ప్రేమ పెళ్లికి బహుమానం … కూతురికి తండ్రి పిండ ప్రదానం!
బతికే ఉన్న కూతురికి అంత్యక్రియలు చేసిన తండ్రి
చిత్తూరు జిల్లాలో సంచలనం
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : చిత్తూరు జిల్లాలో చోటుచేసుకున్న ఓ కుటుంబ ఘటన ప్రేమ, సంప్రదాయం, కుటుంబ గౌరవం మధ్య ఉన్న ఘర్షణను తీవ్రంగా వెలుగులోకి తెచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న తన సొంత కుమార్తెను బతికే ఉండగానే మృతురాలిగా భావిస్తూ తండ్రి పిండప్రదానం చేయడం గ్రామంలోనే కాకుండా సామాజిక వర్గాల్లో కూడా పెద్ద చర్చకు దారి తీసింది. పితృహృదయం, కుటుంబ పరువు, యువత నిర్ణయం ఈ మూడు ఢీకొన్న సందర్భంగా ఈ ఘటనను స్థానికులు భావిస్తున్నారు.
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు శ్రీరంగరాజపురం మండలంలోని పిల్లారి కుప్పం గ్రామానికి చెందిన సుబ్రమణ్యం రెడ్డి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె హేమప్రియ తిరుపతిలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. చదువుకుంటున్న సమయంలోనే అదే గ్రామానికి చెందిన కిషోర్ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడి, అది క్రమంగా ప్రేమగా మారినట్లు సమాచారం. తమ ప్రేమ విషయం పెద్దలకు చెబితే అర్థం చేసుకుంటారని యువతి భావించినప్పటికీ, తండ్రి ఈ సంబంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాలు మాట్లాడుకుని వివాహం జరపాలని యువకుడి కుటుంబం ప్రయత్నించినప్పటికీ, చదువు పూర్తి కావాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు అంగీకరించలేదని గ్రామస్థులు చెబుతున్నారు. అయితే యువతి తన నిర్ణయంపై నిలబడటంతో, ఇటీవల గుడిలో యువకుడిని వివాహం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన వెంటనే కుటుంబంలో ఉద్రిక్తత పెరిగింది. కూతురు తన మాట వినలేదనే ఆవేదన, కుటుంబ గౌరవం దెబ్బతిందనే భావనతో తండ్రి తీవ్ర మనస్తాపానికి గురయ్యారని చెబుతున్నారు. గురువారం బంధుమిత్రులను పిలిపించి, తన కూతురు చనిపోయిందని ప్రకటించి, ఆమె ఫోటో ముందు మృతుల కోసం చేసే కర్మకాండలను నిర్వహించినట్లు గ్రామస్థులు తెలిపారు. పిండప్రదానం చేయడంతో పాటు, అనంతరం బంధువులకు భోజనాలు వడ్డించినట్టు సమాచారం. నా మాట కాదని వెళ్లిన రోజు నుంచే నాకు కూతురు చనిపోయిందని తండ్రి ఆవేదన వ్యక్తం చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై గ్రామంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు తండ్రి మనోవేదనను అర్థం చేసుకోవాలంటుండగా, మరికొందరు ఇది అతిగా స్పందించిన చర్య అని అభిప్రాయపడుతున్నారు. పెద్దవారైన యువతకు తమ ఇష్టానుసారం వివాహం చేసుకునే హక్కు చట్టపరంగా ఉందని న్యాయ నిపుణులు గుర్తుచేస్తున్నారు. కుటుంబ గౌరవం పేరుతో బంధాలను పూర్తిగా తెంచుకోవడం కన్నా, సంభాషణ ద్వారా పరిష్కారం కనుగొనడం మంచిదని సామాజిక వర్గాలు సూచిస్తున్నాయి. ఈ సంఘటన ప్రేమను అంగీకరించలేని కుటుంబాల ఆవేదనను ఒక వైపు చూపుతుంటే, మరోవైపు మారుతున్న కాలానికి అనుగుణంగా కుటుంబ వ్యవస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లను స్పష్టం చేస్తోంది. భావోద్వేగాలు అధిగమించి బంధాలను కాపాడుకోవాలా? లేక పరువు కోసం సంబంధాలను త్యజించాలా? అన్న ప్రశ్నలను ఈ ఘటన సమాజం ముందుంచింది. ప్రేమ, సంప్రదాయం, కుటుంబ అనుబంధాల మధ్య సమతౌల్యం సాధించడం ఎంత క్లిష్టమో ఈ సంఘటన మరోసారి గుర్తుచేసింది.
గంగ 1 కూతురికి పిండం పెట్టిన తండ్రి

