స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న రాజకీయ పార్టీలు, జిల్లా యంత్రాంగం
నెలరోజుల్లో ముగియను మున్సిపాలిటీలో పదవీకాలం
45 రోజులలో ముజేరు నా పంచాయతీల పదవీకాలం
జూలై నెలతో జిల్లా పరిషత్ మండల పరిషత్ పదవీకాలం పూర్తి
ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తున్న జిల్లా యంత్రాంగం
ఎన్నికల వ్యూహానికి పదును పెడుతున్న రాజకీయ పార్టీలు
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల మోత అధికారికంగా వినిపించకముందే రాజకీయ వేడి గరిష్ట స్థాయికి చేరుకుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లను వేగవంతం చేయగా, అధికార కూటమి దూకుడు పెంచి లోకల్ ఫైట్‌కు సిద్ధమవుతోంది. వైసీపీ పార్టీ ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తూ స్థానిక ఎన్నికలకు సమాయుత్తమవుతుంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లా వంటి రాజకీయంగా ప్రాధాన్య ప్రాంతాల్లో మున్సిపల్ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రతిష్టాత్మక పోరుగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరో నెల రోజుల్లో మున్సిపల్ డీల పదవీకాలం ముగియనుంది. అలాగే 45 రోజులలో పంచాయతీల పదవీకాలం కూడా ముగియనుంది. జూలై నెలలో జిల్లా పరిషత్, మండల పరిషత్తులు కూడా పదవీకాలం ముగియనుంది. శాసనసభ ఎన్నికల విజయోత్సవంతో ఉన్న కూటమి పార్టీలు మరోసారి తన సత్తా చాటడానికి సిద్ధమవుతున్నాయి. జిల్లాలో మరోసారి పట్టు సాధించడానికి వైసిపి పార్టీ ఆందోళన కార్యక్రమాలతో పార్టీ కేడర్ ను పటిష్టం చేస్తుంది. ఎన్నికల బరిలోకి దిగి మనుగడను కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవీకాలం మార్చి నెలలో ముగియనుండగా, సర్పంచుల పదవీకాలం ఏప్రిల్‌లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఈసీ పూర్తి స్థాయి కసరత్తు ప్రారంభించింది. పదో తరగతి పరీక్షలు పూర్తైన అనంతరం ముందుగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి, ఆ తర్వాత సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల దిశగా వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది..చిత్తూరు జిల్లాలో ఎన్నికల యంత్రాంగం ఇప్పటికే సైలెంట్ గా ఎన్నికల ప్రక్రియను పూర్తిచేస్తోంది. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ పర్యవేక్షణలో ఓటర్ల జాబితా సవరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మార్చి 9 నాటికి ఫోటోలతో కూడిన తుది ఓటర్ల జాబితాను విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వడంతో గ్రామ సచివాలయాలు, మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. 2026 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన యువతను ఓటర్ల జాబితాలో చేర్చేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టడం గమనార్హం. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, సున్నిత ప్రాంతాల మ్యాపింగ్, భద్రతా ప్రణాళికలు వంటి అంశాలపై జిల్లా పరిపాలన యంత్రాంగం సమీక్షలు నిర్వహిస్తోంది. పట్టణాల్లో ప్రభుత్వ పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు పోలింగ్ కేంద్రాలుగా గుర్తిస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో సౌకర్యవంతమైన కేంద్రాలను ఎంపిక చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల పరంగా చిత్తూరు కార్పొరేషన్‌తో పాటు పలమనేరు, కుప్పం, నగరి, పుంగనూరు వంటి మున్సిపాలిటీలు కీలకంగా మారాయి. ఈ స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు మార్చి 17తో ముగియనుండటంతో మార్చి రెండో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశముందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ చివరి దశకు చేరుకోగా బీసీ గణన ఆధారంగా కొన్ని వార్డుల్లో రిజర్వేషన్ మార్పులు చోటుచేసుకునే సూచనలు ఉన్నాయి.
గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో చిత్తూరు జిల్లాలో సుమారు 650కి పైగా పంచాయతీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఏప్రిల్ 2తో ప్రస్తుత సర్పంచుల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ తొలి వారంలో పోలింగ్ జరిగే అవకాశముంది. ఇప్పటికే గ్రామాల్లో ఎన్నికల చర్చలు మొదలై, స్థానిక నాయకులు బరిలోకి దిగేందుకు కసరత్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా రాష్ట్ర రాజకీయాల్లో కూటమి వ్యూహం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అధికార కూటమి పార్టీలైన టిడిపి, జనసేన, బీజేపీలు స్థానిక సంస్థల ఎన్నికలు త్వరగా నిర్వహించాలని ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలకు స్థానికంగా పదవులు దక్కే అవకాశం ఉండటంతో ఈ ఎన్నికలపై కూటమి ప్రత్యేక దృష్టి పెట్టినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముందుగా పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి, అక్కడి నుంచి పల్లెల వైపు ఎన్నికల యుద్ధాన్ని తీసుకెళ్లాలనే వ్యూహం ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
పట్టణ ప్రాంతాల్లో కూటమి పార్టీలకు అనుకూల వాతావరణం ఉందనే అంచనాతో మున్సిపల్ ఎన్నికలను కీలకంగా తీసుకుంటున్నారని తెలుస్తోంది. విద్యావంతులు, మధ్యతరగతి, తటస్థ ఓటర్లు పట్టణాల్లో ప్రభావం చూపుతారని కూటమి భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా చిత్తూరు, పలమనేరు, కుప్పం వంటి పట్టణాల్లో ఈ ప్రభావం స్పష్టంగా ఉండే అవకాశముందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక విపక్ష వైసీపీకి ఈ స్థానిక ఎన్నికలు అసలైన రాజకీయ యుద్ధంగా మారనున్నాయి. పట్టణాల్లో కొంత బలం తక్కువగా ఉన్నప్పటికీ గ్రామీణ స్థాయిలో తమ కేడర్ బలంపై వైసీపీ ఆశలు పెట్టుకుంది. బలమైన అభ్యర్థులను ఎంపిక చేయడం, స్థానిక సమస్యలను అజెండాగా తీసుకోవడం, గ్రామస్థాయి నాయకత్వాన్ని చైతన్యపరచడం వంటి వ్యూహాలతో ఎన్నికల రంగంలోకి దిగే అవకాశముందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కూటమి ఉమ్మడిగా పోటీ చేస్తే దానికి ధీటుగా వ్యూహాలు రచించాల్సిన అవసరం వైసీపీ ముందున్న ప్రధాన సవాలుగా మారింది.
ఇక జనగణన 2027 ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు అధికారిక ప్రకటన రావడంతో స్థానిక సంస్థల ఎన్నికలకు ఉన్న అడ్డంకులు తొలగినట్లయ్యాయి. దీంతో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం, ఎన్నికల సంఘం వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఓటర్ల జనాభా ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేసిన అనంతరం ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశముంది. రాజకీయంగా ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడంతో చిత్తూరు జిల్లాలో ఈ ఎన్నికలు మరింత ప్రతిష్టాత్మకంగా మారే సూచనలు ఉన్నాయి. గ్రామాల్లో తాగునీరు, రోడ్లు, సంక్షేమ పథకాల అమలు ప్రధాన ఎన్నికల అజెండాగా మారగా, పట్టణాల్లో మౌలిక వసతులు, పారిశుధ్యం, పట్టణాభివృద్ధి అంశాలు కీలకంగా నిలవనున్నాయి. మొత్తం మీద ఈసీ ప్రిపరేషన్స్ వేగం, కూటమి దూకుడు, విపక్ష వ్యూహాలు అన్ని కలిసి ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను మినీ అసెంబ్లీ ఎన్నికల స్థాయికి తీసుకెళ్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే చిత్తూరు జిల్లాలో లోకల్ ఫైట్ మరింత ఉత్కంఠభరితంగా మారి, గ్రామం నుంచి నగరం వరకు రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చే పోరుగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

