జిల్లాలో 6,110 టన్నుల యూరియా సిద్ధంగా ఉంది
రైతులకు యూరియా కొలత లేదు
ప్రతి రైతుకు అవసరమైన అంత యూరియా సరఫరా
అన్ని పంటలకు యూరియా, రైతులకు ఆందోళన వద్దు
అధిక ధర వసూలు చేసిన, బ్లాక్ మార్కెటింగ్ చేసిన కఠిన చర్యలు
ఆంధ్రప్రభ బ్యూరోతో వ్యవసాయ శాఖ జెడి మురళి
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)
చిత్తూరు జిల్లాలో రైతులకు యూరియా ఎరువు కొరత ఉండదని, అవసరమైనంత సరఫరా చేసేందుకు పూర్తి స్థాయిలో నిల్వలు సిద్ధంగా ఉన్నాయని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం. మురళి స్పష్టం చేశారు. శుక్రవారం చిత్తూరులో ఆంధ్రప్రభ బ్యూరోతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాలను వెల్లడించారు. జిల్లాలో ప్రస్తుతం మొత్తం 6,110 టన్నుల యూరియా అందుబాటులో ఉందని, రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ప్రతి రైతుకు అవసరమైనంత యూరియాను సరఫరా చేయడానికి శాఖ పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసిందని, పశువుల గడ్డి పంటలతో సహా అన్ని రకాల పంటలకు యూరియా అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. కొందరు ఉద్దేశపూర్వకంగా కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎరువులను ఎక్కువ మొత్తానికి అమ్మినా, బ్లాక్ మార్కెటింగ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు.
జిల్లాలోని రైతు సేవా కేంద్రాల వద్ద ప్రస్తుతం 1,273 టన్నుల యూరియా రైతులకు విక్రయించేందుకు సిద్ధంగా ఉందన్నారు. అదనంగా ప్రైవేటు డీలర్ల వద్ద 240 టన్నులు, సింగిల్ విండో కేంద్రాల్లో 40 టన్నులు నిల్వలుగా ఉన్నాయని వివరించారు. వీటితో పాటు మార్క్‌ఫెడ్ వద్ద 740 టన్నులు, రేణిగుంటలోని ఇండియన్ పొటాష్ లిమిటెడ్ వద్ద 400 టన్నులు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ఇంకా పిక్ కంపెనీ నుంచి 700 టన్నులు, మద్రాస్ ఫర్టిలైజర్స్ నుంచి 1000 టన్నుల యూరియా జిల్లాకు రవాణాలో ఉందని, ఇవి ఈనెల 10వ తేదీ లోపు జిల్లాకు చేరుకుంటాయని చెప్పారు. ఇంకా రెండు రోజుల్లో రైతులకు 1,225 టన్నుల యూరియా సరఫరా చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 3,510 టన్నులు సిద్ధంగా ఉండగా, ఈనెల 10వ తేదీ నాటికి మరో 2,500 టన్నులు సరఫరా అవుతాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా జిల్లాకు అదనంగా 2,500 టన్నుల యూరియా కేటాయించిందని తెలిపారు. మొత్తం కలిపి జిల్లాలో యూరియా సరఫరా సమృద్ధిగా ఉందని స్పష్టం చేశారు. ఎరువుల అమ్మకాలలో పారదర్శకత తప్పనిసరి అని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి హెచ్చరించారు. రైతులు ఎరువుల బస్తాపై ముద్రించిన గరిష్ట చిల్లర ధరను మాత్రమే చెల్లించాలని, అంతకంటే ఎక్కువ డిమాండ్ చేస్తే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రతి కొనుగోలుకు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని తెలిపారు. ఎవరైనా డీలర్లు కృత్రిమ కొరత సృష్టించినా, ఎరువులను పక్కదారి పట్టించినా లేదా అధిక ధరలకు విక్రయించినా ఎరువుల నియంత్రణ చట్టం ప్రకారం లైసెన్సులు రద్దు చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దేశీయ ఉత్పత్తి పెరగడం, దిగుమతులు ఆశాజనకంగా ఉండటంతో జిల్లాలో ఎరువుల కొరత వచ్చే అవకాశం లేదని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. సాంప్రదాయ బస్తా ఎరువులకు ప్రత్యామ్నాయంగా సాంకేతికంగా అభివృద్ధి చేసిన నానో యూరియా, నానో డి.ఎ.పిలను రైతులు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. ఇవి భూసారాన్ని కాపాడటమే కాకుండా రవాణా, ఖర్చు పరంగా కూడా రైతులకు లాభదాయకమని చెప్పారు. ప్రభుత్వం వీటిని విస్తృతంగా ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఎరువుల వినియోగంలో సమతుల్యత పాటిస్తే దిగుబడులు పెరుగుతాయని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
అద్దెకు వ్యవసాయ పనిముట్లు
రైతులకు అవసరమైన వ్యవసాయ పనిముట్లను అందుబాటులోకి తేనికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించినట్లు తెలిపారు. ఏపీఏఐఏంఎస్ వెబ్ సైట్ ద్వారా రైతులు డ్రోన్లు, ట్రాక్టర్లు, పంట కోత యంత్రాలు, నూర్పిడి యంత్రాలు వంటి పరికరాలను అద్దెకు బుక్ చేసుకోవచ్చన్నారు. జిల్లాలో 31 డ్రోన్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అవి ఎక్కడ అందుబాటులో ఉన్నాయో, యజమాని చిరునామా, ఫోన్ నంబర్, అద్దె ధర వంటి వివరాలు వెబ్‌సైట్‌లో ఉంటాయని, రైతులు అవసరమైన యంత్రాలను బుక్ చేసుకుని సేవలు పొందవచ్చని తెలిపారు. గ్రామస్థాయిలో రైతులకు సమగ్ర సేవలను అందించేందుకు జిల్లాలో 502 రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వీటి ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ సాంకేతిక సలహాలు అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ పంటల కింద వేల కోట్ల రూపాయల లక్ష్యంతో రుణాలు మంజూరు చేస్తున్నామని, ఇప్పటికే గణనీయమైన మొత్తాన్ని రైతులకు అందజేశామని తెలిపారు. వ్యవసాయ రుణాల కింద నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించేలా పంపిణీ జరుగుతోందన్నారు.
భారీగా వ్యవసాయ రుణాలు
ఈ ఆర్థిక సంవత్సరానికి 5091 కోట్లు వ్యవసాయ పంట రుణాలు లక్ష్యం కాగా, ఇప్పటివరకు 2965 కోట్ల రూపాయలను రైతులకు అందజేశామన్నారు. వ్యవసాయేతర రుణాలు కింద 3722 కోట్ల లక్ష్యం గాక, ఇప్పటివరకు 892 కోట్ల రూపాయలను రైతులకు అందజేశామన్నారు. సిసిఆర్సి కార్డులను రెవెన్యూ శాఖ దొరకవురు రైతులకు అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్డుల ద్వారా కౌలు రైతులు బ్యాంకుల నుంచి రుణాలు పొందవచ్చని, విత్తనాలు, పంట నష్ట పరిహారం పొందవచ్చన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి 4200 పంట సాగు హక్కు పత్రాలను అందించాలని లక్ష్యం కాగా, ఇప్పటివరకు 2707 మందికి అందజేశామన్నారు. 80 శాతం రాయితీతో జిల్లాకి 31 డ్రోన్ లను ప్రభుత్వం అందజేసిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని రైతులకు రాయితీపైన 3278 కింటాలు వేరుశనగ విత్తనాలు, 1492 పచ్చి రొట్ట విత్తనాలు సరఫరా చేశామన్నారు. 1870 టన్నుల ఉలవలు 80 శాతం రాయితీతో ఇచ్చామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వివరించారు. చిత్తూరు జిల్లాలో ఎరువుల సరఫరా, విత్తనాల పంపిణీ, వ్యవసాయ యంత్రాల అద్దె, రైతు సేవా కేంద్రాల ద్వారా సాంకేతిక సహాయం వంటి అన్ని రంగాల్లో వ్యవసాయ శాఖ విస్తృత చర్యలు చేపట్టిందని జాయింట్ డైరెక్టర్ ఎం. మురళి తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందకుండా తమ సాగు పనులను కొనసాగించాలని సూచించారు.

