పలమనేరులో అత్యాధునిక రైల్వేస్టేషన్
హైస్పీడ్ కారిడార్‌తో మారనున్న పట్టణ భవిష్యత్
భారీ పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమం
వ్యవసాయ ఉత్పత్తులైన మామిడి, టమాటో రవాణాకు సౌకర్యం
పట్టు పరిశ్రమకు మరింత ఊతం
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.)
స్వాతంత్ర్యం వచ్చిన దాదాపు 80 సంవత్సరాల తర్వాత పలమనేరు ప్రాంత ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న చారిత్రక క్షణం సాకారం కానున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు రైల్వే మ్యాప్‌లో పలమనేరుకు స్థానం లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రణాళిక చేస్తున్న హైస్పీడ్ రైల్వే కారిడార్ల ద్వారా జాతీయ రవాణా వ్యవస్థలో ఒక ముఖ్య కేంద్రంగా పలమనేరు ఎదగబోతోంది. బెంగళూరు–విజయవాడ హైస్పీడ్ రైల్వే కారిడార్‌తో పాటు చెన్నై, బెంగళూరు బుల్లెట్ రైలు ప్రాజెక్టుల పుణ్యమా అని పలమనేరులో ఆధునిక రైల్వే స్టేషన్ ఏర్పాటు దిశగా ప్రణాళికలు వేగం అందుకున్నాయి. పలమనేరులో రైల్వే స్టేషన్ ఏర్పాటయితే వ్యవసాయ ఉత్పత్తులైన మామిడి, టమాటో, కూరగాయలు, ఆకుకూరలు ఇటు చెన్నై అటు బెంగుళూరులకు తక్కువ సమయంలో సరఫరా చేయవచ్చును. భారీ శ్రమ పరిశ్రమల ఏర్పాటుకు కూడా మార్గం సుగమం అవుతుంది. పలమనేరు పారిశ్రామిక హక్కుగా కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ప్రస్తుతం పలమనేరు ప్రజలు రైలు ఎక్కాలంటే కుప్పం లేక చిత్తూరుకు వెళ్లాల్సిన అవసరం ఉండేది. భవిష్యత్తులో పలమనేరు రైల్వే జంక్షన్ గా కూడా అభివృద్ధి చెందే అవకాశాలు కల్పిస్తున్నాయి.
పశ్చిమ చిత్తూరు జిల్లాలో వాణిజ్యపరంగా, భౌగోళికంగా కీలక స్థానంలో ఉన్న పలమనేరు ఇప్పటివరకు రైల్వే సౌకర్యాలు లేకపోవడంతో అభివృద్ధిలో కొంత వెనుకబడిన పట్టణంగా ఉంది. విద్య, ఉపాధి, వైద్య, వ్యాపార అవసరాల కోసం బెంగళూరు, చెన్నై, తిరుపతి వంటి మహానగరాలకు ప్రయాణించే ప్రజలు రోడ్డు మార్గంపైనే ఆధారపడాల్సి వచ్చేది. అయితే హైస్పీడ్ రైల్వే స్టేషన్ నిర్మాణం ద్వారా ఈ పరిస్థితి పూర్తిగా మారబోతోంది. చెన్నై, బెంగళూరు హైస్పీడ్ రైలు (బుల్లెట్ ట్రైన్) కారిడార్ ప్రాజెక్ట్‌లో భాగంగా పలమనేరు వద్ద ఆధునిక హైస్పీడ్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసే ప్రతిపాదనకు ప్రాధాన్యం లభించినట్టు సమాచారం. నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ పర్యవేక్షణలో రూపుదిద్దుకుంటున్న ఈ కారిడార్ మొత్తం సుమారు 435 కిలోమీటర్ల మేర చెన్నై, బెంగళూరు, మైసూరు వరకు విస్తరించనుంది. ఈ రైలు మార్గం ప్రధానంగా చెన్నై, బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌వేకు సమాంతరంగా నిర్మాణం కానుంది. చిత్తూరు జిల్లాలో సుమారు 77 కిలోమీటర్ల మేర సాగనుంది. చెన్నై, పూనమల్లి, అరక్కోణం, చిత్తూరు, యాదమరి, బంగారుపాళ్యం, పలమనేరు మీదుగా నంగిలి వద్ద కర్ణాటక రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. బంగారుపేట, బెంగళూరు వంటి కీలక ప్రాంతాలను అనుసంధానించేలా అలైన్‌మెంట్ ప్రణాళిక సిద్ధమవుతోంది.
ఇదే సమయంలో బెంగళూరు, విజయవాడ హైస్పీడ్ రైల్వే కారిడార్‌లో కూడా పలమనేరు ఒక వ్యూహాత్మక మధ్యస్థానంగా మారనున్న అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కారిడార్ బెంగళూరు నుంచి కోడికొండ, పులివెందుల, కడప, అద్దంకి మార్గంగా విజయవాడ వరకు విస్తరించనుండగా, పలమనేరు ప్రాంతానికి ఈ మార్గంతో అనుసంధానం కల్పించడం ద్వారా రాయలసీమ, కోస్తా, ఆంధ్ర మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. దీంతో పలమనేరు ప్రాంతం రవాణా పరంగా ఒక ముఖ్య జంక్షన్‌గా రూపుదిద్దుకోనుంది. రైల్వే ప్రాజెక్టులతో పాటు బెంగళూరు, చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే అలైన్‌మెంట్ కూడా పలమనేరు సమీప ప్రాంతాలైన బైరెడ్డిపల్లె, వీ.కోట మార్గంగా సాగుతుండటం పట్టణ అభివృద్ధికి మరింత ఊతం ఇవ్వనుంది. రైల్వే స్టేషన్‌తో పాటు లాజిస్టిక్ హబ్ ఏర్పాటు చేసే అవకాశాలపై కూడా అధికార స్థాయిలో చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. భూసేకరణ ప్రక్రియ తుది దశకు చేరుకుంటున్నట్టు స్థానిక వర్గాలు పేర్కొంటున్నాయి.
హైస్పీడ్ కారిడార్‌లో రైళ్లు గంటకు 320 నుంచి 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ట్రాక్‌లను రూపకల్పన చేస్తున్న నేపథ్యంలో పలమనేరు నుంచి బెంగళూరు, చెన్నై, విజయవాడ వంటి నగరాలకు ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. ఇది విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది. ముఖ్యంగా గ్రానైట్, పాలు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ఈ రైల్వే లైన్ కీలక మౌలిక వసతిగా నిలిచే అవకాశం ఉంది. పలమనేరు పరిసరాల్లో ఇప్పటికే ఉన్న పారిశ్రామిక ప్రాంతాలు ఈ ప్రాజెక్ట్ వల్ల కొత్త ఊపిరి పొందనున్నాయి. రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో కొత్త పరిశ్రమలు, గోదాములు, వాణిజ్య కేంద్రాలు ఏర్పడి స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని నిపుణులు భావిస్తున్నారు. రైల్వే స్టేషన్ నిర్మాణం, నిర్వహణ, అనుబంధ సేవల ద్వారా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.
గతంలో కుప్పం, చిత్తూరు రైల్వే మార్గం పలమనేరు మీదుగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు వచ్చినప్పటికీ అమలు కాలేదు. ఇప్పుడు ఏకంగా హైస్పీడ్ రైల్వే కారిడార్లలో పలమనేరు చోటు సంపాదించడం ప్రాంత చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచే పరిణామంగా స్థానికులు అభిప్రాయపడుతున్నారు. వందేళ్లుగా రైల్వే కూత వినిపించని ఈ పట్టణంలో త్వరలో రైలు ఇంజిన్ శబ్దం మారుమోగబోతుందన్న ఆశ ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. మొత్తంగా చూస్తే పలమనేరు కేంద్రంగా రూపుదిద్దుకుంటున్న చెన్నై, బెంగళూరు హైస్పీడ్ రైలు, బెంగళూరు, విజయవాడ కారిడార్, ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టులు కలిపి ఈ పట్టణ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చే అభివృద్ధి యుగానికి నాంది పలుకుతున్నాయి. శతాబ్ద కాలం నిరీక్షించిన పలమనేరు ప్రజల కల నెరవేరబోతున్న ఈ తరుణంలో, రైల్వే స్టేషన్ నిర్మాణం కేవలం రవాణా సదుపాయం మాత్రమే కాకుండా ప్రాంత ఆర్థిక, పారిశ్రామిక, సామాజిక అభివృద్ధికి బలమైన పునాదిగా నిలవనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
గంగ 1 పలమనేరు రైల్వే స్టేషన్ (ఊహాత్మక చిత్రం)

