చిత్తూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ
కార్వేటినగరం మండలం ఆర్కేవిబీ పురంలో వైరస్
ఇప్పటి వరకు 1,825 కోళ్లు మృతి
మిగిలిన 11,225 కోళ్లను ఖాళీ చేయించిన అధికారులు
ఇతర మండలాలకు సోకకుండా ముందు జాగ్రత్త చర్యలు
పశుసంవర్ధక శాఖ జేడి ఉమామహేశ్వరి ఆధ్వర్యంలో చర్యలు
ఆందోళన చెందుతున్న కోళ్ల రైతులు
ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు
చిత్తూరు జిల్లాలో కూడా బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయ్యింది. బర్డ్ ప్లూ నిర్ధారణ కావడంతో జిల్లాలోని కోళ్ల రైతులు అప్రమత్తం అవుతున్నారు. జిల్లా ప్రస్తుతామర్థక శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇతర మండలాలకు ఈ వ్యాధి వ్యాప్తి కాకుండా టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. అవసరమైన ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటున్నారు. చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం ఆర్‌కేవీబీపేట ప్రాంతంలో కోళ్ల అనూహ్య మరణాలు చోటుచేసుకోవడంతో పరిస్థితి అత్యవసర దశకు చేరింది. మృత కోళ్ల నమూనాలను పరీక్షల కోసం మహారాష్ట్ర ప్రయోగశాలకు పంపగా, మంగళవారం రాత్రి అందిన నివేదికలో బర్డ్ ఫ్లూ వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. దీంతో పశుసంవర్ధక శాఖ యంత్రాంగం అప్రమత్తమై కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు ప్రారంభించింది.
జిల్లా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకురాలు ఉమామహేశ్వరి ఆర్‌కేవీబీపేటకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బుధవారం వరకు ఆ ప్రాంతంలో 1,825 కోళ్లు మృతి చెందినట్లు, మిగిలిన 11,225 కోళ్లను ఖాళీ చేయించినట్లు వెల్లడించారు. గ్రామంలోని కోళ్ల షెడ్లన్నింటిని ఖాళీ చేసి శుద్ధి చర్యలు చేపట్టారు. మృత కోళ్లను ట్రాక్టర్ల ద్వారా తరలించి, యంత్రాల సహాయంతో లోతైన గోతుల్లో పాతిపెట్టారు. గ్రామ సచివాలయం ప్రజలకు హెచ్చరిక జారీ చేస్తూ, అనుమానాస్పద పరిస్థితుల్లో కోళ్ల మాంసం, గుడ్లు కొన్ని రోజులపాటు వినియోగించవద్దని కోరింది. అన్నమయ్య జిల్లాలోనూ ఇదే వైరస్ ధృవీకరణ కావడంతో రెండు జిల్లాల్లో అప్రమత్తత మరింత పెరిగింది. సదుం మండల పరిధిలోని పుట్టవారిపల్లి, అమ్మగారిపల్లి, కంభంవారిపల్లి గ్రామాల్లో భారీగా కోళ్ల మరణాలు సంభవించడంతో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు ప్రత్యక్షంగా పర్యటించి ఫారాలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించి వైద్యుల ప్రత్యేక బృందాలు, రాపిడ్ స్పందన బృందాలను రంగంలోకి దింపారు.
వ్యాధి నిర్ధారణైన ప్రాంతాల్లో ఒక కిలోమీటరు పరిధిని సోకిన మండలంగా, పది కిలోమీటర్ల పరిధిని నిఘా మండలంగా ప్రకటించి కోళ్ల రవాణాపై ఆంక్షలు విధించారు. ఫారాల చుట్టూ శుద్ధి, క్వారంటైన్ నిబంధనలు అమలు చేస్తున్నారు. ప్రజల్లో అపోహలు వ్యాపించకుండా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇది కొత్త సంక్షోభం కాదని రైతులు చెబుతున్నారు. గతంలో కూడా బర్డ్ ఫ్లూ ప్రభావంతో మార్కెట్ కుదేలైన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చికెన్, గుడ్ల వినియోగం పడిపోవడంతో ధరలు క్షీణించాయి. ఇతర జిల్లాలకు సరఫరాలు నిలిచిపోవడంతో వ్యాపారం దెబ్బతింది. పౌల్ట్రీపై ఆధారపడిన కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితి నెలకొంది. కోళ్ల మేత కోసం పంటలు పండించే రైతులకూ డిమాండ్ తగ్గింది. ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించినప్పటికీ, అది సరిపోదని రైతులు వాపోతున్నారు.
ఆరోగ్య పరంగా మనుషులకు వైరస్ సోకే ప్రమాదం తక్కువేనని అధికారులు స్పష్టం చేస్తూనే జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. చికెన్ లోపలి భాగం కనీసం 75 డిగ్రీల సెల్సియస్ వరకు, ప్రస్తుత పరిస్థితుల్లో 100 డిగ్రీల వరకు బాగా ఉడికించి తినాలని హెచ్చరిస్తున్నారు. అనుమానాస్పద మరణాలు గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. మొత్తం మీద చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో బర్డ్ ఫ్లూ ప్రభావం పౌల్ట్రీ రంగానికే కాక వ్యవసాయ అనుబంధ రంగాలకూ గట్టి దెబ్బగా మారింది. నియంత్రణ చర్యలు, ఆర్థిక సాయం, ప్రజల నమ్మకం ఈ మూడు అంశాలపై ప్రభుత్వం సమర్థంగా స్పందిస్తేనే పరిస్థితి త్వరగా సాధారణ స్థితికి చేరుతుందని రంగ నిపుణులు భావిస్తున్నారు.

