కాణిపాకం ఆలయానికీ కల్తీ నెయ్యి సరఫరా !
సిబ్బంది హెచ్చరించినా పట్టించుకోని అధికారులు
తీవ్రంగా దెబ్బతిన్న భక్తుల మనోభావాలు
భక్తుల్లో ఆగ్రహం, సమగ్ర దర్యాప్తు డిమాండ్
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)
ఆధ్యాత్మిక క్షేత్రంగా పేరొందిన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం పేరు ఇప్పుడు కల్తీ నెయ్యి వివాదంలో వినిపించడం భక్తులను కలవరపెడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వెలుగులోకి వస్తున్న కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో కాణిపాకం ఆలయానికీ నాసిరకం నెయ్యి అందినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం అభియోగపత్రంలో ప్రస్తావించడంతో ఈ అంశం సంచలనంగా మారింది. ఈ విషయమై కానిపాక మాలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పెంచల కిషోర్ మాట్లాడుతూ కల్తీ నెయ్యి విషయమై లెక్కలు తీస్తున్నామన్నారు. ఈ విషయమై విచారణ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
దర్యాప్తు వివరాల ప్రకారం, ఆలయాల్లో ప్రసాదాల తయారీలో వినియోగించిన నెయ్యి సరఫరాలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. టెండర్ ప్రక్రియలో ఎంపికైన సరఫరాదారులు బ్రాండ్ పేర్లు చూపించి, వాస్తవానికి రసాయన మిశ్రమంతో తయారైన నెయ్యిని అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా సుమతి ట్రేడర్స్ సంస్థ కాణిపాకానికి సరఫరా చేసిన నెయ్యి, వైష్ణవి డెయిరీ నుంచి తెచ్చినదేనని దర్యాప్తులో తేలిందని సమాచారం. కాణిపాకంలో రోజువారీగా తయారయ్యే లడ్డూలు, ఇతర ప్రసాదాల్లో గణనీయంగా నెయ్యి వినియోగం జరుగుతుంది. ఏటా లక్ష కిలోలకు పైగా నెయ్యి అవసరమవుతుందని అంచనా. ఈ నేపథ్యంలో నాసిరకం నెయ్యి వినియోగం జరిగిందనే విషయం భక్తుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఆలయ సిబ్బంది గతంలోనే నెయ్యి నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేసినా, వాటిని పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం ప్రభుత్వ లేదా విశ్వసనీయ ప్రయోగశాలల్లో నాణ్యత పరీక్షలు జరపాల్సి ఉండగా, సరఫరాదారే చెందిన ల్యాబ్‌లో పరీక్షించిన నివేదికలను సమర్పించినట్లు దర్యాప్తులో బయటపడింది. అంటే నెయ్యి ఇచ్చిన సంస్థే దాని నాణ్యతకు ధృవీకరణ ఇచ్చినట్టవడంతో పర్యవేక్షణ వ్యవస్థపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇంతకుముందు సహకార డెయిరీల నుంచే నెయ్యి కొనాలన్న విధానాన్ని సడలించి, ఇతర సరఫరాదారులకు అవకాశమివ్వడం వల్లే ఈ దందా సాగిందని నిపుణులు భావిస్తున్నారు. నియంత్రణలో లోపాలు, అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణలో వైఫల్యం కలిసివచ్చి భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసినట్లయింది. కాణిపాకం వినాయక స్వామిని దర్శించుకునే లక్షలాది మంది భక్తులు ఇప్పుడు ఆగ్రహంతో ఉన్నారు. ప్రసాదం అనేది దేవుని ఆశీర్వాదంగా భావిస్తాం. దాంట్లో కల్తీ ఎలా అనుమతించారు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సరఫరా చేసిన నెయ్యి పరిమాణం, నాణ్యత, అధికారుల పాత్ర, ల్యాబ్ ధృవీకరణల నిజానిజాలు ఇవన్నీ సమగ్రంగా వెలికితీయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం కేవలం ఆర్థిక అక్రమం మాత్రమే కాక, భక్తి విశ్వాసానికి సంబంధించినది. కాణిపాకం వంటి పురాతన క్షేత్రంలో ఇలాంటి ఘటన వెలుగులోకి రావడం దేవాదాయ శాఖకు పెద్ద పరీక్షగా మారింది. నాణ్యత నియంత్రణ వ్యవస్థను పునఃపరిశీలించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటేనే భక్తుల్లో నమ్మకం పునరుద్ధరించవచ్చని భావిస్తున్నారు.
సిబ్బంది ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులు
కాణిపాకం వరసిద్ధి వినాయక సుమతి ట్రేడర్స్ కిలో రూ.555 ధరతో తిరుమల, వైష్ణవి, నందిని, విజయ, డెయిరీల బ్రాండ్‌లలో ఏదైనా నెయ్యి కాణిపాకం ఆలయానికి సరఫరా చేస్తామని పేర్కొంది. అయితే దాదాపు సంవత్సరంపాటు వైష్ణవి డెయిరీ నెయ్యినే సప్లై చేసింది. వైష్ణవి బ్రాండ్ నెయ్యిని కిలో రూ.532 ధరతో అందిస్తామని చెప్పి, అదే అందజేసింది. కల్తీ నెయ్యిని గుర్తించిన కాణిపాకం ఆలయ పోటు సిబ్బంది అప్పట్లోనే అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. వైష్ణవి డెయిరీ అందించిన నాసిరకం నెయ్యి వేసవిలోనూ గడ్డకట్టేదని, వాసన కూడా ఉండేది కాదని ఇదే అనుభవం కాణిపాకం ఆలయంలోని సిబ్బందికి ఎదురైనట్లు తెలుస్తుంది. ఇలా విచ్చలవిడిగా సరఫరా అవుతున్న నెయ్యి నాణ్యతను ప్రభుత్వం రంగ సంస్థలకు చెందిన ల్యాబ్లతో గానీ మంచి పేరున్న కో ఆపరేటివ్ డెయిరీల ల్యాబ్లలో గానీ పరీక్షించాలి. ఆ నివేదికల ప్రకారం నెయ్యి స్వచ్ఛత వివరాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ సుమతి ట్రేడర్స్ సంస్థ కాణిపాకం, శ్రీకాళహస్తిల ఆలయాలకు నెయ్యి సరఫరా చేసి, వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ ల్యాబ్‌లో పరీక్షించిన నివేదికలు సమర్పించింది. అంటే వైష్ణవి డెయిరీ నుంచి నెయ్యిని సేకరించిన సుమతి ట్రేడర్స్ అదే డెయిరీకి చెందిన ల్యాబ్ రిపోర్ట్‌లను సమర్పించగా అధికారులు వాటినే పరిగణనలోకి తీసుకున్నారు. ఇదే నాణ్యత పరీక్షల్లో డొల్లతనానికి పెద్ద ఉదాహరణగా నిలుస్తుంది.
మూడేళ్ల క్రితమే నిబంధనలు మార్చేశారు
2019 మేలో దేవాదాయ కమిషనర్ నిబంధనల ప్రకారం ప్రధాన దేవస్థానాలకు కావాల్సిన నెయ్యి, పాలను టెండర్లు లేకుండానే సహకార డెయిరీల నుంచి కొనాలని తెలిపింది. 2022 ఏప్రిల్ 25న అప్పటి కమిషనర్ ఈ నిబంధనలు మార్చి పాల ఉత్పత్తులు, ఆవు నెయ్యి సరఫరా చేసేందుకు అన్ని డెయిరీలు, రిటైల్ సరఫరాదారులు, డీలర్లకు అవకాశమివ్వాలని సూచించింది. దీన్ని అవకాశంగా తీసుకుని సుమతి ట్రేడర్స్, వినాయక ఏజెన్సీస్, వంటి సంస్థలు కల్తీ దందా మొదలుపెట్టాయి. ఇదిలా కొనసాగగా నెయ్యి నాణ్యతపై ఫిర్యాదులు రావడంతో నాణ్యత పరీక్షలు ఖచ్చితంగా చెయ్యాలంటూ దేవాదాయ శాఖ కమిషనర్ 2023 మార్చిలో ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రసిద్ధి చెందిన ల్యాబ్‌లో గానీ ప్రభుత్వ ల్యాబ్స్‌లో గానీ పరీక్షలు చేయించి, ఆ సర్టిఫికెట్‌ను సమర్పించాలని నిబంధన పెట్టింది. ఇక్కడే ‘సుమతి ట్రేడర్స్ ప్రసిద్ధి చెందిన ల్యాబ్’ అన్న నిబంధనను తమకు అనుకూలంగా మార్చుకుంది. కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాలకు వైష్ణవి డెయిరీ నెయ్యిని సరఫరాచేసి, అదే సంస్థకు చెందిన ల్యాబ్ నుంచే నాణ్యత ధ్రువీకరణ పత్రం తీసుకొచ్చి ఇచ్చింది.
సమగ్ర విచారణకు డిమాండ్
ఇప్పటి వరకూ టీటీడీ లడ్డూలోనే కల్తీ నెయ్యి వినియోగం జరిగిందని అనుకున్నప్పటికీ ప్రధాన ఆలయాల్లోనూ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు దేవస్థానాలకు నాణ్యతలేని, కల్తీ నెయ్యి సరఫరా అయినట్లు సిట్ పేర్కొంది. ఈ అంశంపై దేవాదాయశాఖ మరింత లోతుగా విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు వెలుగుచూసే ఆస్కారముంది. ఏయే సంస్థలు, ఏఏ ఆలయాలకు ఎంత నెయ్యి అందించాయి? వాటి నాణ్యతపై ఏమైనా ఫిర్యాదులు వచ్చాయా? వాటిపై యంత్రాంగం చర్యలు తీసుకుందా? ఎవరి ప్రమేయంతో కల్తీ నెయ్యి సరఫరా జరిగింది? అధికారులు తెలిసే ఆ నెయ్యి కొనుగోలు చేశారా? వంటి పలు అంశాలపై లోతైన విచారణ జరపాలనే డిమాండ్ తెరమీదకు వస్తుంది. కోఆపరేటివ్ డెయిరీ నెయ్యినే తీసుకోవాలన్న నిబంధనను సడలించి ఇతర రిటైల్ వ్యాపారులు, డీలర్లు,డెయిరీలకు అవకాశం ఇవ్వడం వెనుక ఉన్న అసలు కథేంటని తేల్చాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
గంగ 1 కాణిపాకం

