23, ఫిబ్రవరి 2026, సోమవారం

డీఆర్‌సీ సమావేశానికి గ్రహణం

9 నెలలుగా సమీక్ష లేక అభివృద్ధి పనులు నత్తనడక
మూగబోయిన ప్రజా సమస్యలకు వారధి 
జిల్లాలో పేరుకుపోతున్న సమస్యలు

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

జిల్లా అభివృద్ధి దిశను నిర్దేశించే చట్టబద్ధమైన అత్యున్నత వేదికగా గుర్తింపు పొందిన జిల్ల సమీక్షా మండలి (డీఆర్‌సీ) సమావేశానికి గ్రహణం పట్టింది. చిత్తూరు జిల్లాలో దాదాపు తొమ్మిది నెలలుగా జరగకపోవడం పరిపాలనా వ్యవస్థపై తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ప్రభుత్వ పథకాల అమలు నుంచి ప్రజా సమస్యల పరిష్కారం వరకు సమగ్ర సమీక్ష జరగాల్సిన ఈ కీలక వేదిక నిలిచిపోవడంతో జిల్లా ప్రగతి చక్రం నత్తనడకన సాగుతోందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం ప్రతి మూడు నెలలకు ఒకసారి తప్పనిసరిగా నిర్వహించాల్సిన డీఆర్‌సీ సమావేశం నిర్లక్ష్యానికి గురవడం పరిపాలనా వ్యవస్థలో సమీక్షా లోపాన్ని స్పష్టంగా చూపుతోందని పరిపాలనా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, అభివృద్ధి కార్యక్రమాలు, జిల్లాలో తీవ్రంగా ఉన్న ఏనుగులు, చిరుతపులుల గురించి, రైతుల కష్టనష్టాలను గురించి పట్టించుకునే నాధుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి మధ్య వారధిగా నిలిచే డీఆర్‌సీ సమావేశానికి సాధారణంగా జిల్లాకు కేటాయించిన ఇన్‌చార్జ్ మంత్రి అధ్యక్షత వహిస్తారు. జిల్లా కలెక్టర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తూ అన్ని శాఖల పురోగతి నివేదికలను సమగ్రంగా సమర్పిస్తారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు సభ్యులుగా పాల్గొని తమ నియోజకవర్గాల్లోని పెండింగ్ అభివృద్ధి పనులు, స్థానిక సమస్యలను ఈ వేదికపై ఉంచుతారు. జిల్లా స్థాయి ఉన్నతాధికారులు శాఖల వారీగా వివరణ ఇవ్వడం ద్వారా పరిపాలనా పారదర్శకతకు ఈ సమావేశం అద్దం పడుతుంది. అయితే ఇలాంటి కీలక వేదిక చిత్తూరు జిల్లాలో క్రమబద్ధంగా జరగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చిత్తూరు జిల్లాలో డీఆర్‌సీ సమావేశం కేవలం రెండుసార్లు మాత్రమే నిర్వహించారు. 2024 డిసెంబర్ 8న ఒకసారి, 2025 మే 6న మరోసారి సమావేశం జరిగింది. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు మరో సమీక్షా సమావేశం జరగకపోవడం పరిపాలనా వ్యవస్థలో సమన్వయ లోపాన్ని బహిర్గతం చేస్తున్నదని రాజకీయ, పరిపాలనా వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. వాస్తవానికి అత్యవసర పరిస్థితుల్లో రెండు నెలలకు ఒకసారి కూడా డీఆర్‌సీ సమావేశం నిర్వహించవచ్చని మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. అయినప్పటికీ దాదాపు తొమ్మిది నెలల గ్యాప్ ఏర్పడటం గమనార్హంగా మారింది.

ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డీఆర్‌సీ సమావేశాల ప్రాముఖ్యతను స్పష్టంగా ప్రస్తావిస్తూ ప్రతి రెండు నెలలకు ఒకసారి సమీక్షలు నిర్వహించాలని నిర్దేశించారు. ఆరోజు రాత్రి జిల్లా మంత్రి జిల్లా కేంద్రంలో బస చేసి, టిడిపి నాయకులు కార్యకర్తలతో సమన్వయం చేసుకోవాలని, మరుసటి రోజు జిల్లా స్థాయి టిడిపి సమావేశాన్ని నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా అధికారుల నుంచి వచ్చిన సమస్యలు, టిడిపి నేతల లేవనెత్తిన సమస్యలను  సమగ్రంగా చర్చించి, వెంటనే పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి స్థాయిలో పరిష్కారం గాని సమస్యలను మంత్రి మండల దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు వెలువడినప్పటికీ, చిత్తూరు జిల్లాలో మాత్రం ఆ ఆచరణ కనిపించకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లా కేంద్రంలో రాజకీయ సమీక్షలు జరుగుతున్నా, అధికారిక డీఆర్‌సీ మాత్రం జరగకపోవడం పరిపాలనా ప్రాధాన్యతలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. డీఆర్‌సీ సమావేశం కేవలం ఒక అధికారిక కార్యక్రమం మాత్రమే కాదు, జిల్లా అభివృద్ధికి దిక్సూచి వంటిది. వ్యవసాయం, సాగునీరు, రోడ్లు, త్రాగునీరు, విద్యుత్, విద్య, వైద్యం, సంక్షేమ పథకాలు, గృహ నిర్మాణం, భూసేకరణ, శాంతిభద్రతలు వంటి కీలక అంశాలపై సమగ్ర సమీక్ష జరగాల్సిన ప్రధాన వేదిక ఇది. రైతులకు విత్తనాలు, ఎరువుల సరఫరా నుంచి పాఠశాలల్లో మౌలిక వసతులు, ఆసుపత్రుల్లో వైద్య సేవల లభ్యత వరకు అన్ని అంశాలు డీఆర్‌సీ అజెండాలో ఉంటాయి. శాఖల మధ్య సమన్వయం లోపిస్తే ఇన్‌చార్జ్ మంత్రి నేరుగా ఆదేశాలు జారీ చేసి పనులను వేగవంతం చేయగల సామర్థ్యం కూడా ఈ వేదికకే ఉంటుంది.

ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో తాగునీటి సమస్యలు, సాగునీటి విడుదలలో ఆలస్యం, పెండింగ్ మౌలిక సదుపాయాల పనులు, సంక్షేమ పథకాల అమలులో జాప్యం, రోడ్ల మరమ్మత్తులు, గ్రామీణ అభివృద్ధి పనుల నిలకడ వంటి అనేక సమస్యలు పేరుకుపోతున్నాయని స్థానిక వర్గాలు పేర్కొంటున్నాయి. డీఆర్‌సీ సమావేశం లేకపోవడంతో ప్రజా ప్రతినిధులు తమ నియోజకవర్గ సమస్యలను సమగ్రంగా ఎవరి దృష్టికి తీసుకెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొన్నదని అనధికారికంగా వ్యాఖ్యానిస్తున్నట్లు సమాచారం. ఇది ప్రజాస్వామ్య పరిపాలనలో సమీక్షా వ్యవస్థ బలహీనతకు నిదర్శనంగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు. జిల్లా సమీక్షా మండలి చైర్మన్‌గా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఉన్నప్పటికీ, క్రమబద్ధమైన సమీక్షలు జరగకపోవడం పరిపాలనా శ్రద్ధపై సందేహాలు కలిగిస్తోంది. జిల్లా స్థాయిలో పరిష్కారం కాని భారీ ప్రాజెక్టులు, నిధుల మంజూరు, భూసేకరణ సమస్యలు, అభివృద్ధి ప్రతిపాదనలు రాష్ట్ర మంత్రివర్గం దృష్టికి తీసుకెళ్లే ప్రధాన వేదిక డీఆర్‌సీ కావడం విశేషం. ఈ సమావేశం జరగకపోవడం వల్ల జిల్లా సమస్యలు రాష్ట్ర స్థాయికి చేరడంలో ఆలస్యం జరుగుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

గతంలో త్రైమాసికంగా డీఆర్‌సీ సమావేశాలు నిర్వహించబడిన సమయంలో శాఖల పనితీరు మీద క్రమశిక్షణ ఉండేదని, పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కారం అయ్యేవని సీనియర్ అధికారులు గుర్తు చేస్తున్నారు. సమీక్షా వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు పరిపాలనలో స్పష్టత, బాధ్యత పెరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఆ సంప్రదాయం సడలిపోవడంతో అభివృద్ధి పనుల పర్యవేక్షణలో లోపాలు తలెత్తుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లా అవసరాలు, క్షేత్రస్థాయి వాస్తవాలు, ప్రజా సమస్యలు నేరుగా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి చేరే వారధిగా ఉండాల్సిన డీఆర్‌సీ వేదిక నిలిచిపోవడం అభివృద్ధి పరంగా ఆందోళనకర అంశంగా మారింది. సమీక్షలు లేకపోతే పనుల పురోగతిపై సమగ్ర దృష్టి ఉండదనే అభిప్రాయం పరిపాలనా వర్గాల్లో వ్యక్తమవుతోంది. పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల వినియోగం, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై స్పష్టమైన దిశానిర్దేశం లేకపోవడం జిల్లా ప్రగతిపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో డీఆర్‌సీ సమావేశాన్ని తక్షణమే నిర్వహించి, పెండింగ్ అభివృద్ధి పనులపై సమగ్ర సమీక్ష జరపాలని ప్రజలు, ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. పరిపాలనా సంప్రదాయాలకు అనుగుణంగా క్రమబద్ధమైన సమీక్షలు జరిగితేనే జిల్లా అభివృద్ధి వేగవంతమవుతుందనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. జిల్లా ప్రగతికి దిక్సూచి కావాల్సిన డీఆర్‌సీ మళ్లీ చురుకుగా పునరుద్ధరించబడుతుందా? లేక సమీక్షా వ్యవస్థ పేరుకే పరిమితం అవుతుందా? అన్న ప్రశ్నలకు సమాధానం కోసం జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *