మామిడి రైతులకు ఏదీ భరోసా ?
మామిడి రైతులకు ఏదీ భరోసా ?
కలెక్టర్ అదేశాలు భేఖాతర్
రూ. 10 వేలకు పడిపోయిన మామిడి
జిల్లాలోని పామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలు అమలు కావడం లేదు. రైతుల్లో భారీ ఎత్తున దోపిడీకి గురవుతున్నా, అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. జిల్లాలో మామిడి ధరలు గణనీయంగా పతనమయ్యాయి. కిలో మామిడిని పది రూపాయలు కూడా కొనడం లేదు. ఈ పరిస్థితుల్లో రైతులకు బాసటగా ఉందాల్చిన జిల్లా అధికారులు చేతులెత్తేశారు. మామిడి రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు.
జిల్లా కలెక్టర్ సగిలి షన్మోహన్ కొంతవరకు ప్రయత్నం చేసినా, మామిడి గుజ్జు ఫ్యాక్టరీ యజమానులు సహకరించకపోవడంతో కలెక్టర్ కూడా మిన్నకున్నారు. మే 10 వ తేదీ నుంచి మే 20 వ తేదీ వరకు జిల్లాలో మామిడి మద్ధతు ధర రూ.19 ని కలెక్టర్ ప్రకటించారు. ఆ మద్ధతు ధర అన్ని ఫ్యాక్టరీలలో అమలు చేసేలా చర్యలు చేపట్టాలని ఉద్యానవన శాఖాధికారులను ఆదేశించారు. 20 వ తేదీ తర్వాత సమావేశం నిర్వహించి తదుపరి మద్ధతు ధరను ప్రకటించడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం ప్రకటించిన మద్ధతు ధరను రైతులు, కొనుగోలుదారుల సమక్షంలో నిర్ణయించడం జరిగిందని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా మామిడి 54,370 హెక్టార్‌లలో (1,36,000 ఎకరాల్లో) సాగు ఉందన్నారు. దాదాపు 68 వేల మంది రైతులు మామిడిని సాగు చేస్తున్నట్లు తెలిపారు. వచ్చిన దిగుబడిని మూడు విడతలుగా కోయడం వల్ల కాయలు సైతం 3 దశలలో వృద్ధి చెందుతాయన్నారు. రైతులందరికీ మేలు కలిగేలా మద్ధతు ధరను ప్రకటించడం జరిగిందన్నారు.
20 తేదిన నిర్వహించ వలసిన సమావేశం ఇప్పటి వరకు జరగా లేదు. రైతులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయినా, రైతు సంఘాలు, జిల్లాలోని రాజకీయ పార్టీలు కూడా ఈ విషయమై సరిగా స్పందించడం లేదు. మొక్కుబడిగా పత్రిక ప్రకటనలకే పరిమితం అవుతున్నారు. జిల్లాలోని శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు గానీ ఈ విషయంలో రైతులకు అండగా నిలబడడం లేదు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కొందరు ప్రజాప్రతినిధులు మామిడి పరిశ్రమల యజమానులకు అండగా నిలిచారని వార్తలు వస్తున్నాయి. ప్రజాప్రతినిధుల అండతో మామిడి ఫ్యాక్టరీల యజమానులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనీ, కలెక్టర్ ఆదేశాలను అమలు చేయడం లేదని ఆవేదన చెందుతున్నారు. మామిడి రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమయ్యాయని విమర్శలు ఉన్నాయి. కనీసం రైతులకు అండగా కూడా నిలువడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం మామిడి రైతులను వారి మానానికి వదిలేశాయి. మామిడి కాయలు ఎప్పుడు కోయాలి? ఎలా సరఫరా చేయాలి? ఎక్కడికి తీసుకెళ్లాలి ? అన్న విషయంలో కూడా సరైన సమాచారం ఇవ్వడం లేదు. జిల్లా కలెక్టర్ ఒక సారి ఫ్యాక్టరీల యజమానులతో సమావేశాలు నిర్వహించారు. మామిడి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరారు. జిల్లా కలెక్టర్ కనీసం 19 రూపాయలు కిలోకు ఇవ్వాలని ప్రకటించడంతో రైతులు ఒక్కసారిగా మామిడికాయలు పోయడం ప్రారంభించారు. దీనితో ఫ్యాక్టరీలకు మామిడి సరఫరా ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం విజయవాడ కాయలు సరఫరా అవుతున్నాయి. జిల్లాలో కాయలు పక్వానికి రావడంతో కోయడం ప్రారంభించారు.
ఇటు జిల్లాలో కాయలు, అటు విజయవాడ కాయలు రావడంతో ఫ్యాక్టరీ యజమానులు మామిడి ధరరను తగ్గించడం ప్రారంభించారు. 21 రూపాయలతో విజయవాడ కాయలు కొన్న ఫ్యాక్టరీలు జిల్లాలోని కాయలకు 19 రూపాయల మద్దతు ధర ఇస్తామని కలెక్టర్ సమక్షంలో అంగీకరించారు. కాయలు పక్వానికి రాలేదని, మాగడం లేదని, జూసు రావడం లేదని రోజుకు రూపాయి వంతున ధర తగ్గిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఫ్యాక్టరీలు టన్నుకు 11 వేల రూపాయలు ఇస్తున్నారు. మండిలల్లో టన్ను 10 వేలు పలుకుతుంది. రైతులు చేయునది లేక 10 రూపాయలు కూడా మండీలలో
విక్రయిస్తున్నారు. దీంతో రైతులు చాలా తీవ్రంగా నష్టపోతున్నారు.
మామిడి ఫ్యాక్టరీలలో ఏం జరుగుతుందన్న విషయం కూడా జిల్లా అధికారులు రైతులకు తెలియజేయడం లేదు. ఎప్పుడు కాయలు కాయలు కోయాలో రైతులకు సమాచారం ఉండడం లేదు. రైతులకు సమాచారం లేకపోవడంతో కోసి, మార్కెటింగ్ చేసుకోలేక తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ విషయంలో రైతులకు అండగా నిలవాల్సిన కూడా ఉద్యానవన శాఖ కూడా తమకు పట్టనట్లు వ్యవహరిస్తోంది. సమాచారం రైతులకు అందడం లేదు. ఏ ఫ్యాక్టరీ మామిడిని ఎంత కొనుగోలు చేస్తుంది రైతుకు తెలియడం లేదు. దీనితో రైతులు ఫ్యాక్టరీల దయకు వదిలేశారు. వారు ఎంత ఇస్తే అంత తీసుకున్తున్నారు.
ఇతర దేశాలకు మామిడి ఎగుమతి ప్రారంభం కాలేదు. వర్తకులు ఇతర రాష్ట్రాల నుంచి
రాలేదు. వర్తకులు ఇతర రాష్ట్రాల నుంచి రాకుండా కొంతమంది అడ్డుకుంటున్నారు అన్న
ప్రచారం కూడా జరుగుతోంది. జిల్లాలోని
మామిడి ఫ్యాక్టరీలు కుమ్మక్కు అయ్యాయని, మామిడి రైతులకు
న్యాయం జరగడం లేదని ఆరోపిస్తున్నారు. దీనితో జిల్లా అధికారులు కూడా ఏమీ చేయలేక
పోతున్నారు. గతంలో మామిడి ధరల పతనం అయినపుడు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర
ప్రకటించి రైతులను ఆదుకోంది. అదే విధంగా
ప్రస్తుతం కూడా మద్దతు ధర ప్రకటించి, ఆ ధర అమలు అయ్యే విధంగా చర్యలు తెసుకోవాలని కోరుతున్నారు. తమను ఆదుకోవాలని మామిడి రైతులు కోరుతున్నారు. జిల్లాలోని ప్రజా
ప్రతినిధులు రైతుల పక్షాన నిలబడి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని
ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని మనవి
చేస్తున్నారు.