పేద ప్రజలకు ఆరోగ్య భరోసా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ
3,257 రకాల వైద్య ప్రక్రియలు, 138 రకాల చికిత్సలు
జిల్లా వ్యాప్తంగా 74 నెట్‌వర్క్ ఆసుపత్రులలో సేవలు
ఉద్యోగులు, జర్నలిస్టులకు ప్రత్యే పథకాలు
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)
చిత్తూరు జిల్లాలో సామాన్య ప్రజల ఆరోగ్య రక్షణను ధ్యేయంగా పెట్టుకుని అమలవుతున్న డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పుకు నాంది పలుకుతోంది. మహానటుడు, ప్రజానాయకుడు నందమూరి తారక రామారావు పేరుతో కొనసాగుతున్న ఈ పథకం వైద్య సేవలు పేద ప్రజలకు వరంగా మారుతుంది. ఈ పథకం కారణంగా జిల్లాలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు అక్షరాలా ప్రాణ రక్షకంగా మారింది. ఖరీదైన శస్త్రచికిత్సలు ఇక నగదు రహితంగా అందుబాటులోకి రావడం ఆరోగ్య రంగంలో చారిత్రాత్మక అడుగుగా భావిస్తున్నారు. ఇప్పటి వరకు పెద్ద వ్యాధి అంటే కుటుంబానికి ఆర్థిక సంక్షోభమే. గుండె శస్త్రచికిత్స, క్యాన్సర్ చికిత్స, అవయవ మార్పిడి వంటి చికిత్సలకు 10 నుంచి 20 లక్షల వరకు ఖర్చవుతుండేది. తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు ఇది జీవిత భరోసాగా మారింది.
చిత్తూరు జిల్లాలో ఈ పథకం కింద మొత్తం 3,257 రకాల వైద్య ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 138 రకాల ఫాలో అప్ చికిత్సలు కూడా ఉన్నాయి. గుండె సంబంధిత వ్యాధుల్లో బైపాస్ సర్జరీలు, వాల్వ్ మార్పిడి వంటి క్లిష్ట శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. క్యాన్సర్ చికిత్సలో రేడియేషన్, కీమోథెరపీ, సర్జరీలు కవర్ అవుతున్నాయి. కిడ్నీ, లివర్ మార్పిడి, బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ వంటి అత్యంత ఖరీదైన చికిత్సలు కూడా పథకంలో భాగం కావడం విశేషం. మోకాళ్ల మార్పిడి, హిప్ రీప్లేస్‌మెంట్ వంటి కీళ్ల శస్త్రచికిత్సలు వృద్ధులకు ఉపశమనం ఇస్తున్నాయి. మెదడు, వెన్నెముక శస్త్రచికిత్సలు, డయాలసిస్, స్త్రీ శిశు వైద్యం, కంటి శస్త్రచికిత్సలు ఇలా అన్ని విభాగాలు సమగ్రంగా చేరడం పథక విస్తృతిని చూపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 74 నెట్‌వర్క్ ఆసుపత్రులు సేవలందిస్తున్నాయి. ప్రభుత్వ రంగంలో చిత్తూరు, కుప్పం, నగరి ప్రాంతాల్లో ప్రధాన ఆసుపత్రులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. గ్రామీణ ప్రజలకు చేరువగా 47 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 7 సామాజిక ఆరోగ్య కేంద్రాలు రిఫరల్ సేవలు అందిస్తున్నాయి. పుంగనూరు, పలమనేరు, కార్వేటినగరం వంటి దూర ప్రాంతాల ప్రజలు స్థానికంగానే ప్రాథమిక సేవలు పొందుతున్నారు. ప్రైవేట్ రంగంలో కూడా పలువురు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు భాగస్వామ్యమవడంతో అత్యున్నత వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి.
శస్త్రచికిత్స చేసుకున్న రోగికి నెలకు 5 వేలు సహాయం
వైద్య చికిత్స తర్వాత కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఆరోగ్య ఆసరా ప్రత్యేకంగా సహకరిస్తోంది. శస్త్రచికిత్స అనంతరం రోగి విశ్రాంతి కాలంలో రోజుకు రూ.225 చొప్పున, నెలకు గరిష్టంగా రూ.5,000 వరకు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే సుమారు 1.94 లక్షల మందికి రూ.103 కోట్లకు పైగా ఆసరా నిధులు విడుదలయ్యాయి. ఇది వైద్యం తర్వాత కుటుంబానికి ఉపశమనం కలిగిస్తోంది. నిధుల వ్యయ పరంగా చూస్తే చిత్తూరు జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో ఉంది. 2019 2023 మధ్య సుమారు 15 లక్షల చికిత్సలకు రూ.337 కోట్లు ఖర్చయ్యాయి. 2025 26 ఆర్థిక సంవత్సరంలో జనవరి నాటికే లక్షకు పైగా రోగులకు రూ.203 కోట్ల వ్యయం జరిగింది. కోవిడ్ సమయంలో 27 వేల మందికి పైగా ఉచిత వైద్యం అందించడం పథకం సామర్థ్యాన్ని నిరూపించింది.
రోగుల సహాయానికి ఆరోగ్య మిత్రలు
ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రతి నెట్‌వర్క్ ఆసుపత్రిలో ఆరోగ్య మిత్రలు నియమించారు. ఆసుపత్రుల్లో ప్రవేశం నుంచి డిశ్చార్జ్ వరకు రోగికి మార్గనిర్దేశం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 40 హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు. సేవల్లో పారదర్శకత కోసం సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ కొనసాగుతోంది. ఇప్పటికే జిల్లాలో 4.73 లక్షల ఆరోగ్య కార్డులు పంపిణీ చేశారు. ప్రతి కుటుంబానికి ఈ కార్డు ఆరోగ్య భద్రత పత్రంగా మారింది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూక్తిని సాక్షాత్కారం చేస్తూ, పేద కుటుంబాలకు అత్యున్నత వైద్యం అందించే మార్గాన్ని ఈ పథకం తెరిచింది. రూ.25 లక్షల పరిమితి పెంపు చిత్తూరు జిల్లాలో ఆరోగ్య రంగంలో మలుపు తిప్పిన నిర్ణయంగా నిలిచిపోనుంది. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ 104, ఉద్యోగులు, జర్నలిస్టుల పథకాల కోసం 1800 425 1818, టెలి మెడిసిన్ సేవలకు 14410 నంబర్లను సంప్రదించవచ్చు. ఆరోగ్య భద్రత ప్రతి కుటుంబ హక్కు అనే భావనను కార్యరూపంలో చూపిస్తున్న ఈ పథకం, చిత్తూరు జిల్లాను ఆరోగ్య పరంగా ఆదర్శంగా నిలబెడుతోంది.
గంగ 1 డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలు

