మాంగో బోర్డు కోసం రైతుల ఎదురుచూపులు
కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన రాష్ట్రం
పార్లమెంటులో కూడా ప్రస్తావించిన ఎంపీలు
స్పందించని కేంద్ర ప్రభుత్వం
భారీగా నష్టపోతున్న మామిడి రైతులు
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)
దక్షిణ భారతదేశంలో మామిడి బుట్టగా పేరు గాంచిన చిత్తూరు జిల్లా రైతులు మామిడి బోర్డు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం చిత్తూరు జిల్లాలో మ్యాంగో బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇందుకు అవసరమైన నిధులను కూడా విడుదల చేయాల్సిందిగా కోరింది. చిత్తూరు పార్లమెంటు సభ్యుడు దగ్గుమల్ల ప్రసాదరావు, తిరుపతి పార్లమెంటు సభ్యుడు గురుమూర్తి కూడా పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. గత సంవత్సరం పతనమైన మామిడి ధరలతో తీవ్రంగా నష్టపోవారు. ఈ సంవత్సరం కూడా మామిడి పూత ఆలస్యంగా వచ్చింది. దట్టమైన మంచు కురుస్తున్న కారణంగా పూత నిలుస్తుందా అన్న అనుమానం మామిడి రైతులలో వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మరోసారి మామిడి బోర్డు (మాంగో బోర్డు) అంశంపై తీవ్ర చర్చకు వేదికైంది. దాదాపు మూడు దశాబ్దాలుగా మామిడి సాగుపై ఆధారపడుతున్న వేలాది మంది రైతులు, మార్కెట్‌లో స్థిరత్వం లేకపోవడం, పరిశ్రమల ఆధిపత్యం, ఎగుమతుల్లో పరిమిత అవకాశాలు వంటి సమస్యలతో తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మాంగో బోర్డు ఏర్పాటే తమకు శాశ్వత రక్షణ కవచమని రైతులు భావిస్తూ ఆశగా ఎదురుచూస్తున్నారు.
చిత్తూరు జిల్లాలో సుమారు 1.10 లక్షల హెక్టార్లకు పైగా మామిడి సాగు జరుగుతోంది. ఇందులో ముఖ్యంగా తోతాపురి, నీలం, బంగనపల్లి, రసాలు వంటి రకాల సాగు విస్తృతంగా ఉంది. దేశంలోనే అత్యధిక మామిడి గుజ్జు (పల్ప్) ఉత్పత్తి ఈ జిల్లాలోనే జరుగుతున్నప్పటికీ, రైతుల పరిస్థితి మాత్రం ఆశాజనకంగా లేదు. పంట పండించే బాధ్యత రైతిదే అయినా, ధర నిర్ణయం మాత్రం మార్కెట్ మరియు పరిశ్రమల చేతుల్లో ఉండటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఏటా ధరల అస్థిరత మామిడి రైతులకు ప్రధాన సమస్యగా మారింది. ఒక సంవత్సరం కిలో ధర రూ. 20-25 వరకు ఉంటే, మరో సంవత్సరం అది రూ. 2-4కి పడిపోవడం సాధారణమైపోయింది. గత సీజన్‌లో తోతాపురి మామిడి ధరలు తీవ్రంగా పడిపోవడంతో అనేక మంది రైతులు పెట్టుబడికీ రాని పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఎరువులు, కార్మిక వ్యయం, నీటి ఖర్చులు, మందులు, రవాణా వంటి ఖర్చులు ఎకరాకు రూ. 40 వేల నుంచి రూ. 60 వేల వరకు పెరుగుతున్నాయి. కానీ దిగుబడి వచ్చిన తర్వాత ధరలు పడిపోవడంతో రైతులకు లాభం కాకుండా అప్పుల భారమే మిగులుతోంది.
గుజ్జు పరిశ్రమల సిండికేట్ తో భారీ నష్టం
మామిడి గుజ్జు పరిశ్రమల సిండికేట్ కూడా రైతుల ఆర్థిక కష్టాలకు ప్రధాన కారణమని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. జిల్లాలో సుమారు 50కి పైగా పల్ప్ పరిశ్రమలు ఉన్నప్పటికీ, కొనుగోలు సమయంలో అవి కలిసి తక్కువ ధరలు నిర్ణయిస్తున్నాయని రైతులు అంటున్నారు. ఫలితంగా రైతులు తమ పంటను నిల్వ ఉంచుకునే సౌకర్యం లేక తక్కువ ధరలకు విక్రయించాల్సి వస్తోంది. పరిశ్రమలు సకాలంలో చెల్లింపులు చేయకపోవడం మరో పెద్ద సమస్యగా మారింది. కొన్ని అంచనాల ప్రకారం, రైతులకు ఇవ్వాల్సిన వందల కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని సమాచారం. ఇక ఎగుమతుల విషయంలో కూడా చిత్తూరు రైతులు వెనుకబడి ఉన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో మామిడి గుజ్జుకు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ, నాణ్యత ప్రమాణాలు, శీతలీకరణ గొలుసు (కోల్డ్ చైన్), ప్రత్యక్ష మార్కెటింగ్ వ్యవస్థల కొరత కారణంగా స్థానిక రైతులు ఆ అవకాశాలను పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నారు. మధ్యవర్తులపై ఆధారపడటం వల్ల రైతుల ఆదాయం తగ్గిపోతోంది. సరైన బ్రాండింగ్ లేకపోవడం కూడా జిల్లాలో ఉత్పత్తి అవుతున్న మామిడి విలువను తగ్గిస్తోంది.
మామిడి ధరను నియంత్రించే బోర్డు అవసరం
ప్రస్తుత పరిస్థితుల్లో మాంగో బోర్డు ఏర్పాటు అవసరం మరింత స్పష్టమవుతోంది. స్పైసెస్ బోర్డు, కాఫీ బోర్డు తరహాలో ఒక స్వయంప్రతిపత్తి కలిగిన మామిడి బోర్డు ఏర్పాటు చేస్తే సాగు నుంచి మార్కెటింగ్ వరకు సమగ్ర వ్యవస్థ ఏర్పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ బోర్డు ద్వారా శాస్త్రీయ సాగు పద్ధతులపై పరిశోధనలు, కొత్త రకాల అభివృద్ధి, తెగుళ్ల నియంత్రణ, దిగుబడి పెంపు వంటి అంశాల్లో రైతులకు మార్గదర్శనం లభిస్తుంది. అలాగే ప్రతి సీజన్‌కు గిట్టుబాటు ధరను శాస్త్రీయంగా నిర్ణయించడం ద్వారా ధరల పతనం నుంచి రైతులు రక్షణ పొందే అవకాశం ఉంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మామిడి బోర్డు ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వానికి అధికారిక ప్రతిపాదనలు పంపడం ఈ అంశానికి మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది. కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయగా, పార్లమెంట్‌లో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. తిరుపతిలో జాతీయ మామిడి బోర్డు, చిత్తూరులో జాతీయ మామిడి పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రజాప్రతినిధులు కేంద్రాన్ని కోరారు. ఇది అమలు అయితే మామిడి రంగానికి దీర్ఘకాలిక దిశా నిర్దేశం లభిస్తుందని భావిస్తున్నారు. రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని తాత్కాలిక చర్యలు చేపట్టినప్పటికీ, అవి పూర్తి స్థాయి పరిష్కారం కావడం లేదు. మామిడి రైతులకు కిలోకు రూ. 4 చొప్పున ప్రోత్సాహకం ప్రకటించి సుమారు రూ. 146 కోట్లకు పైగా నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. తోతాపురి మామిడికి కిలోకు రూ. 12 మద్దతు ధర నిర్ణయించడం, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మామిడి దిగుమతిపై పరిమితులు విధించడం వంటి చర్యలు కూడా చేపట్టబడ్డాయి. అయినప్పటికీ, మార్కెట్‌పై నియంత్రణ లేకపోవడం వల్ల రైతుల సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
మామిడి పంటపై వాతావరణ మార్పుల ప్రభావం
మామిడి సాగు ప్రకృతి ఆధారిత వ్యవసాయం కావడంతో వాతావరణ మార్పులు కూడా రైతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అసమయ వర్షాలు, పొగమంచు, ఉష్ణోగ్రత మార్పులు పుష్పించడాన్ని దెబ్బతీస్తున్నాయి. పూత దశలో వర్షాలు పడితే దిగుబడి తీవ్రంగా తగ్గిపోతుంది. కొన్నిసార్లు వైరస్, ఫంగస్ తెగుళ్లు పంటను నాశనం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పంట బీమా సక్రమంగా అందకపోవడం రైతులను మరింత కుంగదీస్తోంది. రైతుల ఆదాయం-పెట్టుబడి మధ్య వ్యత్యాసం రోజురోజుకూ పెరుగుతోంది. ఎకరాకు లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టినా, సరైన ధర రాకపోతే రైతుకు నికర లాభం చాలా తక్కువగా మిగులుతోంది. కొంతమంది రైతులు తోటలను కత్తిరించి ఇతర పంటల వైపు మళ్లాలని ఆలోచిస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఇది భవిష్యత్తులో జిల్లాలో మామిడి సాగుపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మామిడి బోర్డు ఏర్పాటు జరిగితే మార్కెటింగ్, ఎగుమతులు, నిల్వ సదుపాయాలు, ప్రాసెసింగ్ యూనిట్లు సమన్వయంతో పనిచేసే వ్యవస్థ ఏర్పడుతుంది. రైతులకు నేరుగా అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం కల్పించడంతో పాటు బ్రాండింగ్, విలువ ఆధారిత ఉత్పత్తుల ప్రోత్సాహం కూడా పెరుగుతుంది. పల్ప్ పరిశ్రమలపై పర్యవేక్షణ ఉండటం వల్ల చెల్లింపుల ఆలస్యం వంటి సమస్యలు తగ్గే అవకాశం ఉంది.
ప్రతిపాదనపై స్పందించని కేంద్రం
ప్రస్తుతం ఈ ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పెండింగ్‌లో ఉంది. ప్రభుత్వం మామిడి బోర్డు ఏర్పాటు కోసం ఒత్తిడి తెస్తున్నప్పటికీ, రైతులు మాత్రం తక్షణ నిర్ణయం కోరుతున్నారు. సబ్సిడీలు తాత్కాలిక ఉపశమనం మాత్రమే… మాకు కావాల్సింది శాశ్వత ధర భరోసా అని రైతులు స్పష్టం చేస్తున్నారు. సంవత్సరాలుగా ధర్నాలు, నిరసనలు, వినతిపత్రాలు అందజేస్తూ వస్తున్న రైతుల ఆశలు ఇప్పుడు మాంగో బోర్డు మీదే నిలిచాయి. మొత్తంగా చూస్తే, చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల భవిష్యత్తు మాంగో బోర్డు ఏర్పాటు నిర్ణయంపై ఆధారపడి ఉందని చెప్పడం అతిశయోక్తి కాదు. సాగు ఖర్చులు పెరుగుతున్న ఈ కాలంలో, స్థిరమైన మార్కెట్ వ్యవస్థ లేకపోతే రైతుల జీవనోపాధి ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అందుకే మాంగో బోర్డు రైతుల చిరకాల వాంఛగా మారింది. కేంద్రం త్వరగా ఆమోదం తెలుపుతుందా లేదా అన్నది రైతుల భవిష్యత్తును నిర్ణయించే కీలక అంశంగా మారింది.

