకు ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇస్తోంది. జనవరి 2026 నాటికి డేటా సమగ్రతను పూర్తి చేసి, జూన్ నాటికి కార్డుల పంపిణీ పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా స్పష్టం కాగా, ఒకే కార్డుతో అన్ని ప్రభుత్వ సేవలు అందించే ఈ వ్యవస్థ అమల్లోకి వస్తే పారదర్శకత, వేగం, ఖచ్చితమైన లబ్ధిదారుల గుర్తింపు, డేటా ఆధారిత సంక్షేమ పాలనకు ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

