9, ఫిబ్రవరి 2026, సోమవారం

జిల్లాను కుదిపేస్తున్న బర్డ్ ఫ్లూ కలకలం

బర్డ్ ప్లూతో సదం మండలంలో 28 వేల కోళ్ల మృతి
కార్వేటి నగరంలో 8 వేల కోళ్ల మృతి
రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు రాక 
జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం 
శాంపిల్స్ మహారాష్ట్ర ల్యాబ్ కు పంపిన అధికారులు

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)

ఆంధ్రప్రదేశ్ దక్షిణ భాగంలో పౌల్ట్రీ రంగానికి ప్రధాన కేంద్రమైన చిత్తూరు జిల్లాలో మరోసారి బర్డ్ ఫ్లూ భయం అలుముకుంది. కోళ్ల ఫారాల్లో అనూహ్య మరణాలు, రైతుల ఆందోళన, మార్కెట్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో జిల్లా యంత్రాంగం అత్యవసర చర్యలకు దిగింది. పక్కనే ఉన్న అన్నమయ్య జిల్లాలో వ్యాధి నిర్ధారణ కావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పశుసంవర్ధక శాఖ రాష్ట్ర డైరెక్టర్ దామోదర్ నాయుడు కార్వేటి నగరం మండలంలో పర్యటించారు. కోళ్ల ఫారాలను సందర్శించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం జరిగింది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి డాక్టర్ల టీము ఏర్పాటు చేశారు. చనిపోయిన కోళ్ల శాంపిల్స్ ను నిర్ధారణ కోసం మహారాష్ట్రలోని ల్యాబ్ కి పంపారు. ల్యాబ్ రిపోర్ట్స్ మంగళవారం అందే అవకాశాలు ఉన్నాయి.

ఫిబ్రవరి 2026లో పరిస్థితి ఒక్కసారిగా విషమించింది. అన్నమయ్య జిల్లాలోని సదుం మండలం పరిధిలోని పుట్టవారిపల్లి, అమ్మగారిపల్లి, కంభంవారిపల్లి గ్రామాల్లో పెద్దఎత్తున 28 వేల కోళ్లు చనిపోవడంతో వెటర్నరీ అధికారులు అప్రమత్తమయ్యారు. సేకరించిన నమూనాలను పరీక్షల కోసం పంపగా బర్డ్ ఫ్లూ వైరస్ ఉన్నట్లు ప్రయోగశాల ధృవీకరించింది. ఈ వార్త వెలుగులోకి రావడంతో చుట్టుపక్కల జిల్లాలన్నీ అలర్ట్ అయ్యాయి. చిత్తూరు జిల్లాలోనూ కలవరపెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కార్వేటినగరం మండలం పరిధిలో ముఖ్యంగా ఆర్‌.కె.పేట ప్రాంతం చుట్టూ కోళ్ల మరణాలు అధికంగా నమోదవుతున్నాయి. ఇప్పటివరకు ఎనిమిది వేలకు పైగా కోళ్లు మరణించినట్లు సమాచారం. ఈ విషయం ఫారాల యజమానులు పశుసంవర్ధక శాఖ అధికారులకు తెలియజేయడంతో వెంటనే అధికారులు నమూనాలు సేకరించి పరీక్షల కోసం పంపారు. అనుమానిత ప్రాంతాల్లో కోళ్ల రవాణాను తాత్కాలికంగా నిలిపివేసి పర్యవేక్షణ పెంచారు. హుటాహుటిన పశుసంవర్ధక శాఖ రాష్ట్ర డైరెక్టర్ దామోదర్ నాయుడు చిత్తూరు జిల్లాకు విచ్చేశారు. కార్వేటి నగరం మండలంలో కోళ్లు మృతి చెందిన షెడ్లను సందర్శించారు. తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలను వివరించారు. జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్ ఆదివారం అత్యవసరంగా జిల్లా స్థాయి సమావేశం ఏరటు చేశారు. ఈ ఆపద నుంచి గట్టెక్కించడానికి ఒక డాక్టర్ల టీం ఏర్పాటు చేశారు. దీంతో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ రంగంలోకి దిగి నియంత్రణ చర్యలు వేగవంతం చేశాయి. వ్యాధి నిర్ధారణైన ప్రాంతాల్లో కోళ్లను నిర్మూలించే ప్రక్రియ  చేపట్టారు. ఫారాల చుట్టూ శానిటైజేషన్ పనులు, క్వారంటైన్ నిబంధనలు అమలు చేస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల చుట్టూ ఒక కిలోమీటరు పరిధిని ఇన్‌ఫెక్టెడ్ జోన్‌గా, 10 కిలోమీటర్ల పరిధిని నిఘా జోన్‌గా ప్రకటించి వాహనాల రాకపోకలను నియంత్రించారు.

గతంలోనూ జిల్లాను కుదిపేసిన బర్డ్ ప్లూ 

ఈ పరిణామం కొత్తది కాదని పౌల్ట్రీ రైతులు గుర్తుచేస్తున్నారు. 2024 ఫిబ్రవరిలో నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ బయటపడినప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గుడ్ల, మాంసం విక్రయాలు భారీగా పడిపోయాయి. అంతకుముందు 2006లో దేశవ్యాప్తంగా పక్షి జ్వరం వ్యాపించినప్పుడు కూడా అనేక ఫారాలు మూతపడ్డాయి. అప్పటినుంచి కష్టపడి నిలదొక్కుకున్న రంగం మళ్లీ కుదేలవుతుందేమోనన్న భయం రైతులను వెంటాడుతోంది. సదుం మండలంలోనే సుమారు 28 వేల కోళ్లు మరణించినట్లు అంచనా. ఒక్కో ఫారం లక్షల్లో నష్టపోతోంది. కోళ్ల మరణాలతో పాటు మార్కెట్ పరిస్థితి మరింత దారుణం. ప్రజల్లో వ్యాధి భయం పెరగడంతో చికెన్ కొనుగోలు తగ్గిపోయింది. హోటళ్లు, ఫంక్షన్లలో వినియోగం తగ్గడంతో ధరలు క్షీణించాయి. గుడ్ల మార్కెట్ కూడా ప్రభావితమైంది.

చికెన్, గుడ్లు ఎగుమతి బంద్

రవాణా ఆంక్షల కారణంగా ఇతర జిల్లాలకు కోళ్లు, గుడ్లు పంపడం ఆగిపోయింది. ఎగుమతుల నిలిపివేతతో వ్యాపారం స్తంభించింది. పౌల్ట్రీపై ఆధారపడిన వేలాది కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. కోళ్ల మేత కోసం మొక్కజొన్న, సోయాబీన్ పండించే రైతులకు కూడా డిమాండ్ తగ్గింది. నిర్మూలన చర్యల్లో ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించినప్పటికీ, అది రైతుల పెట్టుబడులకు సరిపోదని వాపోతున్నారు. ఫీడ్ ఖర్చులు, మందులు, విద్యుత్ బిల్లులు అన్ని కలిపి భారీ పెట్టుబడులు పెట్టిన రైతులు అప్పుల బారిన పడుతున్నారు. బ్యాంకు రుణాలు, ప్రైవేట్ అప్పులు చెల్లించలేని పరిస్థితి నెలకొంది.

చికెన్ 70 డిగ్రీల సెల్సియస్  ఉడికించి తినాలి 

ఆరోగ్య పరంగా మనుషులకు వైరస్ సోకే ప్రమాదం తక్కువేనని అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు. చికెన్, గుడ్లను కనీసం 70 డిగ్రీల సెల్సియస్ పైగా ఉడికించి తినాలని సూచిస్తున్నారు. ఫారాల్లో బయోసెక్యూరిటీ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, అనుమానాస్పద మరణాలు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద చిత్తూరు  అన్నమయ్య జిల్లాల్లో బర్డ్ ఫ్లూ ప్రభావం వ్యవసాయ అనుబంధ రంగానికి గట్టి దెబ్బగా మారింది. రైతుల భవిష్యత్తు, మార్కెట్ స్థిరత్వం, ప్రజల నమ్మకం ఈ మూడు అంశాలు ఇప్పుడు పరీక్షకు లోనవుతున్నాయి. పరిస్థితి అదుపులోకి రావాలంటే కఠిన నియంత్రణ చర్యలతో పాటు రైతులకు తగిన ఆర్థిక సాయం అందించాలని పౌల్ట్రీ రంగ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ సంక్షోభం నుంచి రంగం ఎంత త్వరగా కోలుకుంటుందన్నదే ఇప్పుడు కీలకం.

గంగ 2 కోళ్ళు

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *