8, ఫిబ్రవరి 2026, ఆదివారం

నగరం నడిబొడ్డుకు గజరాజులు…

చిత్తూరును  గజగజలాడించిన ఏనుగులు
 ఇటీవల బావిలో చిరుత మృతదేహం లభ్యం
అటవీశాఖ హై అలర్ట్, రంగంలోకి రెస్క్యూ టీం 
తమిళనాడు నుండి చిత్తూరు జిల్లాలోకి రాక 
రిజర్వ్ ఫారెస్ట్ వైపు మళ్లించడానికి ప్రయత్నాలు
 

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు)

అడవుల్లో సంచరించాల్సిన గజరాజులు జనావాసాల్లోకి దూసుకురావడంతో చిత్తూరు నగరం ఉలిక్కిపడింది. గత కొంతకాలంగా జిల్లా పరిసరాల్లో ఏనుగుల కదలికలు పెరుగుతుండగా, తాజాగా ఆదివారం తెల్లవారుజామునే రెండు ఏనుగులు నగరానికి చేరుకోవడం తీవ్ర భయాందోళనకు దారితీసింది. సంతపేట, మాంగసముద్రం, మురకంబట్టు పరిసరాల్లో ఈ జంట ఏనుగులు తిరుగుతున్నాయన్న సమాచారం వేగంగా వ్యాపించింది. బుడ్డమాను చెరువు పరిసర ప్రాంతాల్లో కూడా అవి సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికే జంకారు. వారం రోజుల కిందట చిత్తూరు సమీపంలోని అడవి ప్రాంతంలో చిరుత మృతదేహం లభ్యమయింది చిరుత ఆహార గోత్రం తిరుగుతూ లోతుగా ఉన్న బావిలో పడి మరణించింది. చిరుతల భయంతో వణికిపోతున్న చిత్తూరు వాసులకు కొత్తగా ఏనుగుల రావడంతో ఈ భయాందోళనలు రెట్టింపు అయ్యాయి.

నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన సంతపేటలో ఏనుగులు ప్రత్యక్షమవడం కలకలం రేపింది. తెల్లవారుజామున వీధుల్లో వాటిని చూసిన స్థానికులు షాక్‌కు గురయ్యారు. సాధారణంగా పంట పొలాలు, అడవి అంచుల్లో కనిపించే ఏనుగులు నగర వీధుల్లోకి రావడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. కొందరు భయంతో ఇళ్ల పైకప్పులపైకి ఎక్కి తలదాచుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఈ జంట ఏనుగులు తమిళనాడు వైపు అటవీ ప్రాంతాల నుంచి కదులుతూ వెదురు కుప్పం, కార్వేటినగరం, పెనుమూరు దాటి చిత్తూరు నగర అంచులకు చేరుకున్నట్లు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ అధికారులు, పోలీసులు రంగంలోకి దిగారు. పలమనేరు నుంచి అనుభవజ్ఞులైన శిక్షకులను రప్పించి ఏనుగులను మళ్లించే చర్యలు చేపట్టారు. టపాకాయలు కాల్చడం, భారీ శబ్దాలు చేయడం ద్వారా వాటిని కోడిగుట్ట రిజర్వ్ ఫారెస్ట్ వైపు దారిమళ్లించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రజలు ఏనుగుల దగ్గరకు వెళ్లకూడదని, సెల్ఫీలు లేదా ఫొటోల కోసం వాటిని ఇబ్బంది పెట్టొద్దని అధికారులు గట్టిగా హెచ్చరించారు. జనసమూహాలను నియంత్రిస్తూ, ఏనుగులను చూసేందుకు గుంపులుగా చేరకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అదృష్టవశాత్తు ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం, పంటనష్టం నమోదు కాలేదని అధికారులు తెలిపారు. వారం రోజుల క్రితం చిత్తూరు సమీపంలో బావిలో పడిపోయి మృతి చెందిన పులి ఘటన ఇంకా ప్రజల మదిలో ఉండగానే, ఇప్పుడు ఏనుగుల సంచారం మరింత భయాన్ని కలిగిస్తోంది. అడవులకు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలు పెరుగుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 
అయితే అధికారులు మాత్రం పరిస్థితి నియంత్రణలోనే ఉందని చెబుతున్నారు. రాత్రి వేళల్లో బయట తిరగకూడదని, గుంపులుగా వెళ్లకూడదని, ఏనుగులను రెచ్చగొట్టే చర్యలు చేయకూడదని సూచించారు. జిల్లా అటవీశాఖ అధికారులు మాట్లాడుతూ, ఏనుగులను సురక్షితంగా అడవిలోకి మళ్లించే చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. జిల్లా కేంద్రంలో వరుసగా వన్యప్రాణుల కదలికలు నమోదవుతుండటం ఆందోళనకరమే అయినప్పటికీ, సమన్వయంతో చర్యలు తీసుకుంటే ప్రమాదాలను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అప్పటి వరకు అప్రమత్తతే రక్షణగా మారింది. చిత్తూరు ప్రజలు గడిచిన రాత్రిని ఉత్కంఠలో గడిపారు; అధికారులు హై అలర్ట్‌లో పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. 

డి ఎఫ్ ఓ వివరణ

జిల్లా అటవీశాఖాధికారి సుబ్బరాజు  మీడియాతో మాట్లాడుతూ ... 2019 సంవత్సరంలో ఇదే తరహాలో రెండు ఏనుగులు సంతపేటకు వచ్చాయన్నారు. ప్రస్తుతం తమిళనాడు చెందిన ఈ రెండు ఏనుగులు గుడిపాల, కార్వేటినగరం, వెదురుకుప్పం మండలాల్లో సంచరిస్తూ చిత్తూరుకు వచ్చినట్లు పేర్కొన్నారు. చెరువులో తిష్ట వేసిన ఏనుగులను ఆదివారం సాయంత్రం సమీపంలోని అడవిలోకి తరిమేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఎఫ్ఓ తెలిపారు. అప్పటివరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *